హార్దిక్‌పై దాడి


Sat,April 20, 2019 02:21 AM

Congress leader Hardik Patel slapped at a rally in Gujarat

-ఎన్నికల సభలో మాట్లాడుతుండగా చెంపపై కొట్టిన ఓ వ్యక్తి
-పాటిదార్ ఉద్యమం సందర్భంగా తన భార్యాపిల్లలు ఇబ్బందులు పడ్డారనే దాడి చేశానని వెల్లడి
-నన్ను చంపడానికి బీజేపీ కుట్ర: హార్దిక్
అహ్మదాబాద్, ఏప్రిల్ 19: కాంగ్రెస్ నాయకుడు, గుజరాత్ పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్‌ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటన శుక్రవారం గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఉన్న బల్దానా గ్రామంలో చోటుచేసుకుంది. హార్దిక్ పటేల్ ఎన్నికల సభలో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న తరుణ్ గజ్జర్ అనే వ్యక్తి ఆయన వద్దకు వెళ్లి చెంపపై కొట్టాడు. దీంతో వెంటనే తేరుకున్న హార్దిక్ అతడితో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో హార్దిక్ మద్దతుదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరుణ్ గజ్జర్‌పై దాడి చేశారు. దీంతో గాయాలపాలైన గజ్జర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. హార్దిక్ మాట్లాడుతూ తనను చంపడానికి బీజేపీ కుట్ర పన్నింది. అందులో భాగంగానే ఈ దాడి జరిగింది. గజ్జర్ బీజేపీకి చెందిన వ్యక్తి. ఒకవేళ అతడి వద్ద తుపాకీ ఉంటే ఈ రోజు నా ప్రాణాలు పోయేవి అని తెలిపారు. గుజరాత్ బీజేపీ నాయకుడు రాజు ధృవ్ స్పందిస్తూ బీజేపీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయదు.

తన రాజకీయ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవడానికి పాటీదార్ సామాజికవర్గాన్ని అడ్డం పెట్టుకొని హార్దిక్ ఇలాంటి వేషాలు వేస్తున్నారు అని పేర్కొన్నారు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, ప్రజల సానుభూతిని కూడగట్టుకోవడానికి కావాలనే దాడి చేయించుకొని నాటకాలాడుతున్నారని ఆరోపించారు. గజ్జర్ స్పందిస్తూ నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. హార్దిక్‌పై దాడి చేయడానికి మూడున్నరేండ్ల నుంచి ప్లాన్ చేస్తున్నాను. 2015లో పాటిదార్ ఉద్యమం జరిగినప్పుడు నా భార్య గర్భవతి. ఉద్యమ ఆందోళనల నేపథ్యంలో అప్పుడు ఇబ్బంది పడ్డా. తర్వాత అతడు అహ్మదాబాద్‌లో సభ నిర్వహించినప్పుడు నా బిడ్డకు మందులు తేవడానికి బయటికి వెళ్లా. రోడ్లన్నీ మూసిఉండటంతో మళ్లీ ఇబ్బంది పడ్డా. అందుకే అతడికి గుణపాఠం నేర్పాలనుకున్నా. ఓ సారి కలోల్ సభ సందర్భంగా దాడి చేయాలనుకున్నా. కానీ ఆయన రాలేదు. మరోసారి బలిసానా సభ సందర్భంగా ప్రయత్నించి విఫలమయ్యా. కానీ ఇప్పుడు విజయం సాధించా. నేను పాటిదార్లకు వ్యతిరేకం కాదు.. హార్దిక్‌కు మాత్రమే వ్యతిరేకం అని తెలిపారు. హార్దిక్ పటేల్ గుజరాత్ హిట్లర్ అని విమర్శించారు.

447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles