‘జమిలి’ సాధ్యంకాదు!


Wed,August 15, 2018 03:32 AM

Election Commission reacts to Amit Shahs request on Jamili elections

-రాజ్యాంగ సవరణ, చట్టపరమైన ప్రక్రియ లేకుండా కుదరదు
-లోక్‌సభతోపాటు 11 రాష్ర్టాల్లో ఎన్నికలకు తగినన్ని వీవీప్యాట్‌లు లేవు
-భారీగా ఎన్నికల అధికారులు, పోలీసు బలగాలు అవసరం పడుతుంది
-స్పష్టం చేసిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్
-బీజేపీ అత్యుత్సాహంపై నీళ్లు చల్లిన సీఈసీ
-జమిలికి మద్దతుగా ఇప్పటికే లా కమిషన్‌కు అమిత్‌షా లేఖ

న్యూఢిల్లీ, ఆగస్టు 14: రాజ్యాంగ సవరణలు, చట్టపరమైన ప్రక్రియ చేపట్టకుండా లోక్‌సభ, రాష్ర్టాల శాసనసభలకు కలిపి జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ మంగళవారం స్పష్టంచేశారు. వివిధ రాష్ర్టాల అసెంబ్లీల కాలపరిమితిని పెంచాలన్నా లేదా తగ్గించాలన్నా దానికి రాజ్యాంగ సవరణ తప్పనిసరని తెలిపారు. జమిలి ఎన్నికలకు తగినన్ని పోలింగ్ యంత్రాలు అందుబాటులో లేవని స్పష్టంచేశారు. లోక్‌సభతోపాటు 11 రాష్ర్టాలకు ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలుపుతూ సోమవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా లా కమిషన్‌కు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సీఈసీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లోక్‌సభతోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని కాషాయ పార్టీ పెద్దలు గత కొద్దిరోజులుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్నినెలల ముందు.. కొన్ని నెలల తర్వాత ఎన్నికలు జరుగాల్సిన రాష్ర్టాల అసెంబ్లీల కాలపరిమితిని పెంచడం లేదా తగ్గించడం ద్వారా జమిలి ఎన్నికలు నిర్వహించాలని, ఆయా రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో ఎటువంటి రాజ్యాంగ సవరణ, చట్టపరమైన ప్రక్రియ అవసరం లేదని ఇన్నాళ్లూ కమలం పార్టీ భావించింది. కాగా ఎన్నికల ప్రధాన కమిషనర్ వ్యాఖ్యలతో బీజేపీ అత్యుత్సాహంపై నీళ్లు చల్లినట్టయింది. సీఈసీ ఓపీ రావత్ మాట్లాడుతూ జమిలి ఎన్నికలకు చట్టపరమైన ప్రక్రియ తప్పనిసరని, సమీప భవిష్యత్తులో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం లేదని కుండబద్దలు కొట్టారు.

ఒక రాష్ట్ర అసెంబ్లీ గడువును పొడిగించడం లేదా తగ్గించడం చేయాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. యంత్రాలకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో వందశాతం వీవీప్యాట్స్ (పేపర్ ట్రయల్ యంత్రాలు) అందుబాటులో ఉంచడం అనేది పెద్ద అవరోధం. తగినన్ని యంత్రాలు అందుబాటులో లేవు. ఒకవేళ లోక్‌సభతోపాటు 11 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలంటే వెంటనే అదనపు యంత్రాలకు ఆర్డర్ ఇవ్వాలి. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఒకటి రెండు నెలలకు మించి సమయం లేదు. అదనపు పోలీసు బలగాలు, ఎన్నికల అధికారులు భారీగా అవసరం అవుతారు. ఎన్నికల కమిషన్ తన బాధ్యతను కచ్చితంగా నెవేరుస్తుంది. అసెంబ్లీల గడువు ముగింపునకు వస్తుందంటే ఎన్నికల నిర్వహణ తప్పనిసరి. 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఈవీఎంలను, వీవీప్యాట్ యంత్రాలను సమకూర్చుకునే ప్రక్రియ చేపడుతున్నాం. 13.95 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 9.3 లక్షల కంట్రోల్ యూనిట్లు, 16.15 లక్షల వీవీప్యాట్‌లు నవంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయి. కొన్ని యంత్రాలు పనిచేయకపోతే వాటిని మార్చడానికి అదనంగా యంత్రాలను కూడా అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. 2019లో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే.. దాదాపు 24 లక్షల ఈవీఎంలు కావాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలకు ఇది దాదాపు రెట్టింపు అని ఢిల్లీలో మీడియాకు రావత్ స్పష్టంచేశారు. జమిలి ఎన్నికల నిర్వహణపై మే 16న లా కమిషన్‌తో చర్చల సందర్భంగా కూడా అదనంగా 12 లక్షల ఈవీఎంలు, 12 లక్షల వీవీప్యాట్‌ల కోసం రూ.4500 కోట్లు అవసరమని ఈసీ స్పష్టంచేసింది.

Nitish

జమిలి ఎన్నికలు ఉత్తమ ఆలోచన: బీహార్ సీఎం నితీశ్

పాట్నా: ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఉత్తమ ఆలోచన అని.. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో దానిని అమలు చేయడం సాధ్యం కాదని బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ మంగళవారం తెలిపారు. కొద్ది రోజులుగా జమిలి ఎన్నికలకు మద్దతుగా మాట్లాడుతున్న నితీశ్.. లా కమిషన్‌కు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాసిన లేఖపై స్పందించారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం అనేది వచ్చే సాధారణ ఎన్నికల్లో సాధ్యం కాదు. ఇది మంచి ఆలోచనే కానీ దాని అమలుకు ఇది సరైన సమయం కాదు అని నితీశ్ పేర్కొన్నారు. నితీశ్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ బీహార్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నా యి. 2020లో బీహార్ ఎన్నికలు జరుగాల్సి ఉండగా.. అసెంబ్లీ గడువును తగ్గించి లోక్‌సభ ఎన్నికలతోపాటు నిర్వహించాలన్న బీజేపీ ప్రతిపాదనను జేడీయూ తిరస్కరిస్తున్నది. జమిలికి మద్దతు తెలుపుతున్న నితీశ్.. ప్రస్తుతం అది సాధ్యంకాదని చెప్పడంలో కారణం అదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు జమిలి ఎన్నికల వల్ల ఖర్చు తగ్గడంతోపాటు ప్రభుత్వాలు పాలనపై దృష్టిసారించే అవకాశం ఉంటుందని నితీశ్ పేర్కొంటున్నారు.

Ashok-Gehlot

దమ్ముంటే లోక్‌సభను రద్దు చేయండి: కాంగ్రెస్ సవాల్

న్యూఢిల్లీ: దమ్ముంటే లోక్‌సభను రద్దు చేసి త్వరలో ఎన్నికలు జరుగాల్సిన మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలతో కలిపి లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ సవాల్ విసిరింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌గెహ్లాట్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు జరుగాల్సి రాష్ర్టాల్లో పోలింగ్‌ను వాయిదా వేసి, 2019లో జరుగాల్సిన సార్వత్రిక ఎన్నికలతో కలిపి నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదని స్పష్టంచేశారు. మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువు ముగుస్తున్నందున కచ్చితంగా ఎన్నికలు నిర్వహించి తీరాలని తెలిపారు. జమిలి ఎన్నికల నిర్వహణకు ఒకేఒక్క మార్గం ఉన్నది. ప్రధాని లోక్‌సభను రద్దు చేసి.. నాలుగు రాష్ర్టాల ఎన్నికలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలి. దీని ద్వారా దేశంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని, అసహనాన్ని, బెదిరింపు ధోరణులను తరిమికొట్టవచ్చు. ముందస్తు లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్ స్వాగతించడమే కాదు.. బీజేపీని గద్దె దింపడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ ఒకే దేశం.. ఒకే ఎన్నిక నినాదాన్ని అందుకున్నది అని అశోక్ గెహ్లాట్ ధ్వజమెత్తారు.

924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles