
- పిటిషన్‌పై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి- మైనార్టీల కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: రాష్ర్టాల వారీ జనాభా ప్రాతిపదికన మైనార్టీలను (అల్పసంఖ్యాక వర్గాలను) నిర్వచించేందుకు మార్గదర్శకాలను నిర్దేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జాతీయ మైనార్టీల కమిషన్ (ఎన్సీఎం) మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ పిటిషన్‌ను మళ్లీ ఎన్సీఎంలో దాఖలు చేయాలని, ఆ తర్వాత ఎన్సీఎం సోమవారం నుంచి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుంటుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీజేపీ నేత, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్‌కి సూచించింది. మైనార్టీలు అనే పదాన్ని దేశ జనాభా గణాంకాల ఆధారంగా కాకుండా రాష్ర్టాల వారీ జనాభా సంఖ్య ఆధారంగా పునర్నిర్వచించాల్సిన అవసరం ఉన్నదని ఉపాధ్యాయ్ తన పిటిషన్లో తెలిపారు. జాతీయ గణాంకాల ప్రకారం మెజార్టీలు (అధిక సంఖ్యాకులు)గా ఉన్న హిందువులు జమ్ము-కశ్మీర్‌తోపాటు పలు ఈశాన్య రాష్ర్టాల్లో మైనార్టీలుగా ఉన్నారని, అయినప్పటికీ ఈ రాష్ర్టాల్లో మైనార్టీలకు కల్పిస్తున్న ప్రయోజనాలు హిందువులకు లభించడంలేదని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మైనార్టీలు అనే పదానికి నిర్వచనాన్ని పునఃపరిశీలించాలని ఉపాధ్యాయ్ కోరారు. దేశంలోని ఏడు రాష్ర్టాలతోపాటు మరో కేంద్రపాలిత ప్రాంతంలో హిందువులకు మైనార్టీ హోదా కల్పించాలని కోరుతూ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను 2017లో సుప్రీంకోర్టు నిరాకరిస్తూ.. ఎన్సీఎంను సంప్రదించాలని ఆయనకు సూచించింది.