ఏం జరుగనుంది?


Wed,May 16, 2018 01:43 AM

Congress JDS alliance can deny BJP a chance to form government in Karnataka

-అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీని ఆహ్వానిస్తారా?
-కూటమికట్టిన కాంగ్రెస్-జేడీఎస్‌కు అవకాశమిస్తారా?
-హంగ్ నేపథ్యంలో అందరి దృష్టి గవర్నర్ నిర్ణయంపైనే..

Siddu-Kumaraswamy
బెంగళూరు, మే15: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లభించని నేపథ్యంలో తర్వాత ఏం జరుగనున్నదనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం 224 అసెంబ్లీస్థానాలకు 222 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. బీజేపీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కకూడదన్న యోచనలో ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్‌కు మద్దతు ప్రకటించింది. కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపడితే బయటినుంచి మద్దతిస్తామని తెలుపగా దేవెగౌడ సానుకూలంగా స్పందించారు. అయితే ఎవరికి సీఎం పగ్గాలు అప్పగించాలన్న అంశం పూర్తిగా రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ రుడాభాయ్ వాలా చేతుల్లో ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వజూభాయ్ గుజరాతీ. పైగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూడా. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నసమయంలో 2012 నుంచి 2014వరకు వాలా స్పీకర్‌గా వ్యవహరించారు. అపార రాజకీయ అనుభవం ఉన్న ఆయన తీసుకోబోయే నిర్ణయాలే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి. గతంలో ఉన్న రాజ్యాంగ సంప్రదాయాలను అనుసరించి అధిక స్థానాలు సాధించిన పార్టీకి ప్రభుత్వ బాధ్యతలు అప్పగించి శాసనసభ విశ్వాసాన్ని నిరూపించుకునేందుకు నిర్ణీత గడువు ఇవ్వవచ్చని రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రకారం చూస్తే కర్ణాటక పరిణామాలు, గవర్నర్ ముందు ఆప్షన్లు ఇలా ఉండవచ్చు..

ఆప్షన్ : 1

అధిక స్థానాలు సాధించిన పార్టీగా మొదటి అవకాశం బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది. యడ్యూరప్పకు పగ్గాలు అప్పగించి నిర్ణీత సమయంలోగా సభ విశ్వాసాన్ని పొందాలని గవర్నర్ ఆదేశించవచ్చు. అయితే జేడీఎస్-కాంగ్రెస్‌లు తమను మొదట పిలువాలని పట్టుబడితే అంతగా ప్రాముఖ్యత ఉండదు. ఎన్నికలకు ముందే తప్ప ఫలితాల అనంతరం ఏర్పడిన కూటములను అంతగా పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. ఆ ప్రకారం చూసినా బీజేపీకే అవకాశాలు ఎక్కువ.

ఆప్షన్ : 2

కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ ఉమ్మడిగా తమకు మద్దతు తెలుపుతున్న సభ్యుల వివరాలను గవర్నర్‌కు సమర్పించవచ్చు. వాటిని పరిశీలించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు చేయమని వీరిని కోరవచ్చు. అయితే ప్రభుత్వ ఏర్పాటును బీజేపీ తిరస్కరిస్తే తప్ప వీరికి అవకాశం రాదన్న అంశాన్ని గుర్తుంచుకోవాలి. అయితే కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండాలని గవర్నర్ యోచిస్తే తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి వీరి అభ్యర్థనను మన్నించవచ్చనే వాదన కూడా వినిపిస్తున్నది.

ఆప్షన్ : 3

గంటల్లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్న తరుణంలో ఒకవేళ జేడీ(ఎస్) మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలనూ కొట్టిపారేయలేం. 2006-07 మధ్యకాలంలో జేడీఎస్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి కుమారస్వామి సారథ్యం వహించిన విషయం తెలిసిందే. రొటేషన్ పద్ధతిలో సీఎం పదవిని పంచుకునేలా ఈసారి ఒప్పందం కుదిరే అవకాశమూ ఉంది. జేడీ(ఎస్) అధినేతగా దేవెగౌడ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Siddu-Kumaraswamy2
Siddu-Kumaraswamy3
Siddu-Kumaraswamy1

1207

More News

VIRAL NEWS

Featured Articles