అతివాద పార్టీలో మితవాద నేత


Fri,August 17, 2018 07:38 AM

Former Indian PM Atal Bihari Vajpayee dies

ఆయన ప్రసంగం.. పరవళ్లు తొక్కే పద ప్రవాహం! ఆయన రూపం.. నిండైన రాజనీతిజ్ఞతకు నిదర్శనం! ఆయన వ్యక్తిత్వం.. ముక్కుసూటితనం! అతివాద పార్టీలో.. మితవాదిగా నడిచిన విలక్షణ రాజకీయ నాయకుడు! నా కవిత్వం వైఫల్యానికి ముందు మాట కాదు. యుద్ధ ప్రకటన అని చాటుకున్న కవి.. సాహితీవేత్త.. సాహిత్యాభిమాని! స్వాతంత్య్రానికి పూర్వం మొదలైన ఆయన ప్రస్థానం.. స్వతంత్ర భారతదేశ చరిత్రలో గుర్తుండిపోయే అధ్యాయాలతో సాగిపోయింది! ఐదేండ్లపాటు పూర్తికాలం పదవిలో కొనసాగిన ఏకైక కాంగ్రెసేతర పార్టీ నేతగా ఇప్పటికీ ఆయనదే రికార్డు! ఇప్పటి భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పూర్వ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అటల్ బిహారి వాజపేయి జీవితం అనేక ఎత్తుపల్లాలు చూసింది! విద్యార్థి నేతగా, జర్నలిస్ట్‌గా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా, పార్లమెంట్ సభ్యుడిగా, విదేశాంగమంత్రిగా, విపక్ష నేతగా, ప్రజలు అభిమానించిన ప్రధానిగా.. సాగిన ఆయన జీవనయానం దేశ చరిత్రలో దిగ్గజ నాయకుల్లో ఒకరిగా ఆయన పేరును చిరస్మరణీయం చేసింది.
AtalBihariVajpayee1
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణ బిహారీ వాజపేయి, కృష్ణాదేవి దంపతులకు అటల్ జన్మించారు. సరస్వతి శిశుమందిర్‌లో చదువుకున్న ఆయన.. గ్వాలియర్‌లోని ప్రస్తుత లక్ష్మీబాయి కాలేజీ (విక్టోరియా కాలేజీ)లో హిందీ, ఆంగ్లం, సంస్కృతంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కాన్పూర్ డీఏవీ కాలేజీ నుంచి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. చిన్న వయస్సులోనే ఆర్యసమాజ్ యువజన విభాగం ఆర్యకుమార్ సభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత కమ్యూనిజం వైపు మొగ్గుచూసిన వాజపేయి.. బాబా సాహెబ్ ఆప్టే ప్రభావంతో స్వయంసేవక్‌గా మారారు. 1939లో ఆయన ఆరెస్సెస్‌లో చేరారు. 1944లో ఆర్యసమాజ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1942 ఆగస్టులో సోదరుడు ప్రేమ్‌తో కలిసి క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వాజపేయి 23 రోజులు జైల్లో ఉన్నారు. అప్పటికి ఆయన వయసు 18 ఏండ్లే. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనబోనని రాతపూర్వక హామీ ఇచ్చిన తర్వాతే నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను వదిలి పెట్టింది. తర్వాత కూడా ఆ హామీకే ఆయన కట్టుబడి ఉన్నారు. 1949లో సంఘ్ పూర్తికాల కార్యకర్తగా నియమితులయ్యారు. కొద్ది కాలం జర్నలిస్టుగా కూడా వాజపేయి పనిచేశారు. జీవితమంతా బ్రహ్మచారిగానే ఉన్న వాజపేయి.. నమిత కౌల్ భట్టాచార్య అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకున్నారు.
AtalBihariVajpayee2
భారతీయ జన్‌సంఘ్ వ్యవస్థాపక నేతల్లో శ్యామప్రసాద్ ముఖర్జీతోపాటు వాజపేయి కూడా ఉన్నారు. 1948లో గాంధీజీ హత్యోదంతంలో నాటి కేంద్రం ఆరెస్సెస్‌ను నిషేధించడంతో 1951లో దీన్ దయాళ్ ఉపాధ్యాయతో కలిసి భారతీయ జన్‌సంఘ్‌ను స్థాపించారు. 1957లో ఆయ న తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. యువ వాజపేయి పార్లమెంట్‌లో చేసిన తొలి ప్రసంగం చాలామందిని అకట్టుకుంది. వాజపేయి నాయకత్వ లక్షణాలను చూసి తొలి ప్రధాని పండిట్ నెహ్రూ అబ్బురపడ్డారు. విదేశీ ప్రతినిధి బృందానికి వాజపేయిని పరిచయం చేస్తూ ఈ యువకుడు ఏదో ఒకరోజు భారత ప్రధాని అవుతారు అంటూ నెహ్రూ పేర్కొనడం యాదృచ్ఛికం. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ తర్వాత జన్‌సంఘ్ జాతీయ అధ్యక్షుడిగా 1968లో వాజపేయి బాధ్యతలు స్వీకరించారు. నానాజీ దేశ్‌ముఖ్, బలరాజ్ మధోక్, ఎల్‌కే అద్వానీ తదితర నేతలతో కలిసి.. జాతీయ రాజకీయాల్లో జన్‌సంఘ్ ప్రముఖ పాత్ర వహించేలా వాజపేయి చేయగలిగారు. 1971లో బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాకిస్థాన్‌పై జరిపిన యుద్ధంలో భారత సేన విజయం సాధించినప్పుడు.. నాటి ప్రధాని ఇందిరను దుర్గామాతగా వాజపేయి కొనియాడారు.

ఎమర్జెన్సీపై గళం.. అరెస్ట్

1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని వాజపేయి తీవ్రంగా నిరసించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన పలువురు విపక్ష నేతలతోపాటు వాజపేయి కూడా అరెస్టయ్యారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) 1977లో విపక్ష పార్టీలను ఉమ్మడి వేదిక పైకి తెచ్చారు. జేపీ ప్రారంభించిన జనతా పార్టీలో జనసంఘ్‌ను విలీనం చేశారు. 1977 ఎన్నికల్లో జనతాపార్టీ విజయం తర్వాత కొలువుతీరిన మొరార్జీ దేశాయి క్యాబినెట్‌లో విదేశాంగశాఖ మంత్రిగా వాజపేయి పనిచేశారు.
AtalBihariVajpayee3

1996లో అతిపెద్ద పార్టీగా బీజేపీ

1996 ఎన్నికల్లో జాతీయవాద నినాదంతో ప్రచారం నిర్వహించిన బీజేపీ.. ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది. భారత 10వ ప్రధానిగా వాజపేయితో అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ప్రమాణం చేయించారు. కానీ మద్దతు సంపాదించలేక 13వ రోజున ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 1996 నుంచి 1998 వరకు పనిచేసిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పతనం కావడంతో 1998లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1998 ఎన్నికల్లో కొన్ని పార్టీలతో జాతీయ ప్రజాతంత్ర కూటమి(ఎన్డీయే)గా కలిసి పోటీ చేసి బీజేపీ విజయం సాధించడంతో రెండోసారి వాజపేయి ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. మలి దఫా ప్రధానిగా వాజపేయి ఆమోదం తెలుపడంతో 1998 మేలో పోఖ్రాన్‌లో నిర్వహించిన అణుపాటవ పరీక్షలు విజయవంతమయ్యాయి. వాజపేయి సర్కార్‌కు 1999లో అప్పటి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో 1999 ఏప్రిల్ 17న ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం ఒక్క ఓటు తేడాతో పతనమైంది. 13నెలలకే మరోసారి వాజపేయి ప్రభుత్వం కుప్పకూలింది. మధ్యంతర ఎన్నికలు జరిగే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా వాజపేయి కొనసాగారు. ఆ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. 1999 అక్టోబర్ 13న ప్రధానిగా వాజపేయి మూడోసారి ప్రమాణం చేశారు. నాటి నుంచి 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయ్యే వరకు ప్రధానిగా ఉన్నారు. 2004లో లక్నో స్థానం నుంచి లోక్‌సభకు వాజపేయి ఎన్నికయ్యారు. అయితే 2009 లో అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాల నుంచి వైదొలిగారు.

బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా వాజపేయి

తనతోపాటు బీజేఎస్, ఆరెస్సెస్‌లో చేరిన సహచరులు ఎల్‌కే అద్వానీ, బైరాన్‌సింగ్ షెకావత్‌లతో కలిసి 1980లో బీజేపీని వాజపేయి స్థాపించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసిన వాజపేయి.. జనతా ప్రభుత్వం తర్వాత కొలువుదీరిన కాంగ్రెస్(ఆర్) ప్రభుత్వంపై నిశిత విమర్శలు చేశారు. 1980 తర్వాత పంజాబ్‌లో పెరుగుతున్న ఖలిస్థాన్ ఉద్యమాన్ని తీవ్రం గా వ్యతిరేకించారు. విభజన, అవినీతిమయ రాజకీయాలకు ప్రోత్సాహం దేశసమగ్రతకు ముప్పుగా పరిణమిస్తుందంటూ నాటి ప్రధాని ఇందిరపై వాపేయి సునిశిత విమర్శలు చేశారు. అదే ఖలిస్థాన్ ఉద్యమం నాటి ప్రధాని ఇందిరను 1984లో పొట్టన బెట్టుకున్నది. ఇందిర దారుణ హత్యతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తింది. ఫలితంగా 1984 ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాలకే పరిమితమైంది.

దెబ్బతిన్న అరోగ్యం

AtalBihariVajpayee4
2009లో వాజపేయికి తొలిసారి గుండెపోటు వచ్చినప్పటి నుంచి జ్ఞాపకశక్తిని కో ల్పోయారు. నాటినుంచి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఒక కిడ్నీ దెబ్బతినడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. 2015లో నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ భారతరత్న పురస్కారాన్ని వాజపేయి నివాసానికి వెళ్లి ప్రదానం చేసినప్పుడే దేశం ఆయనను చివరిసారిగా చూసింది. ఆయన సహచరుడు అద్వానీ, వాజపేయి చిరకాల మిత్రులు ఎన్‌ఎం ఘటాటే, బీసీ ఖండూరీ తరుచూ వాజపేయి నివాసానికెళ్లి ఆయన యోగక్షేమాలు కనుక్కునేవారు. వాజపేయి పుట్టినరోజున మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏటా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపేవారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. వాజపేయి జన్మ దినోత్సవం డిసెంబర్ 25ను జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నది.

పాక్‌తో దౌత్యం

AtalBihariVajpayee7
కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్థాన్ సైనిక పాలకుడు పర్వేజ్ ముషరఫ్‌ను ఢిల్లీకి ఆహ్వానించి, పాక్‌తో శాంతి చర్చల ప్రక్రియను వాజపేయిపునః ప్రారంభించారు. ముషరఫ్‌తో ఆగ్రాలో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. వాజపేయి హయాంలోనే 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. ప్రధాని, ఉపరాష్ట్రపతి తదితర ప్రముఖులెవ్వరికీ హాని జరుగక పోయినా పలువురు భద్రతా జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కశ్మీర్ రాష్ర్టాల పరిధిలోని సరిహద్దుల్లో ఐదు లక్షల మంది సైనికులను నియమించాలని వాజపేయి ఆదేశించారు. విపక్షాల గట్టి వ్యతిరేకత మధ్య వాజపేయి హయాంలోనే ఉగ్రవాదుల నిర్మూలనకు పోటా చట్టాన్ని పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆమోదించారు. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు వాజపేయి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి పెట్టాయి. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ రాజధర్మం పాటించలేదని వాజపేయి వ్యాఖ్యానించారు. వాజపేయి ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు గ్రామీణ భారతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ఉపకరించాయి. దేశం నలుమూలలను కలుపుతూ రహదారుల్ని నిర్మించే స్వర్ణచతుర్భుజి ప్రాజెక్టును వాజపేయి ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనేక మారుమూల పల్లెలకు రహదారుల్ని నిర్మించింది. 2004 ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ లోక్‌సభలో విపక్ష నేత బాధ్యతలు స్వీకరించేందుకు వాజపేయి నిరాకరించారు. 2009లో పూర్తిగా రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

నాలుగు దశాబ్దాల పార్లమెంటరీ జీవితం

AtalBihariVajpayee6
1957 నుంచి 47ఏండ్లు పార్లమెంటేరియన్‌గా వాజపేయి కొనసాగారు. పది సార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యా రు. ఎన్నికయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన ఘనత సాధించిన ఏకైక రాజకీయనేతగా నిలిచారు. పార్లమెంట్‌లో 500కుపైగా ప్రసంగాలు పూర్తిచేసిన వాజపేయి ఎదుటివారు తమ తప్పుల్ని అంగీకరించేలా లోపాల్ని ఎత్తిచూపేవారు. ఆయన తన వాగ్ధాటితో సీరియస్ అంశాల్ని ప్రస్తావించే తీరును విపక్ష నేతలూ అభిమానించేవారు. 1996లో తొలుత 13 రోజులు, 1998 లో 13నెలలు ప్రధానిగా పనిచేసిన వాజపేయి.. 1999 నుంచి 2004 మే వరకు ప్రధానిగా ఉన్నారు. స్వాతంత్య్రానంతర భారత్‌లో ఐదేండ్లపాటు పూర్తికాలం పదవిలో కొనసాగిన ఏకైక కాంగ్రెసేతర ప్రధాని ఆయనే.

చైనా దురాక్రమణపై నెహ్రూకు నిరసన

1962 అక్టోబర్ 20న భారత భూభాగంలోకి చైనా సేనలు చొచ్చుకు రావడంతో అదే నెల 26న నెహ్రూ ప్రభుత్వం జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీనిపై 36 ఏండ్ల యువనేతగా వాజపేయి.. నలుగురు సహచర ఎంపీలతో కలిసి ప్రధాని నెహ్రూను కలుసుకుని, నిరసన తెలిపారు. తక్షణం పార్లమెంట్‌ను సమావేశ పర్చాలన్నారు. వాజపేయికంటే నెహ్రూ వయస్సు రెండింతలెక్కువ. అయినా చైనా దురాక్రమణపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అదే ఏడాది నవంబర్ 8న పార్లమెంట్‌ను సమావేశ పరిచారు.

కాందహార్‌లో ఉగ్రవాదుల అప్పగింత

1999 డిసెంబర్‌లో కఠ్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. భారత్ చెర లోని మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను అప్పగించాలని డిమాం డ్ చేశారు. దేశవ్యాప్త ఒత్తిడితో వాజపేయి సర్కార్ దిగివచ్చింది. నాటి విదేశాంగశాఖ మంత్రి జశ్వంత్‌సింగ్.. మసూద్ సహా ఇతర ఉగ్రవాదులను ఆఫ్ఘన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లి విమాన ప్రయాణికులను విడిపించారు.
AtalBihariVajpayee5

1435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles