చిదంబరం విడుదల

Thu,December 5, 2019 02:58 AM

-ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
-105 రోజుల తర్వాత తీహార్ జైలు నుంచి బయటికి..
-నామీద ఒక్క చార్జిషీట్ దాఖలు చేయలేకపోయారు: చిదంబరం
-కావాలనే ఇరికించారు: కాంగ్రెస్.. బెయిల్ క్లబ్‌కు స్వాగతం: బీజేపీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో 105 రోజులపాటు తీహార్ జైలులో గడిపిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం బుధవారం విడుదల అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూ రుచేసింది. దీంతో బుధవారం రాత్రి 8:10 గంటలకు ఆయన జైలు నుంచి బయటికి వచ్చారు. ఆయన కొడుకు కార్తీ చిదంబరంతోపాటు వందలమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు స్వాగ తం పలికారు. తర్వాత కార్తీ తన తండ్రిని కారులో ఎక్కించుకొని జోర్‌భాగ్‌లో ఉన్న తమ ఇంటికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ.. నన్ను 106 రోజులు జైలులో ఉంచారు. అయినా నామీద ఒక్క చార్జిషీట్ కూడా దాఖలు చేయలేకపోయారు అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని చెప్పారు. రాజ్యసభ ఎంపీ అయిన చిదంబరం.. గురువారం సభకు హాజరయ్యే అవకాశం ఉన్నదని సమాచారం. చిదంబరాన్ని ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఆగస్ట్ 21న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అప్పటి నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అక్టోబర్ 16న చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్నది. ఆ తర్వాత ఆరు రోజులకే సీబీఐ కేసులో బెయిల్ వచ్చినా.. ఈడీ కేసు ఉండటంతో జైలులోనే ఉన్నారు.

షరతులతో కూడిన బెయిల్

ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలన్న చిదంబరం విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు గతనెల 15న తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని జస్టిస్‌లు ఏఎస్ బోపన్న, హృషికేశ్ రాయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వాదోపవాదనలు విన్న అనంతరం పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. రూ.2 లక్షల పూచీకత్తు, ఇద్దరి జమానతు సమర్పించాలని సూచించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని, ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టంచేసింది. తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని, సాక్షులను ప్రభావితం చేసే, ఆధారాలను మార్చే చర్యలకు పాల్పడొద్దని ఆదేశించింది. అంతకుముందు ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ చిదంబరం కస్టడీలో ఉన్నప్పుడే కీలక ఆధారాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆర్థిక నేరాలు చాలా తీవ్రమైనవని, ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని, ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకం పోతుందని చెప్పారు. ఈడీ ఆరోపణలన్నీ నిరాధారమని చిదంబరం తరఫు న్యాయవాదులు కపిల్ సిబల్, ఏఎం సింఘ్వీ ఖండించారు. ఈ కేసులో చిదంబరం ప్రమేయం ఉన్నట్టు నేరుగా నిరూపించే సాక్ష్యాలేవీ ఈడీ వద్ద లేవన్నారు. ఆయన సాక్షులను ప్రభావితం చేసినట్టు, ఆధారాలను చెరిపేసేందుకు ప్రయత్నించినట్టు ఆధారాలు కూడా లేవన్నారు. వాదోపవాదనలను విన్న అనంతరం చిదంబరానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.

కక్షసాధింపు చర్యల్లో భాగంగానే..: కాంగ్రెస్

చిదంబరానికి బెయిల్ మంజూరు కావడంపై పలువురు కాంగ్రెస్‌నేతలు హర్షం వ్యక్తంచేశారు. చిదంబరం స్వేచ్ఛావాయువు పీల్చడం తనకు సంతోషంగా ఉన్నదని సోనియాగాంధీ పేర్కొన్నా రు. బీజేపీ ప్రభుత్వం ప్రతీకారం, కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చిదంబరాన్ని 100 రోజులకుపైగా జైలులో ఉంచిందని రాహుల్ విమర్శించారు. చిదంబరం సైతం తనకు బెయిల్ మంజూరుచేయకపోవడంపై ఇటీవల అసహనం వ్యక్తంచేశారు. బెయిల్ ఇవ్వకపోవడానికి నేనేమైనా బిల్లా-రంగానా?అని ధర్మాసనాన్ని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌వి అవినీతి సంబురాలు: బీజేపీ

బెయిల్ మంజూరుతో కాంగ్రెస్ చేస్తున్న హడావుడిని అవినీతి సంబురాలుగా బీజేపీ అభిరవర్ణించింది. బెయిల్‌పై వచ్చిన కాంగ్రెస్ నేతల క్లబ్‌లో చిదంబరం కూడా చేరారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా ఎద్దేవా చేశారు.

464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles