-అధికారిక సమీక్షలో ఆయన సమీప బంధువు హాజరుపై విపక్షం విమర్శలు
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన సోమవారం జరిగిన ఒక సమీక్షలో ఆయన సమీప బంధువు, శివసేన అనుబంధ సంఘం యువసేన కార్యదర్శి వరుణ్ సర్దేశాయ్ పాల్గొనడం వివాదస్పదమైంది. ఈ సమావేశంలో సీఎం కొడుకు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. దీనిపై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి మాధవ్ భండారీ బుధవారం స్పందిస్తూ.. సీఎం కార్యాలయంలో ప్రత్యామ్నాయ అధికార కేంద్రం ఏర్పాటవుతున్నట్లు కనిపిస్తున్నది. కొత్త ప్రభుత్వం ఒక తప్పుడు సంప్రదాయాన్ని నెలకొల్పింది అని విమర్శించారు. ప్రభుత్వ భాగస్వామి ఎన్సీపీ సైతం ఈ చర్యను విమర్శించింది. ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయనకు పాలనానుభవం లేదు. అయినా ప్పటికీ ఇటువంటి ఘటన పునరావృతం కారాదు అని వ్యాఖ్యానించారు. అయితే తాను పాల్గొనడానికి పెద్ద ప్రాధాన్యం లేదని సర్దేశాయ్ కొట్టివేశారు.