ముంచుకొస్తున్న తిత్లీ తుఫాన్


Thu,October 11, 2018 01:50 AM

cyclone titli may hit odisha ap and west bengal at anytime high alert in states

-అతితీవ్ర తుఫానుగా.. నేడు తీరాన్ని తాకవచ్చని అంచనా
-అప్రమత్తమైన ఒడిశా, ఏపీ, పశ్చిమ బెంగాల్
-సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు
-శ్రీకాకుళం జిల్లాలో ఏడో ప్రమాద హెచ్చరిక జారీ

భువనేశ్వర్, అక్టోబర్ 10: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అతి తీవ్ర తుఫానుగా పరివర్తన చెందింది. దీంతో అటు ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా ఉన్న తిత్లీ తుఫాను మరింత ఉధృతంగా మారిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం తెలిపింది. గురువారం ఉదయం 5.30 గంటలకు తుఫాను తీరాన్ని తాకవచ్చని అంచనా వేస్తున్నారు. తీరాన్ని తాకిన అనంతరం తుఫాను మలుపు తీసుకొని ఉత్తర దిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనించి బలహీనపడవచ్చని భువనేశ్వర్‌లోని వాతావరణ విభాగం డైరెక్టర్ హెచ్‌ఆర్ బిశ్వాస్ చెప్పారు. దీంతో ఒడిశా, ఉత్తరాంధ్రతోపాటు పశ్చిమ బెంగాల్లోని గంగానదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపారు.

తీరం వెంట 140 నుంచి 150 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని, గాలుల తీవ్రత 165 కి.మీ. వరకు పెరుగవచ్చని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఏడు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడవచ్చని చెప్పారు. తుఫాను తీరాన్ని తాకినప్పుడు మీటరు ఎత్తుతో అలలు తన్నుకు రావచ్చునని, దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో ఒడిశా ప్రభుత్వం ఐదు కోస్తా జిల్లాలకు చెందిన దాదాపు మూడు లక్షల మందిని ఖాళీ చేయించింది. గురు, శుక్రవారాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఖుర్దారోడ్, విజయనగరం మధ్య నడిచే ఆరు రైళ్లను రద్దు చేశారు, మరికొన్నింటిని దారి మళ్లించారు.

Titli-toofan

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం, సంతబొమ్మాళి మధ్య తీరం దాటవచ్చ ని భావిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం అప్రమత్తమైంది. కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల్లో ఇప్పటికే ఏడో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. విశాఖ, గంగవరం ఓడరేవుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో 15 నుంచి 25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.

తెలంగాణలో ప్రభావం నామమాత్రమే

తిత్లీ తుఫాను ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. గాలిలో తేమ శాతం తగ్గి వాతావరణం చల్లబడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు చెప్పారు.

మహోగ్రంగా మారిన మైఖేల్

అమెరికాలోని ఫ్లోరిడా వైపు దూసుకొస్తున్న విపత్తు
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో కేంద్రీకృతమైన హరికేన్ మైఖేల్ మహోగ్రరూపం దాల్చిందని.. దీనిని నాలుగో క్యాటగిరీ తుఫాన్‌గా గుర్తించామని అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం బుధవారం వెల్లడించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ హరికేన్.. ఫ్లోరిడా గల్ఫ్ తీరం వైపు దూసుకొస్తున్నదని.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం అది తీరాన్ని తాకుతుందని పేర్కొన్నారు. గంటకు 210 కి.మీ. వేగంతో అత్యంత తీవ్రమైన పెనుగాలులు వీస్తాయని హెచ్చరించారు.

1051
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles