కేంద్ర ఉద్యోగులకు 1% డీఏపెంపుWed,September 13, 2017 03:32 AM

పన్నురహిత గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షలకు

- పన్నురహిత గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షలకు పెంపు
-కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 1 శాతం అదనపు డీఏ
-కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
cabinet
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగులు, పింఛనుదారులకు జూలై 1 నుంచి ఒక్కశాతం డీఏ అదనంగా ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో గతంలో ప్రకటించిన నాలుగు శాతం డీఏ ఇక ఐదుశాతం కానున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పన్నురహిత గ్రాట్యుటీ పరిమితిని రెట్టింపు చేసి గరిష్ఠంగా 20 లక్షలకు పెంచింది. ప్రైవేటు ఉద్యోగులతోపాటు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనల పరిధిలోకి రాని.. ప్రభుత్వాధీనంలోని సంస్థలు, ప్రత్యేక ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు దీని పరిధిలోకి రానున్నారు. గ్రాట్యుటీ పరిమితిని సవరించేందుకు రూపొందించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు వీలుగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఇంతవరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల పన్నురహిత గ్రాట్యుటీ పరిమితి రూ.10 లక్షల వరకు ఉండేది. ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది. ఉద్యోగ విరమణ తర్వాత ఉద్యోగికి ఆర్థిక, సామాజిక భద్రతను కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకశాతం అదనపు డీఏను ప్రకటించింది. ఈ నిర్ణయంతో 49.26లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 61.17లక్షలమంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనున్నది. కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి పెంచిన కరువు భత్యం (డీఏ) ద్వారా రూ.3,068 కోట్లు, కరువు ఉపశమనం (డీఆర్) ద్వారా రూ.2045 కోట్ల భారం పడనున్నది.

ఏపీలో జాతీయ రహదారి విస్తరణకు రూ.1423 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట-రణస్థలం జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 54 కిలోమీటర్ల మేర రోడ్డును రూ.1423 కోట్లతో ఆరు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. ఆరోగ్యరంగంలో మొరాకో దేశంతో, ప్రకృతి వైపరీత్యాల విషయంలో అర్మేనియాతో కలిసి పనిచేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దౌండ్- మన్మాడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని పుణె, అహ్మద్‌నగర్, నాసిక్ మధ్య ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడనుంది.

పాడి పరిశ్రమ అభివృద్ధికి రూ.10,881 కోట్లు

పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తి రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.10,881 కోట్లు కేటాయించేందుకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అంగీకారం తెలిపింది. రానున్న 11 ఏండ్ల పాటు ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నారు.

కేంద్ర క్యాబినెట్ కమిటీల్లో మార్పులు

కేంద్ర క్యాబినెట్ కమిటీల్లో పలు మార్పులు జరిగాయి. దేశ భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్షతన గల భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో నిర్మల సీతారామన్‌కు చోటు లభించింది. రాజకీయ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీల్లో పీయూష్ గోయల్, నిర్మల సీతారామన్ చోటు సంపాదించారు. అలాగే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కూడా ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో చోటు లభించింది.

943

More News

VIRAL NEWS