మేమంతా మీ వెంటే..

Sun,February 17, 2019 02:56 AM

-ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి మద్దతు తెలిపిన రాజకీయపార్టీలు
-దేశ భద్రతను, సమగ్రతను కాపాడుతున్న భద్రతా దళాలకు సంఘీభావం
-సవాళ్లపై పోరాడాలంటూ అఖిలపక్ష భేటీలో తీర్మానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా తామంతా అండగా ఉంటామని దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి. దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడుతున్న భద్రతా దళాలకు తమ సంఘీభావం ప్రకటించాయి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ప్రభుత్వం ఢిల్లీలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పుల్వామా ఉగ్ర దాడిని, సరిహద్దుకు అవతలి నుంచి ఉగ్రవాదులకు అందుతున్న సాయాన్ని ఖండిస్తూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు తామంతా ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, అన్ని ప్రధాన, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సూచనకు తృణమూల్ సభ్యుడు డెరెక్ ఓబ్రియన్, సీపీఐ నాయకుడు డీ రాజా మద్దతు తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశం అనంతరం ఒక తీర్మానం ఆమోదించారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ స్థిరత్వాన్ని, సంయమనాన్ని ప్రదర్శించింది. ఈ సవాళ్లపై పోరాడాలని దేశమంతా ముక్తకంఠంతో కోరుతున్నది. ఉగ్రవాదంపై పోరులో, దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడటంలో మేమంతా మన భద్రతా దళాలకు సంఘీభావంతో ఐక్యంగా తోడుగా నిలుస్తున్నాం అని ఆ తీర్మానం పేర్కొంది. ఈ తీర్మానంలో పాకిస్థాన్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. సమావేశం ప్రారంభంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, పుల్వామా ఉగ్రదాడి, ఆ ప్రాంతంలో తన పర్యటన గురించి వివరించారు. ఉగ్రవాదంపై పోరుకు అర్థవంతమైన ముగింపునివ్వాలని తమ ప్రభుత్వం నిశ్చయించిందని చెప్పారు.

jitender

ఉగ్రవాదుల ఏరివేతకు టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు

దేశంలో ఉగ్రవాదుల దాడులు మళ్లీ ఎక్కడా జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా టెర్రరిజాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో శనివారం అఖిలపక్ష సమావేశానికి హాజరయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు.

859
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles