అంత్యక్రియలకు వెళ్లనివ్వని కుల అహంకారం!


Fri,August 23, 2019 03:56 AM

denied-road-access-dalits-vellore-forced-lower-body-bridge-cremation

-దళితవ్యక్తి మృతదేహాన్ని పంటపొలాల మీదుగా తీసుకెళ్లేందుకు అగ్రవర్ణాల నిరాకరణ
-శవాన్ని బ్రిడ్జి నుంచి దించి అంత్యక్రియలకు తీసుకెళ్లిన బంధువులు
-తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో దారుణం

చెన్నై, ఆగస్టు 22: మానవత్వానికే మాయని మచ్చ. దళితులపై అగ్రవర్ణాల వివక్షకు మచ్చుతునక ఈ ఘటన. తమ పంటపొలాల నుంచి దళిత వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అగ్రవర్ణాలవారు నిరాకరించడంతో మరోదారి లేక వంతెనపై నుంచి మృతదేహాన్ని కిందకు జారవిడిచి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. తమిళనాడులోని వెల్లూరు జిల్లా వనియంపాడికి చెందిన కుప్పన్ (46) ఆగస్టు 16న రోడ్డు ప్రమాదంలో మరణించారు. పోస్టుమార్టం అనంతరం మరుసటిరోజు కుప్పన్ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లుచేశారు. శ్మశానానికి వెళ్లే మార్గం రెండు అగ్రవర్ణాలవారి పొలాల మీదుగా ఉన్నది. ఆ మార్గం గుండా శవాన్ని తీసుకెళ్లేందుకు వారు అంగీకరించలేదు. పురాతనమైన ఆది ద్రావిడర్ శ్మశాన వాటికకు ఈ పంట పొలాల నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు పొలాల యజమానులు అంగీకరించలేదు.

vellore2
దీంతో కుటుంబసభ్యులు ఆ మృతదేహాన్ని సమీపంలోని 20 అడుగుల ఎత్తున్న వంతెనపై నుంచి తాళ్లసాయంతో కిందకు జారవిడువగా, అప్పటికే కింద ఉన్న మరికొందరు పాడెను భుజాలకెత్తుకున్నారు. పొలాల మీదుగా వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా పలార్‌నది తీరం వెంబడి నడుచుకుంటూ తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే తొలి ఘటన కాదని, పదేండ్ల క్రితం బ్రిడ్జి నిర్మించిననాటి నుంచి అగ్రవర్ణాలవాళ్లు ఇలా చేస్తున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. రెవెన్యూ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దళితుల అంత్యక్రియల కోసం భూమిని కేటాయించామని, ఇకపై ఇలాంటి ఘటనలు జరుగబోవని అధికారులు తెలిపారు.మరోవైపు ఈ ఘటనను మద్రాస్ హైకోర్టు సుమోటో కేసుగా స్వీకరించింది. వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

1516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles