ప్రతీ కన్నీటిబొట్టుకూ ప్రతీకారం తప్పదు

Sun,February 17, 2019 02:50 AM

-ఉగ్రవాదులకు తుపాకులు, బాంబులు అందించిన వారిని విడిచిపెట్టం
-వారిని శిక్షించేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం
-ఉగ్రవాదానికి పర్యాయపదం పాకిస్థాన్
-మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ ధ్వజం

యవత్మాల్, ఫిబ్రవరి 16: పుల్వామా ఉగ్ర దాడి అనంతరం రాలిన ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఇది నవభారతం. భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులకు తుపాకులు, బాంబులు సరఫరా చేసే వారిని విడిచిపెట్టదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పంధర్‌కావడా, ధూలే జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ ఆ తరువాత జరిగిన సభల్లో మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఆ భయానక దాడిపై దేశమంతా ఆగ్రహంతో ఉన్నది. ప్రజల కండ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అమరులైన సైనికులకు నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది దుఃఖ సమయం. అయితే కొంత సంయమనాన్ని, జాగరూకతను ప్రదర్శించాలి. తమ ఆప్తులను కోల్పోయిన ప్రతి కుటుంబానికి హామీ ఇస్తున్నాను. మీ ప్రతి కన్నీటిబొట్టుకు ప్రతీకారం జరుగుతుంది అని పేర్కొన్నారు. బుల్లెట్లు పేల్చేవారిని లేదా మన సైనికులపై దాడి చేసేందుకు వారికి తుపాకులు, బాంబులు సరఫరా చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోము అంటూ ప్రధాని ధ్వజమెత్తారు.ఉగ్రవాదానికి పాకిస్థాన్ పర్యాయపదంగా మారిందని మండిపడ్డారు.

ఉగ్రవాదులను ఏరివేయండి: రాజ్‌నాథ్

కశ్మీర్ లోయలో దాగి ఉన్న ఉగ్రవాదులందరినీ ఏరివేసేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధికారులను ఆదేశించారు. దేశంలో, ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో భద్రతపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఉన్నతస్థాయి భద్రత అధికారులు హాజరయ్యారు.

మీ ఆత్మరక్షణ హక్కుకు మా మద్దతు: అమెరికా

భారత్ ఆత్మరక్షణ హక్కుకు తాము పూర్తి మద్దతునిస్తున్నామని అమెరికా ప్రకటించింది. పుల్వామా దాడి నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ భారత భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. జైషే మొహమ్మద్‌తోపాటు ఇతర ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సురక్షిత స్థావరంగా ఉండకుండా చూసేందుకు కలిసి చర్యలు తీసుకుందామని నిర్ణయించారు.

911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles