ఫ్యూయెల్ చాలెంజ్‌ను స్వీకరించండి!


Fri,May 25, 2018 08:21 AM

Fitness contest turns into fuel challenge

-పెట్రో ధరలను తగ్గించండి
-ప్రధాని మోదీకి రాహుల్‌గాంధీ సవాల్

న్యూఢిల్లీ, మే 24: భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఆన్‌లైన్ ఫిట్‌నెస్ సవాల్‌ను ప్రధానమంత్రి అంగీకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు మోదీపై పదునైన విమర్శలకు తెరలేపారు. హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ అనే నినాదంతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ ఆన్‌లైన్ ఫిట్‌నెస్ సవాల్‌ను ప్రారంభించారు. దీనిని స్వీకరించిన విరాట్ కోహ్లీ వ్యాయామం చేస్తున్న తన వీడియోను పోస్ట్ చేస్తూ ప్రధాని మోదీకి ఫిట్‌నెస్ సవాల్‌ను విసిరారు. ప్రధాని మోదీ ఆ సవాల్‌ను స్వీకరించిన నేపథ్యంలో దేశంలో భారీగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు ఫ్యూయెల్ చాలెంజ్‌ను స్వీకరించాలని రాహుల్‌గాంధీ ప్రధానిపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ప్రియమైన ప్రధానమంత్రి గారు, విరాట్ ఫిట్‌నెస్ చాలెంజ్‌ను మీరు స్వీకరించడం సంతోషంగా ఉంది. నా నుంచి కూడా ఒక చాలెంజ్‌ను అందుకోండి. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలను తగ్గించండి. లేదా మా పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రం మెడలు వంచుతుంది. మీ స్పందన కోసం ఎదురుచూస్తాం అని రాహుల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా కూడా ప్రధానమంత్రికి ఒకటికి మించి సవాళ్లు విసిరారు. కేంద్ర పన్నులశాఖ ద్వారా దోచుకున్న రూ.10 లక్షల కోట్లను ఉపయోగించి పెట్రోల్ ధరలు తగ్గించాలని తద్వారా సామాన్య ప్రజల ఎకనామిక్ ఫిట్‌నెస్‌ను కాపాడాలని సవాల్ విసిరారు.
Rahul-gandhi

వరుసగా 11వ రోజు కూడా పెట్రోల్ ధరలు పెరుగుతున్నా ప్రధాని మౌనంగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. పెట్రో ధరలు పడిపోతే అది సంక్షేమ పథకాలపై ప్రభావం చూపుతుందని కేంద్ర మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చి జాబ్ ఫిట్‌నెస్‌ను కాపాడాలని, రూ.80 లక్షల కోట్ల నల్లధనాన్ని వెనుకకు తెచ్చి రైతులకు మద్దతు ధర కల్పించాలని సుర్జేవాలా డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు నేషనల్ సెక్యూరిటీ ఫిట్‌నెస్ చైనా చొరబాట్లను అడ్డుకునేందుకు గవర్నెన్స్ చాలెంజ్, రైతులకు మద్దతు ధర కోసం ఎంఎస్పీ ఫిట్‌నెస్, నల్లధనాన్ని వెనుకకు తెచ్చేందుకు యాంటీ కరప్షన్ చాలెంజ్ లను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

564
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS