బెంబేలెత్తిస్తున్న నిపా


Fri,May 25, 2018 06:54 AM

Fear That Nipah Virus Has Crossed Border From Kerala To Karnataka

- వైరస్ సోకి మరొకరు మృతి:11కు చేరిన మృతుల సంఖ్య
-కర్ణాటకలోనూ రెండు నిపా అనుమానిత కేసులు

కోచి, మే 24: కేరళను గజగజ వణికిస్తున్న ప్రాణాంతక వైరస్ నిపా బారినపడి మరొకరు మృతిచెందారు. దీంతో ఈ వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 11కు చేరింది. కోజికోడ్‌లో మరొక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడని, అతడు నిపా కారణంగానే చనిపోయాడా లేదా అన్న విషయం తేలాల్సి ఉన్నదని కోజికోడ్ జిల్లా మెడికల్ అధికారిణి డాక్టర్ జయశ్రీ తెలిపారు. మూసా(61) అనే వ్యక్తికి నిపా వైరస్ సోకడంతో గత ఐదురోజుల నుంచి చికిత్స తీసుకుంటూ గురువారం మరణించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 160 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం పంపామని, అందులో 13 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించామని చెప్పారు. ఈ 13 మందిలో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి మూసా కుటుంబంలో ఇప్పటి వరకు నలుగురు మరణించారని వివరించారు. ఇంతకుముందు మూసా కుమారులు మహ్మద్ సాలియా, మహ్మద్ సాదిక్, బంధువు మరియమ్మ ఈ వైరస్ కారణంగా మరణించారని చెప్పారు. మూసా కుటుంబానికి చికిత్స అందించిన నర్సు లిని పుత్తుసెరి కూడా నిపా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారని డాక్టర్ జయశ్రీ తెలిపారు. వైరస్ తీవ్రత దృష్ట్యా పర్యాటకులు కోజికోడ్, మలప్పురం, వయానంద్, కన్నూర్ జిల్లాల్లో పర్యటించవద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. నిపా మరణాలు ఎక్కువగా కోజికోడ్, మలప్పురం జిల్లాలోనే నమోదయ్యాని వివరించారు. ఈ వైరస్ వల్ల మరణాలు సంభవించకుండా ఉండటానికి.. రోగులకు చికిత్స కోసం కొన్ని చోట్ల అవుట్‌పోస్టు వార్డులను ఏర్పాటు చేశామని డాక్టర్ జయశ్రీ తెలిపారు. కోజికోడ్ జిల్లా కలెక్టర్ యూవీ జోస్ మాట్లాడుతూ నిపా వైరస్ కారణంగా జిల్లాల్లో అన్ని శిక్షణ తరగతులను, వేసవి శిబిరాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. చిన్న పిల్లలకు వైరస్ సోకకుండా ఉండేందుకు అంగన్‌వాడీ కేంద్రాలను కూడా మూసివేసినట్లు తెలిపారు.
Nipah

వేసవి సెలవుల తర్వాత పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ ఆంక్షలను పక్కనే ఉన్న మలప్పురం జిల్లాలోనూ అమలు చేస్తున్నారని వివరించారు. మరోవైపు వైరస్ తీవ్రతను అంచనా వేయడానికి, ఈ వైరస్ మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ నుంచి కేరళకు వచ్చిన ఉన్నతస్థాయి బృందం నిత్యం పర్యవేక్షిస్తున్నది. నిపా వైరస్‌ను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేరళ సీఎం పినరాయి విజయన్ గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని, నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈనెల 25న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కోజికోడ్ జిల్లాలోని మూసా ఇంటిలో ఉన్న పాడుపడిన బావిలో చనిపోయిన గబ్బిలాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు వెల్లడైంది. వాటి ద్వారానే ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని అంచనా. కాగా, కర్ణాటకలో రెండు అనుమానిత నిపా కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరస్ కేరళ నుంచి కర్ణాటకకు వ్యాప్తి చెందిందా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు.

1879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles