రాజ్‌నాథ్‌ ఆయుధ పూజ డ్రామా

Thu,October 10, 2019 01:19 AM

- కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు
- తిప్పికొట్టిన బీజేపీ


న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో తొలి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని స్వీకరించిన అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆయుధ పూజ నిర్వహించడం.. కాంగ్రెస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆయుధ పూజ ఒక డ్రామా అని, రక్షణ సముపార్జనను బీజేపీ రాజకీయం చేస్తున్నదని కాంగ్రెస్‌ మండిపడింది. ఆ పార్టీ నేత రషీద్‌ అల్వీ మాట్లాడుతూ.. ‘ఇది డ్రామాల ప్రభుత్వం. మీరు ఫ్రాన్స్‌కు వెళ్లి, ఆయుధ పూజ నిర్వహిస్తున్నారు. లేకపోతే రాఫెల్‌ జెట్‌ భారత్‌కు రాదా? విదేశాలకు వెళ్లి మీరు ఈ డ్రామాలు ఆడుతున్నారు’ అని విమర్శించారు. రాజ్‌నాథ్‌ ఆయుధ పూజ తమాషాగా ఉందని తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆయుధ పూజను విమర్శించడం తన ఉద్దేశం కాదని, అయితే రాఫెల్‌ అందజేత, ఇతర సాంకేతిక అంశాల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు.

రాఫెల్‌ భారత్‌కు రావడానికి 6-8 నెలల సమయం పడుతుందని, అలాంటప్పుడు వారు అక్కడ పూజ చేయడం ఎందుకుని, భారత్‌కు వచ్చాక చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తీవ్రంగా మండిపడ్డారు. గతంలో ఖత్రోచీ సేవలో మునిగిన వారికి ప్రస్తుతం ఆయుధ పూజ సమస్యగా మారిందని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హయాంలో బోఫోర్స్‌ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో ఖత్రోచీ మధ్యవర్తిగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. బుధవారం హర్యానా ఎన్నికల సభలో అమిత్‌షా మాట్లాడుతూ.. విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించడం మన సంప్రదాయం అని చెప్పారు. అందుకే రాఫెల్‌కు పూజచేశామని, ఇది కాంగ్రెస్‌కు తమాషాగా కనిపిస్తున్నదని విమర్శించారు.

201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles