ప్రధాని మౌనం ప్రభుత్వం గందరగోళం

Fri,December 6, 2019 02:46 AM

-అయోమయంలో దేశ ఆర్థిక స్థితి
-చిదంబరం విమర్శలు
-తనపై నమోదైన కేసులో న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్య

న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక స్థితిపై అసమర్థంగా, కశ్మీర్‌పై అహంకారంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. దేశం ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోతున్నా ప్రధాని నోరు మెదప డం లేదని, ప్రభుత్వం తీవ్ర గందరగోళంలో ఉన్నదన్నారు. కేంద్ర మంత్రులు బుకాయింపులతో బడాయిలకు పోతున్నారని చెప్పారు. దాదాపు 106 రోజులు తీహార్‌ జైలులో గడిపిన చిదంబరం బుధవారం విడుదలైన సంగ తి తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం లో, తిరిగి పార్లమెంట్‌ వద్ద గురువారం ఆయ న మీడియాతో మాట్లాడారు. వరుసగా గత ఆరు త్రైమాసికాల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని చూస్తే 8, 7, 6.6, 5.8, 5, 4.5గా నమోదైందని, దేశ ఆర్థిక పరిస్థితికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయన్నారు. ఈ ఏడాది ఐదు శాతం జీడీపీతో ముగిస్తే అది అద్భుతమేనన్నారు. ‘ప్రజల వద్ద డబ్బు లేక వారి కొనుగోలు శక్తి తగ్గింది. అనిశ్చితి, భయంతో వారిలో ఆకలి చచ్చిపోయింది’ అని అన్నారు. ప్రజల నుంచి డిమాండ్‌ పెరిగే వరకూ ఉత్పత్తి పెరుగదన్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఈ ప్రభుత్వం అసమర్థతతో గందరగోళాన్ని ఎదుర్కొంటున్నదని విమర్శించారు. నోట్ల రద్దు, లోపభూయిష్టమైన జీఎస్టీ, పన్ను ఉగ్రవాదం, స్వదేశీ వస్తు రక్షణ విధానం, నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రధానమంత్రి కార్యాలయం లో కేంద్రీకృతం కావడం వంటి వాటి విషయంలో ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ సమర్థించుకుంటున్నదని దుయ్యబట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు గడిచిపోయినా బీజేపీకి చీమ కుట్టనట్టయినా లేదన్నారు. ఆర్థిక స్థితిని పుంజుకునేలా చేయగల ఆర్థిక మేధావులను ప్రభుత్వం వెలివేసిందన్నారు. యూపీఏ ప్రభుత్వం 2004-2014 మధ్య 14 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడవేసిందని.. కానీ ఎన్డీయే ప్రభు త్వం 2016 నుంచి కొన్ని లక్షల మందిని పేదరికంలోకి నెట్టిందని చిదంబరం ధ్వజమెత్తారు. మాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థను ఇప్పటికైనా బయటపడవేయవచ్చని, కానీ ఈ ప్రభుత్వానికి ఆ సామర్థ్యం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రజలు భయపడుతున్నారా? అని ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్‌ బజాజ్‌ కేంద్ర హోంమంత్రిని ప్రశ్నించడాన్ని విలేకరులు ప్రస్తావించగా, ‘అవును అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. మీడియా కూడా భయం గుప్పిట్లోనే ఉంది’ అని చిదంబరం పేర్కొన్నారు.

నా ఆలోచనలన్నీ కశ్మీరీలపైనే

జైలు నుంచి విడుదల కాగానే కశ్మీర్‌లోని 75 లక్షల మంది గురించే ఎక్కువగా ఆలోచించానని చిదంబరం చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 4 నుంచి కశ్మీరీల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారన్నారు. ప్రభుత్వం తనను అడ్డుకోకుంటే.. జమ్ముకశ్మీర్‌ను సందర్శిస్తానని తెలిపారు. కశ్మీర్‌పై ప్రభుత్వం దురుద్దేశపూరితంగా వ్యవహరించిందన్నారు. అక్కడి రాజకీయ నేతలపై ఏ అభియోగాలు లేకపోయనా నిర్బంధంలో ఉంచిందని,వారి స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

బెయిల్‌ నిబంధనల ఉల్లంఘన: బీజేపీ

కాంగ్రెస్‌ నేత చిదంబరం బెయిల్‌ నిబంధనలను ఉల్లంఘించారని బీజేపీ ఆరోపించింది. బెయిల్‌ విడుదలైన మరునాడే మంత్రిగా తన రికార్డు నిష్కళంకంగా ఉన్నదని చిదంబరం చేసిన వ్యాఖ్యలు బెయిల్‌ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నది. ఆర్థిక మంత్రి గా ఉన్నప్పుడు ఆయన అవినీతి పాల్పడ్డారన్నదే ఆయనపై నమోదైన కేసు అని బీజేపీ గుర్తు చేసింది. తాను నిష్కళంకుడినని తనకు తాను సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విమర్శించారు.

చెక్కబల్లపై నిద్రతో శారీరకంగా బలపడ్డా

జైలు జీవితం తనలో మరింత ఆత్మ ైస్థెర్యం నింపడంతోపాటు శారీరకంగానూ బలపడ్డానని చిదంబరం చెప్పారు. తాను తీహార్‌ జైలులో గడపడం వల్ల తన మెడ, నడుము, వెన్నెముక పటిష్ఠం అయ్యాయని చెప్పారు. దిండు లేకుండా చెక్క బల్లపై పడుకోవడంతో మెడ, వెన్నెముక, నడుము బలపడుతాయన్నారు. బెయిల్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకున్న చిదంబరం.. తన కేసు విషయమై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కోర్టులు న్యాయం చేస్తాయని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు. మంత్రిగా తన రికార్డు, తన ఆత్మసాక్షి తేటతెల్లగా ఉన్నాయన్నారు. ఈ విషయం తనతో కలిసి పనిచేసిన అధికారులకు, వాణిజ్యవేత్తలకు, తనను పరిశీలించిన జర్నలిస్టులకు కూడా తెలుసునన్నారు. తాము ప్రతీకార రాజకీయాలకు పాల్పడబోమని స్పష్టం చేశారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles