నేటి నుంచి పార్లమెంట్


Mon,June 17, 2019 02:18 AM

First Day Of Parliament After Polls Today Budget On July 5

-జూలై 26 వరకు సమావేశాలు
-తొలి రెండు రోజులు కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం
-19న స్పీకర్ ఎన్నిక.. జూలై 5న కేంద్ర బడ్జెట్

న్యూఢిల్లీ: పదిహేడో లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ 30 రోజులు, రాజ్యసభ 27 రోజులపాటు సమావేశం కానున్నాయి. జూలై 26తో సమావేశాలు ముగుస్తాయి. తొలి రెండు రోజులు లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. 19న కొత్త స్పీకర్ ఎన్నిక జరుగనుంది. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు.

జూలై 4న ఆర్థిక సర్వే, ఆ మరుసటి రోజు కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. మోదీ సర్కారు తొలి పర్యాయంలో మొత్తం 10 ఆర్డినెన్సులు జారీ చేయగా, రాజ్యసభలో విపక్షాలదే పైచేయి కావడంతో వాటిని అడ్డుకున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు, జమ్ము కశ్మీర్ రిజర్వేషన్, ఆధార్ చట్టం, కంపెనీల చట్టం, భారత వైద్య మండలి చట్ట సవరణ బిల్లులకు సంబంధించి మరోసారి కేంద్రం ఆర్డినెన్సులు జారీ చేసింది. ఈ సమావేశాల్లో ఈ ఆర్డినెన్సుల స్థానంలో ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ ఆదివారం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించింది. అలాగే ఎన్డీయే పక్ష నేతలు కూడా ప్రత్యేకంగా సమావేశమై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సబ్‌కాసాత్, సబ్‌కావికాస్, సబ్‌కావిశ్వాస్ స్ఫూర్తిని చాటే బిల్లుల ఆమోదానికి కృషి చేస్తామని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాం అని సమావేశం అనంతరం ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.

161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles