కోశ్యారీ కోర్టులో బంతి

Sat,November 9, 2019 02:40 AM

-మహారాష్ట్రలో గవర్నర్ వద్దకు చేరిన పంచాయితీ
-సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా
-బీజేపీ, శివసేన దూషణల పర్వం

-50-50 ఒప్పందమే లేదన్న ఫడ్నవీస్.. అమిత్ షా సమక్షంలోనే కుదిరిందన్న ఉద్ధవ్‌ఠాక్రే
ముంబై, నవంబర్ 8: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు 18వ అసెంబ్లీ కాలపరిమితి కూడా శుక్రవారంతో ముగిసింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం ప్రస్తుతం గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ చేతుల్లోకి వెళ్లింది. మరోవైపు సీఎం పీఠం పంచుకోవడంపై బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది. 50-50 ప్రతిపాదనే లేదని, శివసేన రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నదని సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్యానించగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలోనే ఒప్పందం జరిగిందని, బీజేపీ తమను అబద్ధాల కోరుగా చిత్రీకరిస్తున్నదని ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.

గవర్నర్ ముందు మూడు మార్గాలు

అక్టోబర్ 24న వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 288 స్థానాలకుగానూ బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లను గెలుచుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ-శివసేన కూటమి మెజార్జీ (161) సాధించినా.. రెండు పార్టీలు పీఠ ముడి వేసుకొని కూర్చున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ ముందు మూడు మార్గాలు ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. మొదటిది.. అత్యధిక స్థానాల్లో గెలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. ఒకవేళ బీజేపీ ముందుకు రాకుంటే రెండో మార్గంగా రెండో అతిపెద్ద పార్టీ లేదా కూటమిని ఆహ్వానించడం. వారు కూడా ముందుకు రాని పక్షంలో చివరి అవకాశంగా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారు.

50-50 ప్రతిపాదనే లేదు: గడ్కరీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీని బీజేపీ-శివసేన చెరో రెండున్నరేండ్లు పంచుకునేలా ఎలాంటి ఒప్పందం కుదురలేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కనీసం మంత్రి పదవులను సమానంగా పంచుకోవాలన్న ప్రతిపాదన కూడా లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. శివసేన, బీజేపీల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన స్థాపకుడు, దివంగత బాల్‌ఠాక్రే గతంలో నొక్కిచెప్పారని గుర్తుచేశారు.

మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: సంజయ్ రౌత్

మహారాష్ట్రలో అవసరమైతే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని శివసేన నేత సంజయ్‌రౌత్ వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ రాజీనామా నేపథ్యంలో ఆయన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కలిశారు. 50-50 ప్రతిపాదనకు ఒప్పుకున్న తర్వాతే బీజేపీ నేతలు తమతో చర్చలకు రావాలన్నారు.

బీజేపీని ఎందుకు ఆహ్వానించడం లేదు: పవార్

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని గవర్నర్ ఎందుకు ఆహ్వానించడం లేదో తనకు అర్థం కావడం లేదని, వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే శుక్రవారం పవార్‌ను కలిశారు. ప్రతిష్టంభన తొలిగించేందుకు అథవాలే తనను సలహా అడిగారన్నారు. మరోవైపు, పార్టీ మారితే రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఇస్తామని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలు ఫోన్‌లో చెప్తున్నారని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ శుక్రవారం ఆరోపించారు.

శివసేనది మోసం: ఫడ్నవీస్

బీజేపీని, మహారాష్ట్ర ప్రజలను శివసేన మోసం చేస్తున్నదని ఫడ్నవీస్ ఆరోపించారు. గవర్నర్‌కు రాజీనామా లేఖ అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకు తనను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరినట్టు చెప్పారు. ఐదేండ్లపాటు ప్రజలకు పారదర్శక పాలన అందించామన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండున్నరేండ్లు పంచుకోవాలంటూ తన సమక్షంలో శివసేనతో ఎలాంటి ఒప్పందం జరుగలేదన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ తనతో ఇదే చెప్పారన్నారు. తాను శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడేందుకు ప్రయత్నించానని, ఆయన కనీసం తన ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీపై ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయన్నారు. ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి మెజార్టీ ఇచ్చారని, కానీ శివసేన మాత్రం అధికారం కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నదని ధ్వజమెత్తారు. వాళ్లు మాతో మాట్లాడటం లేదు.. కానీ కాంగ్రెస్, ఎన్సీపీతో రోజుకు రెండుమూడుసార్లు చర్చలు జరుపుతున్నారు అని విమర్శించారు.

బీజేపీవి పచ్చి అబద్ధాలు: ఉద్ధవ్

బీజేపీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నదని, లోక్‌సభ ఎన్నికలకు ముందు అమిత్ షా సమక్షంలో సీఎం పదవి పంపకంపై హామీ ఇచ్చి, ఇప్పుడు మాటమార్చుతున్నదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అమిత్‌షా, ఫడ్నవీస్‌తో చర్చల సందర్భంగా.. ఏదోఒకరోజు శివసైనికుడే సీఎం అవుతాడని నేను ప్రజలకు హామీ ఇచ్చా. కాబట్టి మాకు సీఎం పదవిలో భాగం కావాలని వారికి స్పష్టం చేశాను. అమిత్ షా మొదట్లో డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ఇస్తే తిరస్కరించా. ఆ తర్వాత ఆయనే సీఎం పదవిపై 50-50కి ఒప్పుకొన్నారు అని పేర్కొన్నారు. ఠాక్రే కుటుంబం అబద్ధాలు ఆడుతున్నదని మొట్టమొదటిసారిగా ఆరోపణలు వచ్చాయని, తమకు అలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు. ఇకపై బీజేపీతో ఎలాంటి చర్చలు జరుపొద్దని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. బీజేపీ భవిష్యత్తులోనూ ఇలా బురదచల్లడం కొనసాగిస్తే ఆ పార్టీతో సంబంధాలను కొనసాగించబోమని హెచ్చరించారు.బీజేపీని ఇప్పటికీ సోదరసమానంగా చూస్తున్నానని, కానీ వారు తియ్యటి మాటలతో గొంతు కోస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీని తానెన్నడూ విమర్శించలేదని, సిద్ధాంత పరంగా మాత్రమే విబేధించానని చెప్పారు. తప్పుడు వ్యక్తులతో పొత్తుపెట్టుకున్నామనే భావన కలుగుతున్నదని వ్యాఖ్యానించారు.

412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles