చీఫ్ జస్టిస్ ఎక్కువా కాదు.. తక్కువా కాదు


Sat,January 13, 2018 10:58 AM

Democracy At Stake Things Not In Order 4 Supreme Court Judges  10 Points

-హైకోర్టుల స్వతంత్రతను ప్రభావితం చేసే తీర్పులు వస్తున్నాయి
-ధర్మాసనాలకు కేసుల అప్పగింత హేతుబద్ధంగా జరుగట్లేదు
-సీజేకి రాసిన లేఖలో న్యాయమూర్తులు

SUPREME
న్యూఢిల్లీ, జనవరి 12: సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థను తప్పుపట్టిన న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రాకు రాసిన ఏడు పేజీల లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖలో ఉన్న ముఖ్యాంశాలు..తీవ్ర ఆవేదనతో ఈ లేఖ రాస్తున్నాం. ఇటీవలి పలు అంశాలను ప్రస్తావించేందుకు ఈ లేఖ మీకు రాయడమే సబబు అనిపించింది. న్యాయవ్యవస్థ పనితీరు, హైకోర్టుల స్వతంత్రత, అదే సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయ పాలనావ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపే తీర్పులు ఇటీవల వస్తున్నాయి. ప్రత్యేకాధికారాలనిస్తూ కలకత్తా, బాంబే, మద్రాస్ హైకోర్టులు ఏర్పాటు చేసినప్పటినుంచి కొన్ని సంప్రదాయాలు అమల్లో ఉన్నాయి. వందేండ్లకు పైగా చరిత్ర ఉన్న ఆ కోర్టుల ప్రాధాన్యతను తగ్గించేలా ఇటీవలికాలంలో సుప్రీంకోర్టు వ్యవహరిస్తున్నది. ప్రధాన న్యాయమూర్తి మాస్టర్ ఆఫ్ రోస్టర్ అనేది కూడా అలాంటి స్థిరపడిన సంప్రదాయాల్లో ఒకటి. ఏ కేసును ఏ ధర్మాసనం విచారించాలో నిర్దేశించడం ప్రధాన న్యాయమూర్తి విశేషాధికారం. అది న్యాయస్థానాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా కేసుల విచారణ సాగించేందుకే తప్ప, చీఫ్ జస్టిస్ తన అధికారాన్ని చెలాయించేందుకు కాదు. ప్రధాన న్యాయమూర్తి అంటే సమానుల్లో ప్రథముడని మాత్రమే మనదేశంలో స్థిరపడిన విధానం. న్యాయమూర్తులంతా సమానులే. ప్రధాన న్యాయమూర్తి ఎక్కువ కాదు.. తక్కువ కాదు.

కేసుల విచారణకు తగినంతమంది సభ్యులున్న ధర్మాసనాలను ఏర్పాటు చేయాలి. మిశ్రమ న్యాయమూర్తులతో అవి విచారణ జరుపాలి. కానీ కొన్ని కేసుల విచారణలో ధర్మాసనాల కేటాయింపు హేతుబద్ధంగా జరుగక.. వారికి (కొంతమంది న్యాయమూర్తులకు) అనుకూలంగా మాత్రమే జరిగింది. దేశంతోపాటు వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపగల కేసులను సహేతుకత లేకుండా, ఎంపిక చేసుకున్న ధర్మాసనాలకు సీజేఐ అప్పగిస్తున్న సందర్భాలున్నాయి. దీని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడాలి. అత్యున్నత న్యాయవ్యవస్థ గౌరవానికి ఇబ్బందులు తీసుకురాకుండా ఉండేందుకు వాటి గురించి మేం ఇక్కడ వివరాలను ప్రస్తావించడంలేదు. కానీ వాటి వల్ల న్యాయవ్యవస్థ గౌరవానికి ఇప్పటికే కొంత నష్టం జరిగింది. గత ఏడాది అక్టోబర్ 27న మీరు జారీ చేసిన ఆదేశాల గురించి ఇక్కడ ప్రస్తావించదలిచాం.

ఏ కేసును ఏ ధర్మాసనం విచారించాలో నిర్దేశించే అధికారం మీదేనని మరోసారి చెప్పారు. విస్తృత ప్రజాప్రయోజనం దృష్ట్యా కార్యసరళి జాబితా (మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్) ప్రకటించడంలో జాప్యం ఉండొద్దని ఆర్పీ లూథ్రా వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఒక కేసుపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్నప్పుడు మరో బెంచ్‌కు ఆ కేసును మార్చడంలో ఆంతర్యం అర్థంకాకుండా ఉంది. ఈ పాలనాపరమైన అంశాలపై సీరియస్‌గా చర్చించాల్సిన అవసరముంది. న్యాయవ్యవస్థలో నెలకొన్న అవాంఛనీయ పరిస్థితుల్ని చక్కదిద్దుతారని ఆశిస్తున్నాం. ఇందుకోసం కొలీజియంలోని సభ్యులందరితో చర్చించాలని చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం అని చీఫ్‌జస్టిస్‌కు రాసిన లేఖపై నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్‌బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ సంతకాలు చేశారు.

691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles