నేడు నింగిలోకి రైశాట్-2బీ


Wed,May 22, 2019 01:22 AM

Countdown begins for Wednesday launch of PSLV C46 satellite says ISRO

- ఉదయం 5:30 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం

చెన్నై, మే 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా అభివృద్ధి చేసిన రైశాట్-2బీ ఉపగ్రహం బుధవారం ఉదయం అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్నది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి ఉదయం 5:30 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకు నమ్మిన బంటైన పీఎస్‌ఎల్వీ రాకెట్ రైశాట్-2బీని నింగిలోకి మోసుకెళ్లనున్నది. పీఎస్‌ఎల్వీ-సీ46 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని భూమికి 555 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేర్చుతుందని ఇస్రో తెలిపింది. ఈ ప్రక్రియ 15 నిమిషాల్లో పూర్తవుతుందని వెల్లడించింది. రైశాట్-2బీ బరువు 615 కిలోలు. జీవితకాలం ఐదేండ్లు. రైశాట్ సిరీస్‌లో ఇది నాలుగో ఉపగ్రహం. 2009లో పంపిన రైశాట్-2 ఉపగ్రహం స్థానంలోకి దీనిని చేరుస్తారు. ఇందులో అమర్చిన అత్యాధునిక రాడార్ భూమిపై ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా స్పష్టమైన ఛాయాచిత్రాలను అందించగలుగుతుంది. ఇది ప్రధానంగా వాతావరణ మార్పులపై నిఘా ఉంచనున్నది.

వ్యవసాయ శాఖకు, అటవీ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడనున్నది. విపత్తుల సమయంలో అత్యవసర సహాయం అందిస్తుంది. అంతేకాకుండా సైన్యం నిఘా కార్యకలాపాలకు కూడా సహాయపడనున్నది. ఇస్రో చైర్మన్ కే శివన్ మంగళవారం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రైశాట్-2బీ ప్రయోగం భారతదేశానికి, ఇస్రోకు అత్యంత ముఖ్యమైన మిషన్ అని పేర్కొన్నారు. ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఉపగ్రహం తయారీకి తమ బృందమంతా చాలా తీవ్రంగా శ్రమించిందని చెప్పారు. మంగళవారం ఉదయం 4:30 గంటలకు 25 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభించామని, అంతా సవ్యంగా సాగుతున్నదని పేర్కొన్నారు.

158
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles