మాయా ‘మీడియా’

Thu,November 14, 2019 01:49 AM

-భారత సంస్థల కనుసన్నల్లో నడుస్తున్న 265 వెబ్‌సైట్లు
-65 దేశాల్లో విస్తరించిన నకిలీ మీడియా
-వెన్నుదన్నుగా నిలుస్తున్న కార్పొరేట్లు, ప్రజాప్రతినిధులు
-భారత ప్రభుత్వానికి అనుకూలంగా, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు ప్రసారం
-ఈయూ డిస్‌ఇన్ఫో ల్యాబ్‌ సంస్థ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ, నవంబర్‌ 13: అదొక కండ్లు చెదిరే మీడియా ప్రపంచం. దానిలో ఒకటికాదు.. రెండుగాదు.. ఏకంగా 265 న్యూస్‌ వెబ్‌సైట్లు ఉన్నాయి. అవి 65 దేశాల్లో పనిచేస్తున్నాయి. వాటికి కేంద్ర బిందువు మన దేశ రాజధాని ఢిల్లీ. భారత ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ, పాకిస్థాన్‌ను నిందిస్తూ ఆయా దేశాల ప్రజలను, పాలకులను ప్రభావితం చేయడం ఈ ‘మాయా మీడియా’ లక్ష్యం. ఐక్యరాజ్యసమితి, యురోపియన్‌ యూనియన్‌లను కూడా ప్రభావితం చేసే స్థాయికి ఈ మీడియా విస్తరించింది. ‘ఈయూ డిస్‌ఇన్ఫో ల్యాబ్‌' అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) ఈ సంచలన ఆరోపణలు చేసింది. ఆ వివరాలు..

ఢిల్లీ టు బ్రస్సెల్‌

జర్మనీలోని బ్రస్సెల్స్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఈపీటుడే.కామ్‌' అనే వెబ్‌సైట్‌ రష్యాటుడే, వాయిస్‌ ఆఫ్‌ అమెరికా వంటి మీడియా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఎంపిక చేసిన కథనాలను యథాతథంగా తన వెబ్‌సైట్‌లో ప్రచురిస్తున్నదని యురోపియన్‌ యూనియన్‌ ప్రభుత్వం గుర్తించింది. ఇందులో పాకిస్థాన్‌లోని మైనార్టీల గురించి, భారత్‌కు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. దీనిపై ‘ఈయూ డిస్‌ఇన్ఫో ల్యాబ్‌'కు అనుమానాలు మొదలయ్యాయి. లోతుగా అధ్యయనం చేయగా ‘ఈపీటుడే.కామ్‌'ను భారత్‌కు చెందిన వ్యక్తులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వీరికి ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రీవాస్తవ గ్రూప్‌తోపాటు పలు అధ్యయన సంస్థలు, ఎన్జీవోలతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. శ్రీవాత్సవ గ్రూప్‌ అండతో ‘న్యూఢిల్లీ టైమ్స్‌' అనే వెబ్‌సైట్‌, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ నాన్‌-అలైన్డ్‌ స్టడీస్‌ (ఐఐఎన్‌ఎస్‌) అనే ఎన్జీవో నడుస్తున్నట్టు గుర్తించారు. ఇటీవల ఐఐఎన్‌ఎస్‌ ఆధ్వర్యంలో యురోపియన్‌ యూనియన్‌కు చెందిన 27 మంది ఎంపీల బృందం ప్రధాని మోదీని కలుసుకొని, కశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. జరిగింది. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వార్తలు ఐఐఎన్‌ఎస్‌ ద్వారా ఈపీటుడే.కామ్‌కు చేరినట్టు డిస్‌ఇన్ఫో ల్యాబ్‌ గుర్తించింది.

తీగలాగితే డొంక కదిలింది

డిస్‌ఇన్ఫో ల్యాబ్‌ మరింత లోతుగా అధ్యయనం చేయగా జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న ‘టైమ్స్‌ ఆఫ్‌ జెనీవా.కామ్‌' అనే ఆన్‌లైన్‌ న్యూస్‌పేపర్‌ ఈపీటుడే.కామ్‌ వంటి కథనాలనే ప్రచురిస్తున్నట్టు గుర్తించారు. ప్రధానంగా కశ్మీర్‌ అంశంలో పాకిస్థాన్‌ను విమర్శి స్తూ వార్తలు ప్రచురించిందని, పాక్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇచ్చిందని తేలింది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం ప్రధాన కార్యాలయం జెనీవాలోనే ఉన్నది. ఈపీటుడే, టైమ్స్‌ ఆఫ్‌ జెనీవాకు యురోపియన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ పాకిస్థానీ మైనార్టీస్‌ (ఈవోపీఎం), పాకిస్థానీ ఉమెన్స్‌ హ్యూమన్‌రైట్స్‌ ఆర్గనైజేషన్‌ వంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయని డిస్‌ఇన్ఫో ల్యాబ్‌ గుర్తించింది. వీటికి ఒకే సర్వర్‌ ఉన్నదని, ఎన్జీవోలకు చెందిన కొందరు ఉద్యోగులు వైబ్‌సైట్లకు పనిచేస్తున్నట్టు ఆధారాలతో సహా నిర్ధారించింది. ఈ సంస్థలు పాక్‌లోని మైనార్టీలు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతున్నట్టు సమాచారం. దీనిని బట్టి ఈపీటుడే.కామ్‌.. యురోపియన్‌ యూనియన్‌ను, టైమ్స్‌ ఆఫ్‌ జెనీవా.. ఐక్యరాజ్యసమితిని తమ కథనాలతో ప్రభావితం చేస్తున్నాయని డిస్‌ ఇన్ఫోల్యాబ్‌ ఆరోపించింది. ఈ సంస్థలు 2010 నుంచి పనిచేస్తున్నాయని చెప్పింది.

ఆయా సంస్థల సర్వర్లు, ఐపీ అడ్రస్‌లు, ట్విట్టర్‌ ఖాతాలను బట్టి మరింత లోతుగా అధ్యయనం చేయగా ‘4న్యూస్‌ఏజెన్సీ.కామ్‌' తెరపైకి వచ్చింది. ఇది స్విట్జర్లాండ్‌, బెల్జియం, థాయిలాండ్‌, దుబాయ్‌కి చెందిన న్యూస్‌ ఏజెన్సీలు కలిసి ఏర్పాటుచేసిన సంస్థ. దీని ఉద్యోగులు 100 దేశాల్లో ఉన్నారు. ‘4న్యూస్‌ఏజెన్సీ.కామ్‌' కూడా ఈపీటుడే, టైమ్స్‌ ఆఫ్‌ జెనీవా మాదిరిగానే పనిచేస్తున్నదని డిస్‌ఇన్ఫో గుర్తించింది. ఇలా లోతుగా విశ్లేషించగా మొత్తం 65 దేశాల్లో విస్తరించిన 265 వెబ్‌సైట్ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు బయటపడింది. ఇవన్నీ ఒకే పద్ధతిలో వార్తలను ప్రచురిస్తునట్టు గుర్తించింది. స్థానికంగా పేరొందిన మీడియా సంస్థల పేర్లకు తోకలను తగిలించి ఈ వెబ్‌సైట్లను రూపొందించినట్టు తేల్చింది. ఇవన్నీ సిండికేటెడ్‌ న్యూస్‌ ఏజెన్సీలు అందించే సమాచారాన్నే ఎక్కువగా ప్రచురిస్తున్నాయని, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా, భారత్‌కు అనుకూలంగా వచ్చే కథనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపింది.

ఎందుకిలా?

ఎంపిక చేసిన అంశాలనే ప్రచురించడం, ఈవెంట్లకు కవరేజీ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయంగా ప్రభావితం చేస్తున్నాయని డిస్‌ఇన్ఫోల్యాబ్‌ తెలిపింది. ఒకే వార్తను ఒకే కోణంలో ఒకటికన్నా ఎక్కువ వెబ్‌సైట్లలో ప్రచురించడం ద్వారా పాఠకులపై బలమైన ముద్ర వేస్తున్నాయని పేర్కొన్నది. ఆయా ఎన్జీవోలకు విస్తృతంగా ప్రచారం చేస్తూ లబ్ధి చేకూరుస్తున్నాయని వివరించింది.

915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles