నోరు జారిన నేతలపై ఈసీ కొరడా


Tue,April 16, 2019 11:02 AM

EC cracks whip, temporarily bans Yogi, Maya, Maneka and Azam Khan from campaigning

-యోగి, మాయా, ఆజంఖాన్, మేనకా గాంధీ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం
-ఆ నలుగురి ఎన్నికల ప్రచారంపై తాత్కాలిక నిషేధం
-యోగి, ఆజంఖాన్‌పై 72 గంటలు, మాయావతి, మేనకపై 48 గంటలు
-నేటి ఉదయం 6 గంటల నుంచి అమలు
-విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు దృష్టి సారించడంతో చర్యలు
-ఈసీ అధికారాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఎన్నికల ప్రచారంలో అడ్డగోలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బహుజన్ సమాజ్‌పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతితోపాటు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజంఖాన్, బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీపై ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం కొరడా ఝళిపించింది. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా ఆదిత్యనాథ్, ఆజంఖాన్‌పై 72 గంటలు, మాయావతి, మేనకా గాంధీపై 48 గంటలు చొప్పున తాత్కాలిక నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీ ఈ నలుగురికి విడివిడిగా ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలు అలీకి, భజరంగ్ బలీకి మధ్య జరుగుతున్నాయని యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఓటు వేయవద్దని మాయావతి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అలాగే బీజేపీ అభ్యర్థి జయప్రద ఖాకీ అండర్‌వేర్‌ను (ఆరెస్సెస్ నిక్కరు అన్న అర్థంలో) ధరిస్తున్నారని ఆజంఖాన్, ఉద్యోగాలు కావాలంటే ముస్లింలు తనకే ఓటు వేయాలని మేనకా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈసీ కన్నెర్ర జేసింది. మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం, ఎన్నికల ప్రచారంలో అనుచితంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని అభిశంసిస్తున్నాం. ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మూడు రోజులపాటు (72 గంటలపాటు) ఎటువంటి బహిరంగ సభలు, ప్రదర్శనలు, రోడ్‌షోలు నిర్వహించేందుకు, ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాల్లో పాల్గొనేందుకు వీల్లేకుండా మీపై 72 గంటలపాటు నిషేధం విధిస్తున్నాం. రాజ్యాంగంలోని 324వ అధికరణ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి మీపై ఈ చర్య చేపడుతున్నాం అని యోగి ఆదిత్యనాథ్, ఆజంఖాన్‌కు జారీచేసిన ఉత్తర్వుల్లో ఈసీ స్పష్టం చేసింది.

అలాగే మాయావతి, మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా గర్హిస్తున్నామని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీల్లేకుండా వీరిద్దరిపై 48 గంటలపాటు నిషేధం విధిస్తున్నామని, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని మరో ఉత్తర్వులో ఈసీ పేర్కొంది. ఆదిత్యనాథ్, మాయావతిపై విధించిన నిషేధకాలం వేర్వేరుగా ఉండటంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి స్పందించారు. ఆదిత్యనాథ్‌కు షోకాజ్ నోటీసు జారీచేయడం ఇది రెండోసారి అని, మున్ముందు జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా ఈ నెల 5న ఆయనకు స్పష్టం చేశామని చెప్పారు.

మాయావతికి షోకాజ్ నోటీసు జారీచేయడం ఇదే తొలిసారి అని, అందుకే వీరిద్దరి నిషేధ కాలంలో తేడా ఉన్నదని ఆయన వివరించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మతపరమైన వ్యాఖ్యలతో విద్వేష ప్రసంగాలు చేసినట్టు ఆదిత్యనాథ్, మాయావతిపై వచ్చిన ఆరోపణలపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన కొద్దిసేపటికే ఈసీ ఈ చర్యలు చేపట్టింది. వీరిద్దరిపై ఏమి చర్యలు చేపట్టారో తెలుపాలని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈసీని ప్రశ్నించింది. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, ఏ చర్య తీసుకున్నారో మాకు వివరించండి అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిలదీసింది. ఎన్నికల ప్రచారంలో విద్వేష ప్రసంగాలు చేసిన రాజకీయ నాయకులపై చర్యలు చేపట్టేందుకు తమకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయని ఈసీ పేర్కొంది.

మాకున్న అధికారాలు చాలా పరిమితమైనవి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేతలకు నోటీసులు జారీచేసి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించగలం. ఆ నేరాలు పునరావృతమైతే ఫిర్యాదులు నమోదు చేయగలం. అంతేకానీ ఓ పార్టీ గుర్తింపును రద్దుచేసే అధికారం గానీ, అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించే అధికారం గానీ మాకు లేవు అని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో ఈసీకి గల అధికారాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇందుకుగాను ఈసీ ప్రతినిధి మంగళవారం ఉదయం 10.30 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అవసరమైతే అరగంటలో తమ ఎదుట హాజరుకావాల్సిందిగా సీఈసీని (ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను) ఆదేశిస్తామని విచారణ సందర్భంగా కోర్టు హెచ్చరించింది.
EC-cracks

మోదీపై ఇదేవిధమైన చర్యలు చేపట్టగలరా: అఖిలేశ్

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పట్ల కూడా ఈసీ ఇదేవిధంగా వ్యవహరించగలదా? ఇలాంటి ఉత్తర్వులను మోదీకి జారీచేయగలదా? సైనికుల పేరుతో ఓట్లు అడగవద్దని ప్రధానికి స్పష్టంచేసే దమ్ము ఈసీకి ఉన్నదా? అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

భగ్గుమన్న మాయావతి

ఈసీ తనపై 48 గంటలు నిషేధం విధించడంపై మాయావతి భగ్గుమన్నారు. దీనిని దళిత వ్యతిరేక ధోరణితో కూడిన చర్యగా ఆమె అభివర్ణించారు. బీజేపీ నేతల ఒత్తిళ్లకు లొంగి ఈసీ పనిచేస్తున్నదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్న ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై చర్యలు చేపట్టే ధైర్యం ఈసీకి ఉన్నదా? అని ఆమె ప్రశ్నించారు. లక్నోలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ,ఈసీ ఎవరి ఒత్తిడికో లొంగి నాపై 48 గంటలు నిషేధం విధించాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంలో ఈసీ నాపై సరిగా విచారణ జరుపలేదు. నేను చేసినట్టు చెప్తున్న వివాదాస్పద వ్యాఖ్యల సీడీని కూడా నాకు అందజేయలేదు. సెక్షన్ 19 కింద రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులను ఉల్లంఘించి ఈసీ ఈ ఉత్తర్వు జారీచేసింది. ఇది అప్రజాస్వామిక నిర్ణయం. చరిత్రలో ఇది దుర్దినం (బ్లాక్ డే) అంటూ మాయావతి నిప్పులు చెరిగారు.

800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles