బుల్‌బుల్‌ బీభత్సం!

Mon,November 11, 2019 03:03 AM

- నేలకూలిన వేలాది వృక్షాలు, దెబ్బతిన్న ఇండ్లు
- ఒడిశాలో ఇద్దరు.. బెంగాల్‌, బంగ్లాదేశ్‌లో పది మంది చొప్పున మృత్యువాత
- తుఫాను పరిస్థితులపై బెంగాల్‌ సీఎం మమతను అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ

కోల్‌కతా/భువనేశ్వర్‌/ఢాకా, నవంబర్‌ 10: బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్‌బుల్‌ తుఫాను పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరప్రాంత జిల్లాలతో పాటు బంగ్లాదేశ్‌లో బీభత్సం సృష్టిస్తున్నది. సాగర్‌ ద్వీపం వద్ద శనివారం రాత్రి తీరం దాటిన ఈ తుఫాన్‌.. ప్రచండ గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడుతున్నది. బుల్‌బుల్‌ తుఫానుధాటికి ఒడిశాలో ఇద్దరు, పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లో పది మంది చొప్పున మృతిచెందారు. వేల హెక్టార్లలో పంటలు నాశనం అయ్యాయి. బెంగాల్‌లో 2.73 లక్షల కుటుంబాలపై తుఫాను ప్రభావం చూపినట్టు అధికారులు తెలిపారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేసి తుఫాను పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి తీరం దాటిన బుల్‌బుల్‌ తుఫానుతో పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం ఉదయం బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.

దీంతో వందలాది వృక్షాలు నేలకూలాయి. ప్రజాజీవనం స్తంభించింది. ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్‌, కోల్‌కతా నగరంలో పలు కేబుళ్లు ధ్వంసమయ్యాయి. తుఫాను కారణంగా ఉత్తర పరగణాల జిల్లాలో జరిగిన వివిధ ఘటనల్లో ఐదుగురు, తూర్పు మిడ్నాపూర్‌లో చెట్టు కూలిన ఘటనలో ఓ వ్యక్తి చనిపోగా, శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి చెట్టు కూలిన ఘటనలో ఓ ఉద్యోగి మరణించాడు. దక్షిణ పరగణాల జిల్లాలో ఇద్దరు చనిపోయారు. ప్రసెర్‌గంజ్‌ పట్టణంలో ఓ మత్స్యకారుడి మృతదేహాన్ని కనుగొన్నట్టు అధికారులు తెలిపారు. తుఫానుధాటికి 12 మంది మత్స్యకారులు గల్లంతైనట్టు అధికారులు ప్రకటించారు. తుఫానుధాటికి కనీసం 2,437 ఇండ్లు పూర్తిగా, మరో 26 వేల ఇండ్లు పాక్షికంగా ధ్వంసమైనట్టు రాష్ర్ట విపత్తు నిర్వహణ శాఖ మంత్రి జావేద్‌ఖాన్‌ తెలిపారు. 1.78 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. ఒడిశాపై కూడా బుల్‌బుల్‌ ప్రభావాన్ని చూపింది. తుఫాను వల్ల ఆ రాష్ర్టంలో ఇద్దరు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో తుఫాను ప్రభావం కనిపించిందని, పెద్దమొత్తంలో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వేలాది ఇండ్లు నేలమట్టం

బుల్‌బుల్‌ తుఫాను పొరుగు దేశం బంగ్లాదేశ్‌ మీద కూడా తన ప్రభావాన్ని చూపుతున్నది. తుఫానుధాటికి ఇప్పటివరకు ఆ దేశంలో పది మంది పౌరులు మృతిచెందారు.

ప్రధాని, హోంమంత్రి ఆరా

బెంగాల్‌లో బుల్‌బుల్‌ తుఫాను పరిస్థితులపై ప్రధాని మోదీ సీఎం మమతను ఆదివారం ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. కేంద్ర సర్కారు తరుఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. హోంమంత్రి అమిత్‌ షా కూడా మమతతో తుఫాను పరిస్థితులపై చర్చించారు. ఇప్పటికే బెంగాల్‌లో పది, ఒడిశాలో ఆరు చొప్పున ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయనిఅమిత్‌ షా పేర్కొన్నారు.

14686
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles