
-రైతాంగ సమస్యలు, నిరుద్యోగంపై చీల్చిచెండాడండి-కేంద్ర నిరంకుశ పాలనపై వాగ్బాణాలు సంధించండి-సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులకు రాహుల్ దిశానిర్దేశం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రధాని నరేంద్రమోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగించాలని పార్టీ ఆఫీస్ బేరర్లకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దిశానిర్దేశం చేశారు. రైతాంగ సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యల పరిష్కారంలో విఫలమైన కేంద్రంపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టాలని సూచించారు. ప్రధాని మోదీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు రాష్ర్టాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో రాహుల్ ఆదివారం భేటీ అయ్యారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సమస్యలపై అక్కడి కాంగ్రెస్ నాయకత్వం ప్రధానంగా దృష్టిసారించి పోరాటాలు నిర్వహించాలని రాహుల్ సూచించారు. లోక్‌సభకు పోటీచేసే పార్టీ అభ్యర్థుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, పార్టీ శ్రేణుల ఆలోచనలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు. వీలైనంత తొందరగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరుగాలని దిశానిర్దేశం చేశారు. మోదీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా, మహిళా, యువత, రైతు వ్యతిరేక విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ముఖ్యంగా రైతాంగ సమస్యలు, నిరుద్యోగంపై పోరాడాలని సూచించారు. రాజ్యాంగ సంస్థలు, దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తిని, విశ్వసనీయతను దెబ్బతీసేందుకు మోదీ సర్కారు చేస్తున్న కుటిల యత్నాలను ప్రజల్లో ఎండగట్టాలని కోరారు. ఇటీవల తాను ప్రకటించిన కనీస ఆదాయ గ్యారెంటీ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. గతంలో యూపీఏ సర్కారు అనుసరించిన రైతాంగ, ప్రజా అనుకూల విధానాలు, రుణమాఫీ తదితర పథకాలను ప్రచారం చేయాలని కోరారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల్ని, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు వివిధ రాష్ర్టాల సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులతో భేటీ అయ్యాను. ఈ సందర్భంగా పలు అంశాలను విస్తృత స్థాయిలో చర్చించాం అని అనంతరం రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.