స్వతంత్రత కోల్పోయిన ఈసీ


Fri,May 17, 2019 02:13 AM

EC lost its independence time to review process of its appointment Congress

- నియామక ప్రక్రియపై సమీక్షించాల్సిన సమయం వచ్చింది
- బెంగాల్‌పై 324 ప్రయోగం ప్రజాస్వామ్యంపై మాయని మచ్చ: కాంగ్రెస్


న్యూఢిల్లీ, మే 16: ఎన్నికల సంఘం (ఈసీ) తన స్వతంత్రతను, విశ్వసనీయతను కోల్పోతున్నదని కాంగ్రెస్‌పార్టీ ఆరోపించింది. ఈసీ నియామక ప్రక్రియపై సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ఇప్పుడు మోడీ కోడ్ ఆఫ్ మిస్‌కండక్ట్‌గా మారిపోయిందని విమర్శించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌లో ఒక రోజుముందే ప్రచారాన్ని ముగించాలని ఈసీ ఆదేశించడం, ఆర్టికల్ 324ను ప్రయోగించడం భారతదేశ ప్రజాస్వామ్యానికి, ఎన్నికల కమిషన్‌కు మాయని మచ్చగా మిగిలిపోతుందని ఆరోపించారు. ఈసీ తన అసలు విధులను పక్కనబెట్టి ఆర్టికల్ 324ను ప్రయోగించిందని మండిపడ్డారు. బెంగాల్‌లో ఆర్టికల్ 324ను అమలు చేయడం మోదీకి ఈసీ ఇచ్చిన బహుమతిగా సుర్జేవాలా అభివర్ణించారు. ఈసీ నిర్ణయం మోదీ షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. గురువారం ఆయన మథురాపూర్, డమ్‌డమ్‌లో బహిరంగ సభలు నిర్వహించారు అని గుర్తుచేశారు.

మోదీ పదవికి, ఈసీ విశ్వసనీయతకు, ప్రజాస్వామ్యం మనుగడకు ముప్పు పొంచి ఉన్నదని గత 24 గంటల్లో జరిగిన పరిణామాలతో తేలిందన్నారు. అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ గూండాలపై చర్యలు తీసుకునే బదులు ఈసీ ప్రజాస్వామ్యాన్ని శిక్షించిందని, దీంతో ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయన్న నమ్మకం పోతున్నదని చెప్పారు. మోదీ-షా చేతుల్లో ఈసీ ఓ పావుగా మారిందని ప్రతి పౌరుడు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మోదీ-షాకు వ్యతిరేకంగా ఈసీకి 11 ఫిర్యాదులు చేసిందని, వాటన్నింటికీ క్లీన్‌చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల కోడ్‌ను మోదీ-షా ఇష్టం వచ్చినట్టు అతిక్రమిస్తున్నారు. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి) ఇప్పుడు మోదీ కోడ్ ఆఫ్ మిస్ కండక్ట్‌గా మారింది. ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే కోడ్ పనిచేస్తుంది అని విమర్శించారు.

ఈసీది రెండు నాల్కల ధోరణి

ఎన్నికల సంఘం రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నదని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు. బీజేపీ విషయంలో ఒకరకంగా.. ప్రతిపక్షాల విషయంలో మరో రకంగా ఈసీ వ్యవహరిస్తున్నది. ఇది గర్హనీయం అని ట్వీట్‌చేశారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రస్తావిస్తూ.. పథకం ప్రకారం బీజేపీ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వారు తమిళనాడులో ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ విగ్రహాన్ని, బెంగాల్‌లో విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసంచేశారు అని విమర్శించారు.

209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles