పక్కా ప్లాన్‌తో.. ఆత్మహత్యలు?


Tue,July 3, 2018 11:57 AM

Cops recover handwritten notes with details of mass murder

-బాధ్ పూజ కోసమే తనువు చాలించారా?
-కుటుంబసభ్యులు ఎవరెవరు ఏం చేయాలో ముందే రాసుకున్నారు!
-జూన్30న దేవుడిని కలుస్తున్నామంటూ రాసిన కాగితాలు లభ్యం
-ఢిల్లీ సామూహిక మరణాల ఘటన వెనుక తాంత్రిక కోణం

న్యూఢిల్లీ, జూలై 2: ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే ఇంట్లో 11మంది అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాధ్ పూజ పేరిట ఉన్న కొన్ని పత్రాల్లో పేర్కొన్న విధంగానే వారంతా తనువు చాలించారని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ ఇంట్లో తనిఖీ చేసిన అధికారులకు చేతిరాతతో కూడిన అనేక పత్రాలు లభ్యమయ్యాయి. సామూహిక ఆత్మహత్యలకు సంబంధించి కుటుంబసభ్యులు ఏమేం చేయాలి? అని రాసి ఉన్న కాగితం దొరికిందని, దానికి అనుగుణంగానే ఘటానాస్థలంలోని దృశ్యాలు, సంఘటన జరిగిన తీరు ఉందని ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన 11మంది తమ ఇంట్లోనే ఆదివారం విగతజీవులుగా మారడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మృతుల్లో నారాయణ్‌దేవి (77) అనే వృద్ధురాలు, ఆమె కూతురు ప్రతిభ (60), ఇద్దరు కొడుకులు భవనీష్ (50), లలిత్ భాటియా (45), భవనీష్ భార్య సవిత (48), వారి పిల్లలు మీనూ (23), నీతూ (25), ధృవ్ (15), లలిత్ భాటియా భార్య టీనా (42), కొడుకు శివమ్ (15), ప్రతిభ కూతురు ప్రియాంక (33) ఉన్నారు. ఈ 11మందిలో 10మంది పైకప్పుకు వేలాడుతూ కనిపించగా, 77 ఏండ్ల నారాయణ్‌దేవి మృతదేహం పక్క గదిలో నేలపై పడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సామూహిక మరణాల్లో తాంత్రిక కోణం ఉందన్న విషయం దర్యాప్తులో బయటపడింది. ఎవరైనా స్వామీజీ ప్రభావానికి లోనై వారీ చర్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆత్మార్పణ ఎలా చేయాలో రాసుకున్నారు..

ఇంట్లో లభ్యమైన కొన్ని కాగితాల్లో మోక్ష ప్రాప్తి ఎలా పొందాలో రాసి ఉన్న పేపర్ కూడా ఉంది. అందులోనే కుటుంబసభ్యులు ఎవరెవరు ఎలా వ్యవహరించాలో రాసుకున్నారు. గురువారం లేదా ఆదివారం మాత్రమే ఈ చర్యకు దిగాలని, ఆ సమయంలో ఇంట్లో మసక వెలుతురు మాత్రమే ఉండాలని కూడా అందులో ఉంది. ప్రతీ ఒక్కరు కండ్లకు గట్టిగా గంతలు కట్టుకోవాలని, తాడుతోపాటు ఉత్తరీయం లేదా చీరను ఉపయోగించాలని రాసి ఉంది. బేబె (నానమ్మ) నిలబడ లేనందున ఆమె పక్కగదిలో పడుకోవాలని రాసుకున్నారు. అందరూ ఒకేలాగా ఆలోచించాలని, దృఢచిత్తంతో చర్యకు దిగాలని.. ఆ పత్రాల్లో ఉంది. ఎంత చిత్తశుద్ధితో ఈ చర్యకు దిగితే అంత మంచి ఫలితం ఉంటుందని అందులో రాసి ఉంది. అర్ధరాత్రి 12 నుంచి ఒంటిగంట మధ్య ఈ తంతు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. జూన్ 26 తేదీన రాసిన ఈ పేపర్లలో జూన్ 30న దేవుడిని కలువబోతున్నాం అని పేర్కొనడం గమనార్హం. చివరలో.. స్టూల్‌ని వాడటం ద్వారా, కండ్లు, చెవులు,నోరు పూర్తిగా కట్టేసుకోవడం ద్వారా మాత్రమే మోక్షం లభిస్తుంది అని రాసి ఉంది.

వట వృక్షం తరహాలో..

తమకు లభ్యమైన కాగితాలో బాధ్ పూజ కోసమని పేర్కొన్నారని పోలీసులు చెబుతున్నారు. అందరూ మర్రిచెట్టు శాఖల్లాగా వేలాడాలి అని అందులో ఉందని వారంటున్నారు. ఎవరూ ఫోన్లు వాడరాదని అందులో ఉన్నందునే మృతులు తమ ఆరుఫోన్లను సైలెంట్ మోడ్‌లో పెట్టుకున్నారని స్పష్టమవుతున్నది. మానవ దేహం తాత్కాలికం. కండ్లు, నోరు మూసుకోవడం ద్వారా భయాన్ని జయించవచ్చు అని ఓ కాగితంపై ఉందని పోలీసులు తెలిపారు. దేవుడే తమను కాపాడుతాడని వారు నమ్మి ఉంటారని భావిస్తున్నారు. ఒకే బెడ్‌షీట్‌ను ముక్కలుగా కట్‌చేసి.. వారి కండ్లు, నోళ్లు, చేతులు కట్టివేశారు. ఆ కుటుంబం దేవుడిని బాగా నమ్ముతుందని, రోజుకు మూడుసార్లు పూజలు చేస్తారని పొరుగున ఉన్నవారు చెబుతున్నారు. వారు మూఢభక్తులేమీ కారని, వేరెవరో వారిని హత్యచేసి ఉండవచ్చునని బంధువులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

కుక్కను గొలుసుతో కట్టేశారు..

మరణించడానికి ముందు శనివారం రాత్రే వారు పెంపుడు కుక్కను గొలుసుతో కట్టేశారు. పోలీసులు దాన్ని గుర్తించే సమయానికి అది 108 ఫారన్‌హీట్ డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నది. కుక్క బాగా దూకుడుగా, ఆగ్రహంతో ఉందని.. దాన్ని శాంతపరిచేందుకు గంటన్నరకుపైగా సమయం పట్టిందని నోయిడాకు చెందిన సంజయ్ మహాపాత్ర తెలిపారు. ఘటన జరిగినరోజు రాత్రంతా కుక్క ఏమాత్రం అరువలేదని ఇరుగుపొరుగు కుటుంబాలు తెలిపాయి.

ప్రియాంకకు ఇటీవలే నిశ్చితార్థం

మృతురాలు ప్రతిభ కూతురు ప్రియాంకకు గత నెలలో నిశ్చితార్థం జరిగింది. ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 33 ఏండ్ల ప్రియాంకకు ఎంగేజ్‌మెంట్‌ను కుటుంబం ఘనంగా నిర్వహించిందని స్థానికులు తెలిపారు. ఈ ఏడాది చివర్లో పెండ్లికి నిర్ణయించారని, పెండ్లి కుదిరిన సంతోషంలో ప్రియాంక కొద్దిరోజులుగా చాలా ఉత్సాహంగా కనిపించిందని స్థానికులు చెప్పారు.

sucides2

మృతదేహాలపై పెనుగులాడిన ఆనవాళ్లేవీ లేవు: పోస్టుమార్టం నివేదిక

11 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఎనిమిదిమందికి సంబంధించిన నివేదికను సోమవారం విడుదల చేశారు. వృద్ధురాలు నారాయణ్‌దేవి, ఇద్దరు పిల్లలు, మరో ఐదుగురు ఉరి వల్లే ఊపిరాడక మృతిచెందారని, మరణానికి ముందు వారు పెనుగులాడినట్లుగా, వారిపై ఏదైనా దాడి జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలూ లభ్యంకాలేదని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వెల్లడించింది. మరో మూడు మృతదేహాలకు సంబంధించిన శవపరీక్ష నివేదిక రావాల్సి ఉన్నది. గొంతు పిసకడం వల్ల నారాయణదేవి చనిపోయి ఉంటారని మొదట భావించారు. కానీ, మెడకు పాక్షికంగా తాడు బిగుసుకుపోవడం వల్లనే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. అయితే ఆమె మెడనుంచి తాడును ఎవరు తొలిగించారన్నది మాత్రం దర్యాప్తులో తేలాల్సి ఉన్నది. తుది నివేదిక తయారీలో వైద్యనిపుణులు నిమగ్నమయ్యారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మృతదేహాలకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.

Burari-Pipes

ఇంటి పైకప్పు గోడపై 11 పైపులు

ఆత్మార్పణ కోసం ఆ కుటుంబం చాలారోజులుగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బురారీలోని ఆ ఇంటి కుడివైపు గోడపై పైభాగాన 11 ప్లాస్టిక్ పైపుల్ని ఏర్పాటు చేసుకోవడం ఒళ్లు జలదరింపజేస్తున్నది. సిమెంట్‌గోడలోనే ఒకే దగ్గర 11 పైపుల్ని వాటి ఒక కొనలు బయటకు ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో నాలుగు పైపుల కొనలు సూటిగా ఉండగా, మిగతావి వంకరగా ఉన్నాయి. వాటిని నీటి కోసం ఏర్పాటు చేసుకున్న పైపులుగా ఇరుగుపొరుగువారు భావిస్తూ వచ్చారు. ఆదివారం రోజు ఆ కుటుంబ సభ్యులు ఇంటి పైభాగాన ఉన్న ఇనుప చువ్వల జాలీకి తాళ్లు బిగించుకుని ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఆ పైపుల్ని ఎందుకు ఏర్పాటు చేశారన్నది మిస్టరీగా మారింది.

2550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles