మందిరాన్ని ఎన్నికలతో ముడిపెడతారా?Thu,December 7, 2017 02:30 AM

-కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌పై విరుచుకుపడిన మోదీ
-నేటితో ముగియనున్న గుజరాత్ తొలిదశ ఎన్నికల ప్రచారం

modi
ధంధుకా (గుజరాత్), డిసెంబర్ 6: గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తన ప్రసంగాల్లో వేడిని, విమర్శల్లో వాడిని పెంచుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బాబ్రీమసీదు కేసులో సున్నీ వక్ఫ్‌బోర్డ్ తరఫున న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో చేసిన వాదనలను తన ప్రచారాంశాలుగా మార్చారు మోదీ. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశమున్నందున 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాతే అయోధ్య అంశంపై విచారణ చేపట్టాలని సిబల్ న్యాయస్థానాన్ని కోరడాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. ఎన్నికలతో రామమందిరం అంశాన్ని ముడిపెట్టడం ఏమిటని కాంగ్రెస్‌ను నిలదీశారు. గుజరాత్‌లో డిసెంబర్ 9న తొలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రచారపర్వం గురువారం సాయంత్రం తో ముగియనుంది.

ఈ నేపథ్యంలో ధంధుకాలో బుధవారం జరిగిన ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ.. నిన్న సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ బాబ్రీమసీదుపై వాదనలు వినిపించారు. కేసును 2019కి వాయిదా వేయమని ఆయన చెప్పడం సరైనదేనా? రామమందిరాన్ని ఎన్నికలకు ఎందుకు ముడిపెడుతున్నారు? ఆ ఆలోచన సక్రమమేనా? అని మోదీ ప్రశ్నించారు. ఆయన సున్నీ వక్ఫ్ బోర్డ్ తరఫున వాదనలు చేశామంటున్నారు. కానీ వక్ఫ్‌బోర్డ్ ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేస్తుందా? అలాంటప్పుడు ఎన్నికల గురించిన ఆయన ఆందోళన అంతా కాంగ్రెస్ కోసమే అయ్యుండాలి అని మోదీ అన్నారు. రామమందిరం విషయంలో రాహుల్‌గాంధీ తన వైఖరిని స్పష్టంచేయాలని బీజేపీ చీఫ్ అమిత్‌షా డిమాండ్ చేశారు. కాగా, బాబ్రీ కేసు విచారణను ఎన్నికల వరకు వాయిదా వేయాలన్న అభిప్రాయమేదీ తమకు లేదని సున్నీ వక్ఫ్‌బోర్డ్ ప్రకటించింది.

మోదీ స్పందన ఎప్పుడూ చేదే : కాంగ్రెస్

గుజరాతీ ఆహారంలోనూ తియ్యదనం ఉంటుంది కానీ, మోదీ స్పందన మాత్రం ఎప్పుడూ చేదుగానే ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ తెలిపారు. పదే పదే గాంధీ ప్రస్తావన తీసుకువచ్చే మోదీ, సత్యనిష్ఠను మాటల్లోనైనా చూపించరని ఆయన విమర్శించారు.

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు

గుజరాత్‌లో కాంగ్రెస్ గెలిస్తే విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందజేస్తామని అఖిలభారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితాదేవ్ ప్రకటించారు. శానిటరీ నాప్కిన్లపై నరేంద్రమోదీ ప్రభుత్వం 12శాతం జీఎస్టీని విధించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.

308

More News

VIRAL NEWS