మా అంత్యక్రియలు ఒకేచోట జరిపించండి

Thu,December 5, 2019 01:53 AM

-సామూహిక ఆత్మహత్యకు ముందు గోడపై రాసిన ఘజియాబాద్ వ్యాపారి

ఘజియాబాద్: మా అంత్యక్రియలు ఒకేచోట జరిపించండి అని గోడపై రాసి ముగ్గురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కలకలం రేపింది. వ్యాపారవేత్త గుల్షన్ వాసుదేవ (45), ఆయన భార్య ప్రవీణ్, వారి మేనేజర్ సంజన.. ఇందిరాపురంలోని అపార్టుమెంట్ ఎనిమిదో అంతస్తు పైనుంచి దూకి మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు ఫ్లాట్‌లోనే వాసుదేవ.. వారి పిల్లలు హృతిక్ (14), హృతిక (18)ను చంపినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడే ఓ గోడపై మా అంత్యక్రియలు ఒకేచోట జరిపించండి అని రాసి ఉన్నదని, అంత్యక్రియల ఖర్చులకు రూ.10 వేలు కూడా అక్కడే పెట్టారని పోలీసులు బుధవారం తెలిపారు. తాము ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి, ఆత్మహత్య చేసుకొనేందుకు కారణం తన బావ రాకేశ్ వర్మ అని ఆరోపిస్తూ.. అతడు ఇచ్చిన చెల్లని(బౌన్స్) చెక్కును సైతం గోడకు అతికించారని పేర్కొన్నారు. చెక్కులు బౌన్స్ అయ్యాయి. వర్మ ఆదేశంతో ఆస్తులపై వాసుదేవ పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదు. వ్యాపారం దివాళా తీసింది.

కుటుంబం ఒత్తిడిలో పడిపోయింది అని ఘజియాబాద్ సీనియర్ ఎస్పీ సుధీర్‌కుమార్ సింగ్ తెలిపారు. వాసుదేవ చివరి కోరిక మేరకు ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్కడ స్వాధీనం చేసుకున్న డబ్బును కుటుంబసభ్యులు, బంధువులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. కొడుకు, కుమార్తెను చంపిన తర్వాత, చూసుకొనేందుకు ఎవరూ ఉండరని భావించి పెంపుడు కుందేలును కూడా వాసుదేవ చంపేశారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వాసుదేవ.. ఢిల్లీలో నివసించే తన బంధువు రమేశ్ అరోరాకు వాట్సప్ వీడియోకాల్ చేశాడు. ఇంట్లోని దృశ్యాలను చూపించాడు. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడొద్దని, ఆర్థికంగా ఆదుకుంటానని ఆ సమయంలో అరోరా భరోసా ఇచ్చారని పోలీసులు చెప్పారు. మానసికంగా కుంగిపోయిన వాసుదే వ.. నెల నుంచే తన వ్యాపారలావాదేవీలన్నీ ముగించుకున్నారని చెప్పారు. వ్యక్తిగత సిబ్బందికి కూడా జీతాలిచ్చి మళ్లీ పనిలోకి రావొద్దని సూచించాడని, ఇంట్లోని దుస్తులను కూడా పంచేశాడని చెప్పారు. సామూహిక ఆత్మహత్యకు కారణమైన రాకేశ్ వర్మను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

1160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles