విద్య, వైద్యానికి సేవాపన్నులేదు


Fri,October 6, 2017 11:31 AM

Education and medical service are not taxable

-మినహాయింపు కొనసాగించిన జీఎస్టీ కౌన్సిల్
-తగ్గనున్న సాధారణ ప్రయాణ చార్జీలు
-బిజినెస్‌క్లాస్ విమానయానం, సినిమాలు మరింత భారం
-18శాతం శ్లాబులో టెలికం, ఆర్థిక సర్వీసులు
-ఎక్కువ సర్వీసులు 12-18శాతం శ్లాబుల్లోనే
-జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకు సిద్ధమన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
-ముందే రేట్లు మార్చితే చర్యలేనన్న రెవెన్యూ కార్యదర్శి అధియా

శ్రీనగర్, మే 19: జూలై 1వ తేదీ నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)అమలుకు సర్వం సిద్ధమవుతున్నది. శ్రీనగర్‌లో రెండు రోజులు సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్.. తొలిరోజు 1211 వస్తువుల పన్ను రేట్లను ఖరారు చేయగా, రెండో రోజైన శుక్రవారం పలు సర్వీసులకు శ్లాబులు నిర్ధారించింది. విద్య, ఆరోగ్య సర్వీసులకు సేవాపన్ను నుంచి మినహాయింపును కొనసాగించింది. స్వాతంత్య్రం అనంతరం అతి పెద్ద పన్ను సంస్కరణగా పేర్కొంటున్న జీఎస్టీలో నాలుగు స్థాయిల్లో.. 5%, 12%, 18%, 28%గా సేవల (సర్వీసెస్) పన్ను రేట్లను ఇక్కడ జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ 14వ సమావేశాల్లో ఖరారుచేశారు. ఎకానమీ క్లాస్ విమానయానం సహా రవాణాను ఐదు శాతం పన్ను శ్లాబులోకి చేర్చారు. ప్రస్తుతం ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణంపై ఆరుశాతం సర్వీస్ ట్యాక్స్ ఉన్నది. బంగారం, సిగరెట్లు తదితర కొన్నింటిని మినహాయిస్తే దాదాపు అన్ని వస్తువుల రేట్లు ఖరారయ్యియి. బయోడీజిల్, బీడీలు, సిగరెట్లు, పాదరక్షలు, వస్ర్తాలు, వ్యవసాయ పనిముట్లు, బంగారం తదితరాలతో కూడిన ఆరు క్యాటగిరీల వస్తువులకు పన్ను రేటును జూన్ మూడున జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రెండో రోజు సమావేశంలో ఖరారు చేసిన సేవల పన్ను రేట్ల మేరకు టెలికం, బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం, బీమా, బ్యాంకింగ్, వార్తా పత్రికల్లో వాణిజ్య ప్రకటనలు వంటివాటి ధరలు పెరుగనున్నాయి. పత్రికల్లో వాణిజ్య ప్రకటనల స్పేస్ విక్రయానికి 28శాతం సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. దీనికి అదనంగా 5శాతం సెస్ జోడించనున్నారు.
slabfff

జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకు సంసిద్ధం: జైట్లీ

జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల సమావేశాల అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విలేకరులతో మాట్లాడారు. జూలై ఒకటి నుంచి జీఎస్టీని అమలుచేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు. టెలికం, ఆర్థిక సర్వీసులను ప్రామాణిక రేటు అయిన 18శాతం పన్ను పరిధిలో ఉంచినట్టు తెలిపారు. రవాణా సర్వీసులకు 5శాతం పన్ను ఉంటుందని చెప్పారు. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సర్వీసులతోపాటు ఇప్పటికే ఆరుశాతం పన్ను చెల్లిస్తున్న అందరికీ ఇది వర్తిస్తుందని జైట్లీ చెప్పారు. ఈ కారణంగా ఓలా, ఉబెర్ వంటి సర్వీసుల చార్జీలు స్వల్పంగా తగ్గుతాయి. నాన్ ఏసీ రైలు ప్రయాణాలు, లోకల్ రైళ్లు, మెట్రో ట్రైన్లు, హజ్ వంటి మతపరమైన యాత్రలకు సేవా పన్ను మినహాయిస్తారు. ఏసీ రైలు ప్రయాణాలపై 5శాతం సర్వీస్ ట్యాక్స్ నిర్ణయించామని జైట్లీ తెలిపారు. ఎక్కువ సర్వీసులను 12-18శాతం శ్లాబుల్లో ఉంచినట్టు వివరించారు.

ఎకానమీ క్లాస్ విమానయానానికి ఐదు శాతం, బిజినెస్‌క్లాస్ ప్రయాణానికి 12శాతం సర్వీస్ ట్యాక్స్ చార్జ్ చేస్తారని చెప్పారు. ప్రస్తుతం ఎకానమీ క్లాస్ విమానయాన సేవా పన్ను 6శాతంగా ఉంది. ఇది ఒక శాతం తగ్గుతుంది. ఫలితంగా విమాన టికెట్ ధరలు తగ్గుతాయి. నాన్ ఏసీ రెస్టారెంట్లలో ఆహారం బిల్లుపై జీఎస్టీ 12శాతంగా ఉంటుందని జైట్లీ తెలిపారు. ఏసీ రెస్టారెంట్లు, మద్యం అమ్మేందుకు లైసెన్స్ ఉన్నవాటికి 18శాతంగా, ఫైవ్‌స్టార్ హోటళ్లలో 28శాతంగా జీఎస్టీ ఉంటుందని తెలిపారు. వార్షిక టర్నోవర్ 50 లక్షలు, అంతకు లోపు ఉన్న రెస్టారెంట్లు 5శాతం పరిధిలోకి వస్తాయని చెప్పారు. ఇంటికి పెయింటింగ్ వేయడం వంటి వర్క్ కాంట్రాక్టులు 12శాతం పరిధిలో ఉంటాయి. ప్రస్తుతం 15శాతం సేవా పన్ను ఉన్న బీమారంగాన్ని 18శాతం పన్ను పరిధిలోకి తేవడంతో పాలసీలు ఖరీదు కానున్నాయి.
lines

సినిమాలు పెద్ద ఖర్చే

సినిమా హాళ్లకు ప్రస్తుతం ఉన్న వినోద పన్నును జీఎస్టీ పరిధిలో సేవల పన్నులో కలిపేశారు. దీనిని గరిష్ఠ పన్ను పరిధి 28శాతంలోకి చేర్చారు. క్యాసినోలు, రేసు కోర్సులలో బెట్టింగ్ వంటివాటిని కూడా గరిష్ఠ పన్ను పరిధిలోకి తెచ్చారు. సినిమాహాళ్లలో ప్రస్తుతం 15శాతం సర్వీసు ట్యాక్స్‌తోపాటు రాష్ర్టాలు కనిష్ఠంగా 28%నుంచి గరిష్ఠంగా 100% వినోద పన్ను విధిస్తున్నాయి. దీనిని కొనసాగిస్తున్నారు. దీనితో సినిమాలు చూడాలనుకునేవారి జేబులు మరికాస్త బరువుగా ఉండాల్సిందే.

ముందే రేట్లు మార్చితే చర్యలే

జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి రాకముందే ధరల్లో మార్పులు చేసినపక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటామని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా పరిశ్రమల వర్గాలను హెచ్చరించారు. ఈ విషయంలో నిజాయితీతో వ్యవహరించాలని ఆయన కోరారు. అక్రమలాభార్జనను నియంత్రించేందుకు త్వరలోనే ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఆ యంత్రాంగం కంపెనీల బ్యాలెన్స్‌షీట్లను తనిఖీ చేసి, అక్రమాలకు పాల్పడినవాటిపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వినియోగదారులు అధిక ధరలు చెల్లించకుండా చూడటమే తమ ఉద్దేశమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. జీఎస్టీతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని చెప్పారు.
arun

వెయ్యిలోపు అద్దె వసూలు చేసే హోటళ్లకు సేవా పన్ను మినహాయింపు

రోజుకు వెయ్యి రూపాయలు చార్జిచేసే హోటళ్లు, లాడ్జీలను జీఎస్టీనుంచి మినహాయించారు. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల మధ్య టారిఫ్ ఉన్న హోటళ్లకు పన్ను 12శాతంగా ఉంటుంది. రూ.2500 నుంచి రూ.5వేల వరకు టారిఫ్ ఉన్న పక్షంలో 18శాతం, రోజు అద్దె రూ.5వేలకు మించి ఉంటే 28శాతం పన్ను వర్తిస్తుంది. బంగారం, ఇతర విలువైన లోహాల విషయంలో జూన్ 3న జరిగే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడించారు. సేవలపై జీఎస్టీని ఖరారు చేసే విషయంలోనే రెండో రోజు సమావేశంలో ప్రధానంగా చర్చించామని ఆయన తెలిపారు. చాలా వరకూ సర్వీస్ ట్యాక్స్ మినహాయింపులు యథాతథంగా కొనసాగించనున్నామని జైట్లీ చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని జీఎస్టీ ప్రభావితం చేయబోదని తెలిపారు. ఈకామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు సరఫరాదారులకు చెల్లింపులు చేసే సమయంలో ఒక శాతం టీసీఎస్ (ఉత్పత్తి స్థానం వద్ద వసూలు చేసే పన్ను)ను మినహాయించుకోవచ్చని హస్ముఖ్ అధియా తెలిపారు. లాటరీలపై ఎలాంటి పన్ను ఉండదు.

అగ్గువకు దొరికేవి

ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు, పాలు తదితరాలు తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. వీటిపై ప్రస్తుతం వివిధ రాష్ర్టాలు విలువ ఆధారిత పన్ను విధిస్తుండగా, జీఎస్టీలో వాటిని తొలగించారు. మిఠాయిలపై కొన్ని చోట్ల వ్యాట్ విధిస్తున్నారు. వీటిని ఇప్పుడు ఐదు శాతం పన్ను పరిధిలోకి తెచ్చినందున వాటి ధరలు తగ్గనున్నాయి. గతంలో 22-24శాతం పన్ను పరిధిలో ఉన్న తలనూనె, సబ్బులు, టూత్‌పేస్ట్ వంటివాటిని 18శాతం పన్ను పరిధిలోకి తెచ్చినందున వాటి ధరలు కూడా తగ్గుతాయి. చక్కెర, టీ, కాఫీ (ఇన్‌స్టెంట్ కాఫీ మినహా), వంట నూనెలు తదితరాలను కనిష్ఠ పన్ను పరిధిలోకి తెచ్చినందున వాటి ధరల్లో పెద్దగా మార్పేమీ ఉండబోదు. 11.69శాతం పన్ను పరిధిలో ఉన్న బొగ్గును ఐదు శాతం శ్లాబులోకి తెచ్చినందున దాని ధర తగ్గుతుంది. అయితే, బొగ్గు, లిగ్నైట్, వంట చెరుకుపై టన్నుకు రూ.400 స్వచ్ఛ ఇంధన సెస్సు విధిస్తారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ప్రస్తుతం 31-32శాతం పన్ను పరిధిలో ఉన్నాయి. వీటిని 28శాతం శ్లాబులోకి తెచ్చినందున స్వల్పంగా ధరలు తగ్గే అవకాశం ఉంది.
GST1

ధరలు పెరిగేవి

శీతల పానీయాలు, కార్లు తదితరాలను గరిష్ఠ పన్ను శ్లాబులోకి చేర్చినందున వీటి ధరలు గణనీయంగా పెరుగనున్నాయి. గరిష్ఠ ధరపై చిన్న కార్లకు ఒక శాతం సెస్ విధిస్తారు. మధ్యరకం కార్లపై మూడు శాతం, విలాసవంతమైన కార్లపై 15శాతం సెస్ ఉంటుంది. పాన్ మసాలా, గుట్కాలను 28శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. వీటిపై అదనంగా 204శాతం సెస్ ఉంటుంది. ఇతర పాన్‌మసాలాలకు 60శాతం సెస్ విధిస్తారు. పొగాకుకు సంబంధించి 71శాతం నుంచి 204శాతం సెస్ విధించనున్న కారణంగా వీటి ధరలు ఆకాశాన్నంటనున్నాయి. సుగంధ జర్దా, ఫిల్టర్ ఖైనీపై 160శాతం సెస్ విధిస్తారు. 65 మిల్లీమీటర్ల లోపు పొడవు ఉండే సిగరెట్లపై ఐదు శాతం సెస్, వెయ్యి సిగరెట్లకు రూ.1,591 స్పెషల్ ట్యాక్స్ విధిస్తారు. 65 మిల్లీమీటర్లలోపు 70 మిల్లీమీటర్లకు మించని నాన్‌ఫిల్టర్ సిగరెట్లపై ఐదు శాతం సెస్, వెయ్యి సిగరెట్లకు రూ.2876, ఇదే సైజులోని ఫిల్టర్ సిగరెట్లపై ఐదు శాతం సెస్, వెయ్యి సిగరెట్లకు రూ.2126 స్పెషల్ ట్యాక్స్ ఉంటుంది. సిగార్స్‌పై భారీగా 21శాతం సెస్ లేదా వెయ్యి సిగార్లకు రూ.4170లో ఏది ఎక్కువైతే అది విధిస్తారు. బ్రాండెడ్ గుట్కాలపై గరిష్ఠంగా 72శాతం సెస్ విధిస్తారు. స్మోకింగ్ పైపులు, సిగరెట్లలో వాడే మిక్చర్లపై 290శాతం సెస్ విధిస్తారు. తాగే సోడా కొనుగోలు చేసే వినియోగదారులు జీఎస్టీకి అదనంగా 12శాతం సెస్ చెల్లించాల్సి ఉంటుంది.

విలాసవంతమైన కార్లు కొనుగోలు చేసేవారు 28శాతం జీఎస్టీతోపాటు 15శాతం సెస్ కట్టాల్సి ఉంటుంది. 1200 సీసీ లోపు ఇంజిన్లు ఉండే చిన్న పెట్రోలు కార్లు కొనుగోలు చేసే సమయంలో 1శాతం సెస్ చెల్లించాలి. అదే డీజిల్ ఇంజిన్ల కార్ల విషయంలో 1500 సీసీ వరకూ మూడు శాతం సెస్ విధిస్తారు. 1500 సీసీకి మించిన ఇంజిన్లు ఉన్న కార్లు, ఎస్‌యూవీలు కొనుగోలుకు 15శాతం సెస్ చెల్లించాలి. 350 సీసీ మించి ఇంజిన్లు ఉండే మోటర్ సైకిళ్లు కొనుగోలు చేస్తే మూడు శాతం సెస్ కింద చెల్లించాలి. వ్యక్తిగత అవసరాలకు కొనుగోలు చేసే విమానాలు, మర పడవలకు కూడా మూడు శాతం సెస్ వర్తిస్తుంది.

ఏయే వస్తువులకు ఎంతెంత పన్ను..

1743

More News

VIRAL NEWS