ప్రతి భారతీయుడూ కశ్మీర్‌ ప్రజల వెనుకే


Wed,August 14, 2019 02:12 AM

Every Indian stands with people of Jammu Kashmir and Ladakh

-కొన్ని స్వార్థ శక్తులు మాత్రమే మా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి
-ఆర్టికల్‌ 370 బంధనాలు తెగిపోయాయి: ప్రధాని నరేంద్రమోదీ

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ విభజన నిర్ణయాలను భారతీయులంతా సమర్థిస్తున్నారని, ప్రజలంతా జమ్ముకశ్మీర్‌, లడఖ్‌వాసులకు మద్దతుగా నిలుస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొందరు కేవలం తమ స్వార్థం కోసమే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. రెండోదఫా పాలన 75 రోజులు పూర్తయిన సందర్భంగా ఐఏఎన్‌ఎస్‌ వార్తాసంస్థ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘కశ్మీర్‌ విషయంలో మా నిర్ణయాన్ని వ్యతిరేకించేవారి జాబితా ఒకసారి చూడండి. కొన్ని స్వార్థ శక్తులు, వారసత్వ రాజకీయ కుటుంబాలు, ఉగ్రవాదులకు మద్దతు తెలిపే పార్టీలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. కానీ.. దేశ ప్రజలంతా పార్టీలకు అతీతంగా మా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా.. జాతీయ కోణంలో చూడాలి’ అని కోరారు.

కశ్మీర్‌లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 370, 35-ఏ అధికరణలు దేశానికి హాని చేశాయని, ఈ అధికరణలను అడ్డుపెట్టుకొని వేర్పాటువాదులు పెరిగిపోయారని, కొన్ని కుటుంబాలు ఎదిగాయని విమర్శించారు. ఈ రెండు అధికరణలు ఏడు దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని, అభివృద్ధి ఫలాలను వారికి దక్కనీయలేదని చెప్పారు. ఫలితంగా ప్రజలు ఆర్థికంగా బలపడలేదన్నారు. ఇకనైనా ప్రజలకు అభివృద్ధి చెందే అవకాశం కల్పిద్దామని పిలుపునిచ్చారు. ‘జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లోని నా సోదరసోదరీమణులు అభివృద్ధిని కోరుకుంటున్నారు. కానీ.. ఆర్టికల్‌ 370 వారికి అడ్డుగా నిలిచింది. ఎస్సీ,ఎస్టీలు, మహిళలు, చిన్నారులకు ఇది అన్యాయం చేసింది. సంస్థలు స్థాపించి ఉపాధి కల్పించాలన్న యువత ఆకాంక్షలను అణచివేసింది. పారిశ్రామికంగా ఎదిగే అవకాశం ఉన్నా అడ్డుకున్నది’ అని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 అనే బంధనాలు తెగిపోయాయని చెప్పారు. ఇకపై అక్కడి సహజ వనరులను ఉపయోగించుకొని ఆ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles