అన్నదాత మహా విజయం


Tue,March 13, 2018 05:08 AM

Farmers stir Under pressure Maharashtra govt accepts demands

-రైతుల డిమాండ్లకుమహారాష్ట్ర సర్కార్ అంగీకారం
-శాంతియుతంగా సాగినకిసాన్ లాంగ్‌మార్చ్ విరమణ
-రైతులకు ఆత్మీయ స్వాగతం పలికిన ముంబైకర్లు
-భోజనం అందించిన డబ్బావాలాలు

Farm
ముంబై, మార్చి 12: రుణ మాఫీ, కనీస మద్దతు ధర వంటి డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీని ముట్టడించేందుకు తరలివచ్చిన వేల మంది రైతుల ముందు మహారాష్ట్ర సర్కార్ తలవంచింది. వారి డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా వాగ్దానం చేసింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం రైతుల ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని రాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ చెప్పారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న అటవీ భూములను వారికే అప్పగించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకుంటారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. రుణ మాఫీ, పంటకు కనీస మద్దతు ధర పెంపు, పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర డిమాండ్ల కోసం అసెంబ్లీని ఘెరావ్ చేసేందుకు వచ్చిన రైతులకు ముంబైకర్లు ఘన స్వాగతం పలికారు. నాసిక్‌లో బయల్దేరి ఆరు రోజులు కాలినడకన 180 కిలోమీటర్లు నడిచి వచ్చిన రైతులు ఆదివారమే ముంబైకి చేరుకున్నారు. వేల మంది రైతులు ఎర్ర జెండాలు చేతపట్టుకొని ఎర్ర టోపీలు ధరించడంతో ఆజాద్ మైదాన్ ఎర్ర సముద్రాన్ని తలపించింది.

ఆదివారం రాత్రి సియన్‌లోని సోమయ్య గ్రౌండ్స్‌కు చేరుకున్న అన్నదాతలు సోమవారం వేకువ జామునే ఆజాద్ మైదాన్‌కు వచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో అసెంబ్లీ వైపు బయల్దేరాలని తొలుత నిర్ణయించిన రైతులు, పరీక్షలు రాసే విద్యార్థులకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని ర్యాలీని రాత్రికి వాయిదా వేసుకున్నారు. ఈ లోపు వారి వద్దకు ప్రభుత్వం కొందరు ప్రతినిధులను పంపడంతో సమస్య శాంతియుతంగా పరిష్కారమైంది. సీఎం ఫడ్నవీస్ రైతు ప్రతినిధులతో సుమారు రెండుగంటలు చర్చలు జరిపారు. ఈ భేటీకి ప్రతిపక్ష నాయకులను, కొందరు మంత్రులను సైతం అనుమతించలేదు. ఈ చర్చల్లో రైతుల పక్షాన ఏఐకేఎస్ అశోక్ ధావలే, సీపీఎం ఎమ్మె ల్యే జీవా పండు గవిట్ పాల్గొన్నారు. రైతులు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు సెంట్రల్ రైల్వే ఒక ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది.

Farmer3

అసెంబ్లీలో చర్చ

రైతులు, గిరిజనుల డిమాండ్ల పట్ల తమ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖేపాటిల్ చర్చను ప్రారంభించారు. రైతులు ముంబై చేరుకున్నాక మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేయటం ఏమిటన్నా రు. రైతులు ఎంతో క్రమశిక్షణతో ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ అన్నారు.

ముంబైకర్ల ఆత్మీయ స్వాగతం

మండుటెండలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ముంబైకి చేరుకున్న రైతులకు నగరవాసులు ఆత్మీయ స్వాగ తం పలికారు. వారు అక్కడికి చేరుకోగానే కొందరు భోజన పదార్థాలు, మంచినీరు అందించారు. నగరంలోని కొన్ని జంక్షన్ల వద్ద రైతులకు కొందరు బిస్కెట్లు పంచారు. ముంబై లో ప్రసిద్ధి చెందిన డబ్బావాలాలు నగరవాసుల ఇండ్ల నుంచి భోజన పదార్థాలు సేకరించి రైతులకు తెచ్చి ఇచ్చారు. మనకు అన్నాన్ని అందిస్తున్న అన్నదాతలకు సహాయం చేయాలని ముందే నిర్ణయించాం. దాదర్ నుంచి కొలాబా మధ్య పనిచేసే మా సహచరుల (డబ్బావాలాల)ను ఇండ్ల నుంచి భోజనం సేకరించాలని చెప్పాం అని ముంబై డబ్బావాలా అసోసియేషన్ ప్రతినిధి సుభాష్ తాలేకర్ చెప్పారు. రైతులు సైతం నగరవాసులకు ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, ట్రాఫిక్‌కు ఆటం కం కలిగించబోమని ముందే ప్రకటించారు. వామపక్ష అనుబంధ సంఘమైన కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వారి చేతుల్లో ఎర్ర జెండాలతో రోడ్లు ఎరుపు రంగును సంతరించుకున్నాయి.

Medical-treatment

రాజకీయ పార్టీల మద్దతు

రైతుల డిమాండ్లకు కాంగ్రెస్, ఎన్సీపీ, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార భాగస్వామిగా ఉన్న శివసేన కూడా మద్దతు తెలిపాయి. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తమ అహాన్ని పక్కన పెట్టి రైతుల న్యాయమైన డిమాండ్లకు ఆమోదం తెలుపాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ముంబైలో జరిగిన రైతుల భారీ ర్యాలీ ప్రజాశక్తికి నిదర్శనమని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. బీజేపీ యువజన విభాగం అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ రైతులనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులంటే తనకు గౌరవమని, అయితే వారు ఎర్ర జెండాలు పట్టుకోవడం విచారకరమని అన్నారు. వారి చేతుల్లో ఎర్ర జెండాలున్నా తమ మద్దతు రైతులకేనని శివసేన స్పష్టం చేసింది.

డిమాండ్లివే..

తాము తీసుకున్న పంట రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కల్పించిన ఆర్థిక ఉపశమన పథకానికి చాలామంది అర్హులు కాలేకపోయారు. దీంతో తమ అసంతృప్తిని ప్రభుత్వానికి తెలియజేయడానికి వారు మండుటెండను సైతం లెక్కచేయకుండా, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తరలివచ్చారు. ఈ ర్యాలీకి నేతృత్వం వ హించిన ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్).. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాం డ్ చేస్తున్నది. ఉత్పత్తి ఖర్చును ఒకటిన్నర రెట్లు చెల్లించాలని, రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్దేశించాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది.

ఈ ర్యాలీ లో పాల్గొన్న ఆదివాసీలు, గిరిజన రైతులు కొన్నేండ్లుగా తాము సాగుచేస్తున్న భూములను తమ పేరిట బదిలీ చే యాలని, తమకు లబ్ధి చేకూర్చే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారులు, బుల్లెట్ రైలు ప్రాజెక్టుల కోసం తమ భూములను బలవంతంగా తీసుకోరాదని రైతులు కోరారు. వడగండ్లు లేదా పత్తి పురుగు బారిన పడిన పంటలకు ఎకరాకు రూ.40 వేలు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. రైతులనుద్దేశించి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ, రైతులు ఈ దేశ కొత్త సైనికులని, వారు ప్రభుత్వాలను పెకిలించవేయగలరని అన్నారు.

1285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS