40 వేల కోట్ల కోసం.. ఫడ్నవీస్ నాటకం

Tue,December 3, 2019 03:02 AM

-అందుకే మెజార్టీ లేకపోయినా సీఎంగా ప్రమాణం
-కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు
-అంతా వట్టిదేనంటూ కొట్టేసిన దేవేంద్ర ఫడ్నవీస్

బెంగళూరు/నాగ్‌పూర్/ముంబై/ఢిల్లీ: మహారాష్ట్రలో మరోసారి అధికారాన్ని చేపట్టేందుకు విఫలయత్నంచేసి చతికిలబడిన బీజేపీకి సొంత శిబిరం నుంచే షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనంత మెజార్టీ బీజేపీకి లేకపోయినప్పటికీ రూ.40,000 కోట్ల కేంద్ర నిధులను కాపాడటం కోసమే గతనెల 23న ఆదరాబాదరాగా ఫడ్నవీస్‌తో సీఎంగా ప్రమాణం చేయించారని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే సంచలన ప్రకటన చేశారు. నవంబర్ 29న ఆయన కర్ణాటక ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.40,000 కోట్లు దుర్వినియోగం కాకూడదని ఫడ్నవీస్ భావించారు. రాష్ట్రంలో కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ కూటమి అధికారంలోకి వస్తే ఈ నిధులను దుర్వినియోగం చేస్తారని ఆయనకు తెలుసు. అందుకే ఫడ్నవీస్ నాటకమాడాలని నిశ్చయించుకొన్నారు. దీనిలో భాగంగానే ఆయన సీఎంగా ప్రమాణంచేశారు. ఆ తర్వాత 15 గంటల వ్యవధిలోనే ఆ నిధులను కేంద్రానికి తిప్పిపంపారు. ఈ పథక రచన ముందుగానే జరిగింది అని హెగ్డే వెల్లడించారు.

రూపాయి కూడా తిప్పి పంపలేదు: ఫడ్నవీస్

హెగ్డే వ్యాఖ్యలను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. హెగ్డే ప్రకటనలో వాస్తవం లేదన్నారు. హెగ్డే తప్పుడు వ్యాఖ్యలు చేశారు. వాటిని పూర్తిగా ఖండిస్తున్నా. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సంస్థ మహారాష్ట్రలో బుల్లెట్ రైలు ప్రాజెక్టును అమలుచేస్తున్నది. ఈ ప్రాజెక్టులో మహారాష్ట్ర ప్రభుత్వ పాత్ర కేవలం భూసేకరణ వరకే పరిమితం. కేంద్రాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిధులు అడుగడంగానీ, ఆ నిధులను మళ్లీ కేంద్రానికి తిప్పిపంపడంగానీ జరుగలేదు. ఇతర ప్రాజెక్టు నుంచి కూడా కేంద్రానికి కనీసం ఒక్క రూపాయి తిప్పిపంపలేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు లేదా ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు అని పేర్కొన్నారు.

భగ్గుమన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

ఫడ్నవీస్‌పై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ధ్వజమెత్తాయి. మహారాష్ట్రకు ఫడ్నవీస్ ద్రోహం చేశారని శివసేన విమర్శించగా.. హెగ్డే వ్యాఖ్యలు నిజమైతే ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. మోదీ సర్కారు నిజస్వరూపాన్ని, మహారాష్ట్ర పట్ల బీజేపీ వ్యతిరేక ధోరణిని హెగ్డే బట్టబయలుచేశారని కాంగ్రెస్ పేర్కొన్నది.

598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles