సీబీఐ కస్టడీకి క్రిస్టియన్ మిషెల్


Thu,December 6, 2018 02:19 AM

five day CBI custody for Christian Michel

-అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణం..
-ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు
-ఐదు రోజుల సీబీఐ విచారణకు కోర్టు అనుమతి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.3,600 కోట్ల అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిషెల్‌ను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)నుంచి వచ్చిన మిషెల్‌ను మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మిషెల్‌ను హాజరుపరిచారు. మిషెల్ తన న్యాయవాదితో కేసు విషయాలు మాట్లాడేందుకు జడ్జి అరవింద్ కుమార్ అనుమతించారు. కుంభకోణంలో వాస్తవాల్ని వెలికి తీసేందుకు నిందితుడిని 14 రోజులపాటు తమ కస్టడీకి అనుమతివ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. ఇరు పక్షాల వాదనల తర్వాత మిషెల్‌ను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జడ్జి అరవింద్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. డిసెంబర్ 10న ఈ కేసుపై విచారణ జరుగనున్నది. మరోవైపు బెయిల్ కోరుతూ మిషెల్ తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్ బలగాలను భారీగా కోర్టు వద్ద మోహరించారు. ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ నేతృత్వంలో రాఅధికారులు మిషెల్‌ను భారత్‌కు తేవడంలో కీలకపాత్ర పోషించారు.

ఏపీ, ఎఫ్‌ఏఎం అంటే ఎవరు?

అగస్టా ఒప్పందంలో భాగంగా ఏపీ, ఎఫ్‌ఏఎం అనే ప్రముఖులతోపాటు ఇద్దరు భారత వాయు సేన సీనియర్ అధికారులకు మిషెల్ ముడుపులు చెల్లించారనే అభియోగాలపై సీబీఐ ప్రధానంగా దృష్టిసారించింది. ఐదు ప్రశ్నలతో ప్రశ్నావళిని అతడికి అప్పగించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఏపీ, ఎఫ్‌ఏఎం అనే వివరాల్ని మరో మధ్యవర్తి గుయిడో హోష్కే ఓ డైరీలో రాసినట్లు సీబీఐ గుర్తించింది. వీటి ఆధారంగానే మిషెల్‌ను ప్రశ్నించింది. మరోవైపు ఏపీ అంటే సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్‌పటేల్ అని బీజేపీ ఆరోపించింది. ఎఫ్‌ఏఎం అంటే గాంధీ కుటుంబం అని పేర్కొన్నది. మిషెల్ తరఫు న్యాయవాది, యూత్ కాంగ్రెస్ నేత అల్జొ కే జోసెఫ్‌ను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS