హింసకు కారణం మీరే!


Thu,May 16, 2019 02:47 AM

CPM rallies to protest against BJP TMC clashes in Kolkata

- కోల్‌కతాలో మంగళవారం నాటి అల్లర్లపై పరస్పరం విమర్శించుకున్న టీఎంసీ, బీజేపీ
- ఈసీకి పోటాపోటీ ఫిర్యాదులు.. ఆధారాలు అందజేత
- కోల్‌కతాలో టీఎంసీ, సీపీఎం నిరసన ర్యాలీలు


బీజేపీ గూండాల పనే

మావద్ద 44 వీడియోలు ఉన్నాయి: తృణమూల్
కోల్‌కతా, మే 15: కోల్‌కతాలో మంగళవారం సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది బీజేపీ గూండాలేనని టీఎంసీ ఆరోపించింది. ఆధారాలుగా పలు వీడియోలను విడుదల చేసింది. ఆ పార్టీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, సుఖేందు శేఖర్ రే, మనీశ్‌గుప్తా, నదిముల్ హక్ బుధవారం ఎన్నికల కమిషన్(ఈసీ)ను కలిశారు. బీజేపీ వర్గీయులు హింసకు పాల్పడ్డారని ఫిర్యాదుచేశారు. ఇందుకు ఆధారాలుగా పలు వీడియోలను సమర్పించారు. అంతకుముందు డెరెక్ ఓ బ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ హింసకు కారణం బీజేపీ అని నిరూపించే వీడియోలు తమవద్ద ఉన్నాయన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అబద్ధాల కోరు అని, ద్రోహి అని ఈ వీడియోలు చూస్తే స్పష్టమవుతుందన్నారు. తమ వద్ద మొత్తం 44 వీడియోలు ఉన్నాయన్నారు. వాటిని ఈసీకి సమర్పించి, దోషులను శిక్షించాల్సిందిగా కోరుతామని చెప్పారు. మంగళవారం బెంగాల్ ఆత్మగౌరవంపై దాడి జరిగిందని, కోల్‌కతా వీధులన్నీ ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నాయన్నారు. ఒబ్రెయిన్ ప్రదర్శించిన ఓ వీడియో లో పలువురు వ్యక్తులు విద్యాసాగర్ కాలేజ్ గేట్ వద్దకు వచ్చి తాళాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నించారు.
mamatha1
కుదురకపోవడంతో గేటు దూకి లోపలికి ప్రవేశించారు. మరో వీడియో, వాట్సాప్ మెసేజ్‌లో ఓ బీజేపీ మద్దతుదారు అమిత్‌షా రోడ్‌షోకు రాడ్‌లు, ఆయుధాలతో రావాలని, టీఎంసీకి, పోలీసులకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలను కోరుతున్నాడు. కోల్‌కతాలో హింసకు ఎవరు కారణమో ఈ రెండు వీడియోలు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఒబ్రెయిన్ పేర్కొన్నారు. అల్లర్ల సందర్భంగా విద్యాసాగర్ పని అయిపోయింది (విద్యాసాగర్ ఫినిష్డ్) వంటి నినాదాలు చేశారని ఆరోపించారు. ఇవి వీడియోలో రికార్డయ్యాయని, ఆడియోను వేరుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బెంగాల్ ప్రజలు బీజేపీకే ఓటేయాలంటూ ఎన్నికల విధుల్లో ఉన్న భద్రతాబలగాలు చాటుమాటుగా ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే ఈసీకి మూడు లేఖలు రాశామని, తాజాగా మరో లేఖ రాశామని వివరించారు. ఎంపీ మనీశ్‌గుప్తా మాట్లాడుతూ అమిత్‌షా రోడ్‌షో కోసం బీజేపీ నేతలు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి మనుషులను తీసుకొచ్చారని, వారికి హోటళ్లు, అద్దెగదుల్లో బస కల్పించారని విమర్శించారు. వారు తప్పతాగి అల్లర్లు సృష్టించారని ఆరోపించారు.

బీజేపీకి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన

ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ ఫొటోలను సీఎం మమతాబెనర్జీ, టీఎంసీ నేతలు తమ సోషల్‌మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకొని నిరసన తెలుపుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బుధవారం టీఎంసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మమతాబెనర్జీ మాట్లాడుతూ అమిత్‌షా అందరికన్నా తానే గొప్పవాడినని భావిస్తున్నారా? ఆయనేమన్నా దేవుడా.. ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ నిరసన తెలుపొద్దా? అని ప్రశ్నించారు. బయటి వ్యక్తి ఈ అల్లర్లకు కారణమయ్యారని అమిత్‌షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పశ్చిమబెంగాల్‌లో మంగళవారం జరిగిన హింసపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. కోల్‌కతాలోని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసంచేయడంతోపాటు హింసను సృష్టించింది.. మీరే అంటే మీరేనంటూ ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. పోటాపోటీగా ఎన్నికల కమిషన్‌కు (ఈసీకి) ఫిర్యాదు చేశారు. ఆధారాలను సమర్పించారు. మరోవైపు టీఎంసీ, సీపీఎం పార్టీలు బుధవారం కోల్‌కతాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

మోదీ-షా ద్వయానిదే బాధ్యత: కాంగ్రెస్

పశ్చిమబెంగాల్‌లో మంగళవారం జరిగిన హింసకు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి బుధవారం మాట్లాడుతూ కోల్‌కతాలో విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం చేయడం సిగ్గుమాలిన పని అని మండిపడ్డారు. మోదీ-షా కలిసి దేశంలో మూకదాడులను ప్రోత్సహిస్తున్నారని, ప్రణాళికాబద్ధంగా రాష్ర్టాల్లో సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడుతున్నారన్నా రు. సమాఖ్య స్ఫూర్తి, రాష్ర్టాల ఆశలను గౌరవించడం వంటివన్నీ బీజేపీ పాలనలో ప్రమాదంలో పడ్డాయన్నారు. నియంతృత్వపోకడలు బీజేపీ డీఎన్‌ఏలోనే ఉన్నాయన్నారు. బీజేపీ మద్దతుదారులు గతంలో చెన్నైలో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసినా, అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.
BJP

తృణమూల్ వల్లే విధ్వంసం

- విద్యాసాగర్ విగ్రహాన్ని వారే నేలకూల్చారు
- మౌన ముద్రలో ఈసీ: అమిత్‌షా

కోల్‌కతాలో మంగళవారం జరిగిన హింసకు తృణమూల్ కాంగ్రెస్సే కారణమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. ఆ పార్టీ కోడ్ ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం(ఈసీ) మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తున్నదని మండిపడ్డారు. ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం వెనుక బీజేపీ కార్యకర్తలు ఉన్నారన్న ఆరోపణలను ఖండించారు. టీఎం సీ గూండాలే ధ్వంసం చేశారన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లా డుతూ ఈ నెల 23 తర్వాత బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి కౌంట్‌డౌన్ ప్రారంభం అవుతుందని హెచ్చరించారు. మంగళవారం తన కాన్వాయ్‌పై టీఎంసీ కార్యకర్తల దాడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమైందని, సీఆర్పీఎఫ్, పోలీసుల కృషితో బయటపడ్డానన్నారు. బెంగాల్‌లో రిగ్గింగ్ జరుగుతున్నా ఈసీ మారుమాట్లాడటం లేదన్నారు. ఈసీ దేశవ్యాప్తంగా రౌడీషీటర్లను అరెస్టు చేసి జైలులో పెట్టించినా బెంగాల్‌లో మాత్రం బాండ్ రాసుకొని వదిలేశారని విమర్శించారు. ఈసీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించడమేమిటన్నారు. టీఎంసీ కార్యకర్తలే అల్లర్లకు పాల్పడ్డారని ఆధారాలుగా పలు ఫొటోలను చూపారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.
BJP1
బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఎలాంటి తప్పుచేయలేదని భావిస్తే, వెంటనే కోల్‌కతా హైకోర్టు/ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. బెంగాల్‌లో 42 సీట్లలో 23 కన్నా ఎక్కువగా బీజేపీకి వస్తాయన్నారు. దీదీ నాకన్నా పెద్దవారు కావొచ్చు. కానీ నేను ఆమెకన్నా ఎక్కువ సంఖ్యలో ఎన్నికలను ఎదుర్కొన్నా. టీఎంసీ శ్రేణుల హింస మా ఘన విజయానికి సంకేతం. నాపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినంత మాత్రాన బీజేపీ శ్రేణులు తమ పోరు ఆపవు. రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ గెలుపుకోసం కృషిచేస్తారు అని అన్నారు. తాను బీజేపీ అధ్యక్షుడిగా తన పార్టీ ప్రచారం కోసం వచ్చానని మమతాబెనర్జీకి కౌంటర్ ఇచ్చారు. నేను బెంగాల్‌కు వస్తే బయటివ్యక్తి అని విమర్శించారు. మరి మమత బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆమెను కూడా బయటివ్యక్తి అని సంబోధించాలా? అని ప్రశ్నించారు.
BJP2

బెంగాల్‌లో దీదీ దుష్ట పాలన: మోదీ

తకీ: పశ్చిమబెంగాల్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తున్న మమతాబెనర్జీ దుష్ట పాలనను సాగనంపాలని రాష్ట్ర ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇండో-బంగ్లా సరిహద్దుల్లో నార్త్ 24 పరగణాల జిల్లాలోని తకీలో బుధవారం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ మంగళ వారం రోడ్‌షోపై తృణమూల్ గూండాలు ఎలా దాడి చేశారో యావత్ జాతి టీవీ చానెళ్లలో వీక్షించిందని, బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నదన్నారు. దీదీ (మమత) గూండాలు తుపాకులు, బాంబులతో విధ్వంసానికి దిగారు. బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదలతో దీదీ భయపడుతున్నారు. ప్రజాస్వామ్యం మీకు సీఎం పదవినిచ్చింది. కానీ అధికారం మత్తులో మీరు ప్రజాస్వామ్యం గొంతు నొక్కి వేస్తున్నారు. మమతా బెనర్జీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని బెంగాల్ వాసులు నిర్ణయించుకున్నారు అని మోదీ అన్నారు.

879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles