ఉగ్ర సంబంధాలపై ఎఫ్‌ఏటీఎఫ్‌కు నివేదిక

Sun,February 17, 2019 02:21 AM

పాక్‌పై ఆధారాలతో సహా రూపొందిస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్థాన్ ప్రమేయాన్ని రుజువు చేసే నివేదికను భారత్.. ఉగ్రవాదులకు నిధులందజేసే వారిపై నిఘావేసే అంతర్జాతీయ సంస్థ (ఎఫ్‌ఏటీఎఫ్)కు అందజేయనుంది. ఉగ్రవాదులతో పాక్‌కు గల సంబంధాలను బట్టబయలు చేయడం ద్వారా ఆ దేశాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని కోరనున్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు. పుల్వామాలో దాడికి పాల్పడిన జైషే మొహమ్మద్ (జేఈఎం)కు సంబంధించి సేకరించిన ఆధారాలు, ఆ సంస్థకు పాక్ నుంచి అందుతున్న సహాయంపై వివరాలతో నివేదికను రూపొందిస్తున్నట్టు ఆ అధికారులు తెలిపారు. గతంలో జేఈఎం జరిపిన దాడుల వివరాలను కూడా ఈ నివేదికలో పొందుపర్చనున్నట్టు చెప్పారు. ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీ, కార్యనిర్వాహక బృందం సమావేశాలు వచ్చేవారం పారిస్‌లో జరుగనున్నాయి. ఒక దేశాన్ని ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడమంటే.. ఉగ్రవాదులకు నిధులు అందకుండా, హవాలాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఆ దేశం సహకరించడం లేదని గుర్తించడం. అలా గుర్తింపు పొందిన దేశాలకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఐరోపా యూనియన్ తదితర సంస్థలు నిధుల మంజూరులో ప్రాధాన్యమివ్వవు.

485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles