కొనసాగుతున్న వైద్యుల సమ్మె


Sun,June 16, 2019 02:38 AM

Doctors strike Health Minister urges all CMs to take strict action against assault on medicos

- ఆందోళన విరమించాలన్న సీఎం విజ్ఞప్తిని తోసిపుచ్చిన జూడాలు
- ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపణ
- అన్ని డిమాండ్లకు సమ్మతిస్తున్నట్లు సీఎం మమతాబెనర్జీ వెల్లడి
- తక్షణమే విధుల్లో చేరాలని వైద్యులకు విజ్ఞప్తి
- ఎస్మా ప్రయోగించబోమని స్పష్టీకరణ


న్యూఢిల్లీ, జూన్ 15: పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల (జూడాల) సమ్మె ఐదో రోజుకు చేరుకున్నది. వారికి మద్దతుగా ఢిల్లీలోని పలు దవాఖానలకు చెందిన వైద్యులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర సచివాలయంలో చర్చలకు రావాలని సీఎం మమతాబెనర్జీ ఇచ్చిన పిలుపును వైద్యులు తిరస్కరించారు. తమ భద్రతపై భయాందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య సేవలు స్తంభించిపోయిన నేపథ్యంలో వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని డిమాండ్లకు సమ్మతించిందని చెప్పారు. మరోవైపు వైద్యుల సమ్మెపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం శాఖ రాష్ర్టానికి అడ్వైజరీని జారీచేసింది. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొన్నేండ్లుగా హత్యలు నమోదవుతున్న ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ వంటి రాష్ర్టాలకు అడ్వైజరీని జారీచేయాలని దీటుగా బదులిచ్చారు. కాగా వైద్యుల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి ముఖ్యమంత్రికి లేఖరాశారు. ప్రతిష్టంభనను తొలిగించేందుకు పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని కోరారు. గవర్నర్‌తో తాను మాట్లాడడని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయనకు వివరించానని అనంతరం సీఎం తెలిపారు.

సమ్మెలో పాల్గొంటున్న వైద్యులపై తమ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించబోదని ఆమె స్పష్టం చేశారు. చర్చలకు జూడాలు రాకపోవడంతో శనివారం సాయంత్రం 5 గంటలకు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మాకు చట్టాలు ఉన్నాయి. అయితే వాటిని ఉపయోగించడం లేదు. జూనియర్ డాక్టర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోం. వారి భవిష్యత్తును ఇబ్బందులపాలు చేయం అని ఆమె చెప్పారు. నీల్ రతన్ సర్కార్ మెడికల్ కాలేజ్, దవాఖాన(ఎన్‌ఆర్‌ఎస్‌ఎంసీహెచ్)లో సోమవారం రాత్రి వైద్యులపై ఓ రోగి బంధువులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ జూడాలు ఆందోళనబాట పట్టారు. జూడాల కోసం శుక్రవారం ఐదు గంటలు వేచిచూశా. ఈరోజు (శనివారం) అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నా. రాజ్యాంగ వ్యవస్థ పట్ల మీరు కొంచెం గౌరవం చూపాలి అని మమత పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్యుల సామూహిక రాజీనామాలపై ఆమె స్పందిస్తూ.. అవి చట్టపరంగా చెల్లుబాటు కావని చెప్పారు. తాను సమర్థురాలిని కాదని జూడాలు భావిస్తే.. వారు గవర్నర్ లేదా ప్రధాన కార్యదర్శి, పోలీస్ కమిషనర్‌తో మాట్లాడుకోవచ్చు అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
Doctors-strike1

బహిరంగ చర్చకైతేనే వస్తాం

అంతకుముందు సచివాలయంలో చర్చకు రావాలన్న మమత పిలుపును వైద్యులు తిరస్కరించారు. తమకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయానికి బదులుగా ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కళాశాల, దవాఖానలో బహిరంగ చర్చకు రావాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రతిష్టంభనను తొలిగించేందుకు సీఎం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు. మేం విధుల్లో చేరేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం, అయితే సమస్య పరిష్కారానికి సీఎం వైపు నుంచి నిజాయితీతో కూడిన ప్రయత్నాలు జరుగడం లేదు అని జూనియర్ డాక్టర్స్ జాయింట్ ఫోరమ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తనను కలిసేందుకు కొందరు ప్రతినిధులు వచ్చారని సీఎం పేర్కొనడాన్ని జూడాలు ఖండించారు. తమ ప్రతినిధులు ఎవ్వరూ సీఎంను కలవడానికి వెళ్లలేదని స్పష్టం చేశారు. మరోవైపు సీఎం తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డారు. వైద్యుల సమ్మె పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ధ్వజమెత్తాయి. మమత తన ఇగోను పక్కనబెట్టి, సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేశాయి.

మమతకు 48 గంటల అల్టిమేటం

జూనియర్ డాక్టర్ల డిమాండ్లను 48 గంటల్లోగా పరిష్కరించాలని, లేనిపక్షంలో నిరవధిక దీక్షకు దిగుతామని మమత సర్కారుకు ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ దవాఖానలకు చెందిన రెసిడెంట్ డాక్టర్లు అల్టిమేటం జారీ చేశారు. కోల్‌కతాలో సహచర వైద్యులపై దాడిని నిరసిస్తూ శుక్రవారం విధులను బాయ్‌కాట్ చేసిన ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఆర్డీఏ) వైద్యులు శనివారం ఆందోళనలకు విరామమిచ్చారు. మరోవైపు జూడాలపై దాడికి నిరసనగా ఢిల్లీలోని పలు దవాఖానలకు చెందిన వైద్యులు శనివారం కూడా ఆందోళన కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ, దవాఖాన, ఆర్‌ఎంఎల్ దవాఖాన, ఢిల్లీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాలైన జీటీబీ దవాఖాన, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దవాఖాన, సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్, డీడీయూ వైద్యశాలకు చెందిన వైద్యులు ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే ఈ దవాఖానల్లో అత్యవసర సేవలు మాత్రం కొనసాగాయి. నిరసనకు సంకేతంగా హెల్మెట్లు, బ్యాండేజీలతో విధులకు హాజరుకావడాన్ని కొనసాగించాలని వైద్యులు నిర్ణయించారు.

వైద్యులపై దాడికి పాల్పడితే కఠిన శిక్షలు

వైద్యులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ శనివారం అన్ని రాష్ర్టాలను కోరారు. ఈ మేరకు ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఐఎంఏ సమర్పించిన ముసాయిదా చట్టాన్ని కూడా అందుకు జతపరిచారు. అలాగే వైద్యులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు ఐఎంఏ నిరసనలకు విలుపునిచ్చిన మరునాడే ఆయన ఈ మేరకు లేఖ రాయడం గమనార్హం. వైద్యులపై దాడులకు చెక్ పెట్టేలా కేంద్ర చట్టాలను సవరించాలని ఐఎంఏ శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ నెల 17న దేశవ్యాప్త సమ్మెకు కూడా ఐఎంఏ పిలుపునిచ్చింది.

499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles