ఈవీఎంల ట్యాంపరింగ్!


Wed,May 22, 2019 02:34 AM

EC must put all speculations to rest Pranab Mukherjee over EVM tampering mishandling reports

- యూపీ, బీహార్, పంజాబ్, హర్యానాలో ఈవీఎంల తరలింపుపై కలకలం
- స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పలు పార్టీల ఆందోళన
- తగిన చర్యలు తీసుకోవాలని విపక్షాల డిమాండ్
- ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం
- ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని స్పష్టీకరణ
- ఊహాగానాలకు తెరదించే బాధ్యత ఈసీదే:ప్రణబ్


లక్నో/న్యూఢిల్లీ/పాట్నా, మే 21: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) తరలింపు, ట్యాంపరింగ్ ఆరోపణలు కలకలం రేపాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘాజీపూర్, చందౌలీ, దుమరియాగంజ్‌లలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఆందోళనకు దిగారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం (ఈసీ) తోసిపుచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలన్నింటినీ పటిష్ఠ భద్రత మధ్య స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచినట్లు స్పష్టం చేసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఊహాగానాలకు తెరదించే బాధ్యత ఈసీదేనని స్పష్టం చేశారు.

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ఆందోళన

యూపీలోని చందౌలీ నియోజకవర్గంలో ఈవీఎంలను వాహనం నుంచి దించి, కౌంటింగ్ సెంటర్ కాంప్లెక్స్‌లోని ఓ గదిలో భద్రపరుస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే ఇక్కడి నుంచి రెండోసారి పోటీచేస్తున్నారు. ఈవీఎంలను మార్చేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఘాజీపూర్‌లో ఎస్పీ, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి అఫ్జల్ అన్సారీ నిరసన తెలుపుతున్న మరో వీడియో కూడా వైరల్ అయింది. అన్సారీ, ఆయన మద్దతుదారులు పోలీసులతో తీవ్ర వాగ్వివాదం చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. మాఫియా డాన్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ముఖ్తార్ అన్సారీ సోదరుడే అఫ్జల్ అన్సారీ. పలు క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలడంతో ముఖ్త్తార్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత మనోజ్ సిన్హాపై అఫ్జల్ అన్సారీ పోటీచేస్తున్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ఉండేందుకు బీఎస్పీకి చెందిన ఇద్దరు కార్యకర్తలకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల ఆందోళనలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెంకటేశ్వర్లు తోసిపుచ్చారు. ఘాజీపూర్ ఘటనపై ఆయన స్పందిస్తూ.. తన అనుమానాల నేపథ్యంలో ఈవీఎంల వద్ద ఎక్కువ మంది ప్రతినిధులను ఉంచేందుకు అక్కడి అభ్యర్థి డిమాండ్ చేశారని, డీఎం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో వారు ఆందోళన విరమించారని వివరించారు. ఇక చందౌలీ వ్యవహారం రిజర్వ్‌డ్ ఈవీఎంలకు సంబంధించినదని చెప్పారు. సకలడిహా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అదనపు (రిజర్వ్‌డ్) ఈవీఎంలను అక్కడకు తీసుకురావడంతో నిరసన వ్యక్తమైందని తెలిపారు. అయితే స్ట్రాంగ్‌రూమ్‌లలోని ఈవీఎంలను, వీటిని వేర్వేరుగా ఉంచినట్లు చెప్పారు.

రాజకీయ దుమారం

ఫలితాలు వెలువడడానికి రెండ్రోజుల ముం దు, ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు వెల్లువెత్తడంతో రాజకీయ దుమారం రేగింది. ఈవీఎంల విశ్వసనీయతపై విపక్ష పార్టీలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. వీవీప్యాట్ల లెక్కింపు శాతాన్ని పెంచాలన్న వాటి డిమాండ్‌కు మరో అస్త్రం లభించినట్లయింది. ఈవీఎంల తరలింపుపై వచ్చిన ఫిర్యాదులపై ఈసీ తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా అన్నారు. తరలిస్తున్న ఈవీఎంలన్నీ రిజర్వ్‌డ్ ఈవీఎంలని సమాధానం వస్తున్నదని, అయిన్పపటికీ వాటిని అభ్యర్థుల ప్రతినిధులకు చూపించాల్సి ఉందని స్పష్టం చేశారు.

గౌరవప్రదంగా ఓటమిని అంగీకరించండి: బీజేపీ

ఈవీఎంల విశ్వసనీయతపై విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తడాన్ని బీజేపీ ఖండించింది. ప్రజలు మళ్లీ ప్రధాని మోదీకే పట్టం కడితే.. విపక్షాలు గౌరవప్రదంగా ఓటమిని అంగీకరించాలని కోరింది. కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ, చంద్రబాబునాయుడు, అమరీందర్ సింగ్ వంటి నేతలు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడు ఈవీఎంలు మంచివే. అదే ప్రధాని మోదీ మరోసారి అధికారంలోకి వస్తున్నట్లు కనిపిస్తున్నప్పుడు మాత్రం అవి నమ్మదగినవి కాకుండా మారిపోయాయి అని ఎద్దేవా చేశారు.

రక్తం చిందుతుంది: ఉపేంద్ర కుశ్వాహా

ఎన్డీయేకు అనుకూలంగా లోక్‌సభ ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీహార్‌లోని ప్రతిపక్ష మహాకూటమి ఆరోపించింది. ఆర్‌ఎల్‌ఎస్పీ అధినేత ఉపేంద్ర కుశ్వాహా, ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర పూర్వే, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్‌మోహన్ ఝా తదితర మహాకూటమి నేతలు మంగళవారం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుశ్వాహా మాట్లాడుతూ.. ఫలితాలను ట్యాం పర్ చేసేందుకు యత్నిస్తే వీధుల్ల్లో రక్తం పారుతుందని హెచ్చరించారు.

ఈవీఎంలు భద్రం: ఈసీ

ఈవీఎంల ట్యాంపరింగ్, తరలింపు ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. అవన్నీ నిరాధార, పనికిమాలిన ఆరోపణలు అని మండిపడింది. లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు అన్నింటినీ పటిష్ఠ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినట్లు స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాలు, టీవీల్లో చక్కర్లు కొడుతున్న వీడియో క్లిప్పింగులు.. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలకు సంబంధించినవి కావని తెలిపింది. ఎన్నికలు ముగిసిన అనంతరం, పటిష్ఠ భద్రత మధ్య ఈవీఎంలను నిర్దేశిత స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించామని, అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వాటికి తాళాలు, సీల్ వేశామని పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించామని, కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుందని వివరించింది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర సాయుధ బలగాలు నిరంతరం గస్తీ కాస్తున్నట్లు తెలిపింది. అంతేగాకుండా అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటలు ఉండేందుకు అనుమతి ఇచ్చినట్లు వివరించింది. ఈవీఎంలు, పేపర్ ట్రయల్ మెషీన్ల భద్రత విషయంలో ప్రొటోకాల్ మేరకు వ్యవహరించినట్లు ఈసీ స్పష్టం చేసింది.
pranab

ఈసీదే బాధ్యత: ప్రణబ్

ఎన్నికల నిర్వహణలో ఈసీ పనితీరు భేష్ అంటూ సోమవారం ప్రశంసలు కురిపించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. తాజాగా ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఊహాగానాలకు తెరదించే బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్య మూలాలను సవాల్ చేసే ఎలాంటి ఊహాగానాలకు తావుండకూడదని పేర్కొన్నారు. ఓటర్ల తీర్పును ట్యాంపరింగ్ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు నన్ను ఆందోళనకు గురిచేశాయి. ఈసీఐ అధీనంలో ఉన్న ఈవీఎంల రక్షణ, భద్రత బాధ్యత ఈసీదే. ప్రజా తీర్పు ఉన్నతమైనది. దానిపై లేశమంతమైన అనుమానాలకు కూడా తావివ్వకూడదు. ఈ విషయంలో వ్యవస్థ సమగ్రత కాపాడే బాధ్యత ఈసీపై ఉన్నది. ఊహాగానాలకు తెరదించాలి అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

1591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles