పథకాల అమలుకు బడ్జెట్ తప్పనిసరి ఈసీకి కేంద్రం వివరణ

Wed,January 11, 2017 12:41 AM

న్యూఢిల్లీ: ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున ఎన్నికల ముందు యూనియన్ బడ్జెట్ సమర్పించకూడదని విపక్షాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎలెక్షన్ కమిషన్‌కు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు బడ్జెట్ సమర్పణను వాయిదా వేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని ఈసీని విపక్షాలు కోరాయి. విపక్షాలకు సమాధానంగా ఈసీకి క్యాబినెట్ సెక్రటేరియట్ లేఖ రాసింది. బడ్జెట్ కొన్ని రాష్ర్టాలకు మాత్రమే పరిమితం కాదని, దేశం మొత్తానికి సంబంధించినదని, ఇది సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రక్రియ అని కేంద్రం వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఓటర్లను ఆకర్షించడానికే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారన్న విపక్షాల వాదనను కేంద్రం కొట్టివేసింది. సాధారణంగా బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశపెడుతారు. ఈ బడ్జెట్ వచ్చే ఏడాది అమలులోకి వస్తుంది. ఫలితంగా కొత్త పథకాలు అమలు చేయాలంటే ఆలస్యం అవుతుంది. కాబట్టి ముందుగానే బడ్జెట్‌ను సమర్పించాల్సిన అవసరం ఉందని ఈసీకి ప్రభుత్వం వివరించినట్లు తెలిసింది. జనవరి 31న లోక్‌సభ, రాజ్యసభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. తరువాత ఆర్థిక సర్వే, యూనియన్ బడ్జెట్‌లను సమర్పిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 8 లోపు బడ్జెటరీ ప్రతిపాదనలను అధ్యయనం చేయాల్సిందిగా పార్లమెంటరీ కమిటీలకు తెలియజేశామని బడ్జెట్ సమావేశాన్ని ముందుగానే జరపాలన్న తన తీర్మానాన్ని సమర్థించుకుంటూ కేంద్రం పేర్కొంది. ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ సమర్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతికి, ఎన్నికల సంఘానికి విపక్షాలు లేఖ రాశాయి. బడ్జెట్ సమర్పణను మార్చి 8వ తేదీ వరకు వాయిదా వేసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విపక్షాలు కోరాయి. జేడీయు, బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీలతో కూడిన ప్రతినిధుల బృందం చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ నజీమ్ జైదీని జనవరి 5న కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 4న పంజాబ్, గోవాలో, మార్చి 8న ఉత్తరప్రదేశ్, మణిపూర్‌లో చివరి దశ ఎన్నికలు జరుగుతాయి.

151

More News