ఎన్నికల సంఘం కన్నెర్ర


Thu,May 16, 2019 02:03 AM

EC cuts short campaign period in West Bengal due to violence

- బెంగాల్‌లో 3 రోజుల ముందే ప్రచారాన్ని ముగించాలని ఆదేశం
- 324వ అధికరణం ప్రయోగం
- భారత దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారి!
- బెంగాల్ సీఎస్, సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌పై వేటుకు ఉత్తర్వులు


న్యూఢిల్లీ, మే 15 : లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇంతవరకూ జరుగని ఉదంతం చోటుచేసుకున్నది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలో నిర్ణీత తేదీ కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని ఈసీ ఆదేశించింది. భారతదేశ ఎన్నికల చరిత్రలోనే ఇది తొలిసారిగా జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మంగళవారం బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ రాష్ట్రంలో గురువారం (నేడు) రాత్రి 10గంటల లోపు ఎన్నికల ప్రచారం ముగించాలని ఆదేశించింది (వాస్తవానికి ఇక్కడ ప్రచార గడువు శుక్రవారంతో ముగియనుంది). కేంద్ర ఎన్నికల సంఘం మొదటిసారి 324వ అధికరణాన్ని ప్రయోగిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. చివరి దశ ఎన్నికల్లో భాగంగా బెంగాల్‌లో ఇంకా 9 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈసీ నిర్ణయంతో ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో నేటితో ఎన్నికల ప్రచారం ముగిసిపోనుంది. 324వ అధికరణాన్ని ప్రయోగించడం బహుశా ఇదే మొదటిసారి. ఐతే, ఇదే చివరిసారి కాకపోవచ్చు అని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ చంద్రభూషణ్ కుమార్ తెలిపారు. మంగళవారం జరిగిన హింసలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం కావడం పట్ల ఈసీ ఆవేదన వ్యక్తం చేసింది. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని అధికారులు అదుపులోకి తీసుకుంటారని భావిస్తున్నట్టు పేర్కొంది. అలాగే, బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆత్రి భట్టాచార్య, సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్, రాజీవ్ కుమార్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం: మమత

బెంగాల్‌లో 324వ అధికరణాన్ని ప్రయోగించడం రాజ్యాంగ విరుద్ధమని, అనైతికమని, ఇంతకు ముందెన్నడూ జరుగలేదని, ఈసీ తాజా నిర్ణయం బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకేనని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. 324వ అధికరణాన్ని ప్రయోగించే స్థాయిలో ఘటనలు బెంగాల్‌లో ఏం జరుగలేదు. ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి ఈసీని గతంలో చూడలేదు. ఈ నిర్ణయం మోదీ, అమిత్ షాకు బహుమతి లాంటిది అంటూ దుమ్మెత్తి పోశారు. మరోవైపు, బెంగాల్‌లో ఈసీ 324వ అధికరణాన్ని ప్రయోగించడంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. హింసాత్మక ఘటనలు జరిగిన తూర్పు యూపీలో కూడా 324వ అధికరణాన్ని ఎందుకు ప్రయోగించకూడదని ఈసీని ప్రశ్నించారు.

190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles