కశ్మీరీ నేతలను విడిచిపెట్టండి


Fri,August 23, 2019 03:53 AM

DMK And Opposition Parties Protest at Delhi Jantar Mantar

-వారిని ఇంకా నిర్బంధంలో ఉంచడం తగదు
-జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్షాల నిరసన
-ఆర్టికల్ 370 రద్దు ఏకపక్షమంటూ ఆరోపణ

న్యూఢిల్లీ, ఆగస్టు 22: జమ్ముకశ్మీర్‌లో నిర్బంధంలోకి తీసుకున్న రాజకీయ నాయకులను వెంటనే విడిచిపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అలాగే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని కేంద్రాన్ని కోరాయి. రాజకీయ నాయకులను నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ప్రతిపక్షాలు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నేతలు మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను ఏకపక్షంగా రద్దు చేశారని, కనీసం రాష్ట్ర ప్రజలు, వారి తరఫు నాయకులతో కూడా కేంద్రం చర్చించలేదని విమర్శించాయి. కశ్మీర్ లోయలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఆరోపించాయి. కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేయడం, రాష్ర్టానికి చెందిన మాజీ సీఎంలను, ప్రముఖ రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచడం చాలా తీవ్రమైన విషయమని తెలిపాయి. కష్టకాలంలో ఉన్న కశ్మీర్ ప్రజలకు తాము అండగా ఉంటామని పేర్కొన్నాయి. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ వాజపేయి గొప్ప పార్లమెంటేరీయన్ అని, ఆయన జీవించి ఉండి ఇప్పుడు అధికారంలో ఉంటే జమ్ముకశ్మీర్ విషయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేదని చెప్పారు.

సమాజ్‌వాదీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ప్రసంగిస్తూ కశ్మీర్‌లో సాధారణ పరిస్థితి నెలకొంటే నాయకులను ఇంకా నిర్బంధంలో ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి బీజేపీ ఎప్పుడైతే మద్దతు ఉపసంహరించుకుందో అప్పటి నుంచే జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం తన కార్యాచరణను ప్రారంభించిందని ఆరోపించారు. ఇదంతా ఓ భారీ కుట్రలో భాగం. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తూ దేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి వాళ్లు (బీజేపీ నాయకులు) ప్రయత్నిస్తున్నారు అని ఏచూరి విమర్శించారు. నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులను, అమాయకులైన ప్రజలను వెంటనే విడుదల చేయాలంటూ ప్రతిపక్షాలు ఓ తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ ఆందోళనలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ నాయకుడు శరద్‌యాదవ్, ఆర్జేడీ నేత మనోజ్ ఝూ, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది, చిదంబరం తనయుడు కార్తీ తదితరులు పాల్గొన్నారు.

కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన

విచారణ చేపడితే ఆధారాలు సమర్పిస్తా: షెహ్లా రషీద్
Shehla-Rashid
జమ్ముకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రాజకీయ కార్యకర్త, జవహర్‌లాల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ మాజీ ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్ గురువారం చెప్పారు. తన వ్యాఖ్యలపై భారత సైన్యం విచారణ చేపడితే ఆధారాలు సమర్పించడానికి తాను సిద్ధమేనని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ఇండ్లపై సైన్యం దాడులు చేసి పురుషులను బలవంతంగా తీసుకెళ్తున్నదని ఈ నెల 18న షెహ్లా రషీద్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని సైన్యం పేర్కొన్న నేపథ్యంలో ఆమె స్పందించారు. సైన్యం విచారణ చేపడితే ఆధారాలు సమర్పిస్తానని చెప్పారు.

992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles