-ఆర్టీఐ కార్యకర్త, జర్నలిస్టుపైనా నమోదు
-పౌరసత్వ బిల్లును వ్యతిరేకించారంటూ అభియోగాలు
గువాహటి, జనవరి 10: పౌరసత్వ బిల్లును వ్యతిరేకించిన ముగ్గురు ప్రముఖులపై అసోంలో దేశద్రోహం కేసు నమోదైంది. సాహిత్య అకాడమీ పుర స్కార గ్రహీత, అస్సామీ సాహితీవేత్త హిరేన్ గొహెయిన్ (80), ఆర్టీఐ కార్యకర్త అఖిల్ గొగోయ్, జర్నలిస్టు మంజిత్ మహంతలపై కేసు నమోదు చేశామని ఓ పోలీసు అధికారి గురువారం వెల్లడించారు. మూడు రోజుల క్రితం ఈ ముగ్గురు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆ ముగ్గురిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, తమంతట తామే (సుమోటోగా) కేసు నమోదు చేశామని నగర పోలీస్ కమిషనర్ దీపక్‌కుమార్ చెప్పారు.
దీనిపై హిరేన్ గొహెయిన్ స్పందిస్తూ, తనపై కేసు నమోదైన విషయం తెలిసిందని, అయితే ఏ ఆధారాలతో కేసు నమోదు చేశారో తెలియదని చెప్పారు. వివిధ పార్టీలు భారత రాజ్యాంగం పరిధిలో అస్సామీల ప్రయోజనాలను కాపాడలేనప్పుడు, ఇక్కడి ప్రజలకు స్వతంత్ర అసోం కోరడం మినహా మరో గత్యంతరం ఉండదు అన్నది తన ప్రసంగ సారాంశమని గొహెయిన్ వివరించారు. మరోవైపు పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ అసోంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.