దీదీతో చర్చలకు ఓకే


Mon,June 17, 2019 02:29 AM

Doctors safety IMA calls for nationwide stir on Monday

-మీడియా సమక్షంలో బహిరంగ వేదికపై చర్చలు జరుగాలి
-సమస్యలు పరిష్కారమైతేనే సమ్మె విరమణ
-పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి తేల్చిచెప్పిన రాష్ట్ర జూనియర్ డాక్టర్ల ఫోరం
-నేడు 24 గంటల దేశవ్యాప్త సమ్మెకు ఐఎంఏ పిలుపు

కోల్‌కతా/ న్యూఢిల్లీ, జూన్ 16: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్లు పట్టు సడలించారు. సీఎం మమతాబెనర్జీతో సమావేశం అయ్యేందుకు ఆదివారం సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు బెంగాల్ జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా సోమవారం దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) ఆదివారం నిర్ణయించింది. అత్యవసర సర్వీసులు మినహా అన్ని వైద్య సేవలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి 24 గంటల పాటు విధులకు గైర్హాజరు కావాలని కోరింది. వారం నుంచి సమ్మె కొనసాగుతుండటంతో పశ్చిమబెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో వైద్య సేవలు స్తంభించాయి. అత్యవసర సేవలు, శస్త్ర చికిత్స విభాగాల్లో రోగులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా, తాజా పరిస్థితిపై కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్ల సంయుక్త ఫోరం రెండున్నర గంటల సేపు చర్చించింది.

ఆ తర్వాత ఫోరం అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ప్రతిష్టంభనకు తెర దించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చలకు సీఎం ఎక్కడికి ఆహ్వానించినా వస్తామని, అయితే మీడియా సమక్షంలో పారదర్శకంగా చర్చించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలో, దవాఖానల ప్రతినిధులు కూర్చునేందుకు సరైన వేదిక కావాలన్నారు. ముఖాముఖీ చర్చలకు రావాలన్న మమత ఆహ్వానాన్ని శనివారం డాక్టర్లు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్లు పరిష్కారం కాగానే విధుల్లో పాల్గొనాలన్నదే తమ అభిమతం అని అన్నారు. సీఎం తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశాభావంతో ఉన్నామన్నారు. ఒకవేళ పరిష్కారం లభించకపోతే ఆందోళన కొనసాగుతుందన్నారు. గత వారం ఎన్‌ఆర్‌ఎస్ వైద్యకళాశాల దవాఖానలో మృతి చెందిన రోగి కుటుంబ సభ్యుల దాడిలో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు గాయాలయ్యా యి. దీంతో తమకు దవాఖానల వద్ద పటిష్ఠ భద్రత కావాలని జూనియర్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. ఆదివారం ఎమర్జెన్సీ వార్డులు, ఔట్ పేషంట్ తదితర యూనిట్లు పని చేయలేదు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి 24 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన ఐఎంఏ.. శుక్రవారం నుంచి 4 రోజుల దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వైద్యులు హెల్మెట్లు, బ్యాండేజీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసన తెలుపుతున్నారు.

479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles