కశ్మీర్‌లో జవాన్లకు విమానయానం

Fri,February 22, 2019 01:51 AM

-అన్ని ర్యాంకులవారికీ వర్తింపు
-పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: కశ్మీరు లోయలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం నియమితులైన పారామిలిటరీ జవాన్లు తమ విధుల్లో చేరేందుకు లేదా సెలవు/బదిలీపై వెళ్లేందుకు ఇకపై విమానాల్లో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నట్టు కేంద్రం గురువారం ప్రకటించింది. పుల్వామా దాడి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లోని అన్ని ర్యాంకుల సిబ్బందికి ఢిల్లీ-శ్రీనగర్, జమ్ము-శ్రీనగర్, శ్రీనగర్-జమ్ము సెక్టార్లలో విమాన ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర హోంశాఖ ఓ ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఇన్‌స్పెక్టర్లు లేదా అంతకంటే ఉన్నత ర్యాంకులో కొనసాగుతున్న అధికారులకు మాత్రమే విమాన ప్రయాణ సదుపాయం ఉన్నది. ప్రస్తుతం జమ్ము-కశ్మీర్‌లో ఆంతరంగిక భద్రతను పరిరక్షించేందుకు బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్సెస్బీ, ఎన్‌ఎస్జీ బలగాలతోపాటు దాదాపు 65 వేలమంది సీఆర్పీఎఫ్ జవాన్లను వివిధ రకాల విధుల్లో మోహరించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వీరిని రోడ్డు మార్గం ద్వారా కాకుండా విమానాల్లో ప్రయాణించేందుకు ఎందుకు అనుమతించకూడదన్న ప్రశ్నలు తలెత్తడంతో కశ్మీర్‌లో పనిచేసే అన్ని ర్యాంకుల పారామిలిటరీ బలగాలకు విమాన ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles