పింఛనుదారులకు తీపికబురు


Fri,August 23, 2019 03:53 AM

EPFO approves changes in Employees Pension Scheme to restore commutation of pension

-అడ్వాన్స్ విత్‌డ్రా పునరుద్ధరణ
ఈపీఎస్ సవరణలకు సీబీటీ అంగీకారం
-6.3 లక్షల మందికి ప్రయోజనం

న్యూఢిల్లీ, ఆగస్టు 22: పింఛనుదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తీపికబురు అందించింది. 2009కి ముందున్న కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ లేదా అడ్వాన్స్ పార్ట్ విత్‌డ్రా విధానాన్ని పునరుద్ధరించింది. కమ్యుటేషన్ కింద పదవీ విరమణ తర్వాత వచ్చే పింఛన్‌ను 15 ఏండ్లపాటు మూడో వంతుకు తగ్గించి ఇస్తారు. అలా తగ్గించిన మొత్తాన్ని గణించి ఉద్యోగికి ముందుగానే అందజేస్తారు. 15 ఏండ్ల తర్వాత పూర్తి పింఛన్ లభిస్తుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్)-1995కు మార్పులు చేసేందుకు ఈపీఎఫ్‌వోకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) అంగీకరించింది. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన సీబీటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర కార్మిక, ఉపాధికల్పనశాఖ సహాయ మంత్రి, సీబీటీ చైర్మన్ సంతోష్ కుమార్ గాంగ్వార్ తెలిపారు. దీనివల్ల 6.3 లక్షల మంది పింఛన్‌దారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 2009కి ముందు పదవీ విరమణ సమయంలో ఉద్యోగులు కమ్యుటేషన్‌ను ఎంచుకుంటే ప్రావిడెంట్ ఫండ్ అడ్వాన్స్ విత్‌డ్రాకు అవకాశం ఉండేది. ఈ పద్ధతిని ఈపీఎఫ్‌వో 2009లో విరమించుకున్నది.

ఆన్‌లైన్‌లోనే ఈపీఎఫ్ క్లెయిమ్స్

ఈపీఎఫ్ క్లెయిమ్స్‌ను ఈపీఎఫ్‌వో 91 శాతానికి పైగా ఆన్‌లైన్‌లోనే పరిష్కరిస్తున్నదని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ చెప్పారు. మరణించిన సభ్యులకు చెందిన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈపీఎఫ్ కాల్ సెంటర్ సేవలను ప్రశంసించారు. అనంతరం ఈపీఎఫ్‌ఐజీఎంఎస్ (ఈపీఎఫ్‌ఐ గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)-2.0ను ఆవిష్కరించారు. ఈపీఎఫ్‌కు సంబంధించిన సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. దీంతో దాదాపు ఐదుకోట్ల మందికి పైగా సభ్యులకు ప్రయోజనం కలుగుతుందని, లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అదేవిధంగా ప్రైవేట్ రంగ సంస్థల బాండ్లలో పెట్టుబడులను నిలిపివేయాలన్న ప్రతిపాదనకు సీబీటీ బోర్డు ఆమోదం తెలిపింది. పీఎస్‌యూ బాండ్లలో పెట్టుబడులకు తప్పనిసరిగా క్రిసిల్, కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్స్‌ను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. సీబీటీ ఏర్పాటుచేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు తదుపరి కస్టోడియన్ ఎంపిక, మూల్యాంకనం బాధ్యతను కన్సల్టెంట్‌కు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

3199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles