Telangana Intermediate 1st & 2nd Year Results 2019

రాహుల్..కల నెరవేరేనా?


Wed,March 20, 2019 11:52 AM

Congress declares Rahul as party face for LS polls

-రాష్ర్టాల్లో పుంజుకున్నా.. సొంతంగా
-మెజార్టీ కష్టమేఏదో ఒక కూటమితో జత కడితేనే అందలం

మోదీని అధికారం నుంచి దింపి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 2019 ఎన్నికల్లో నెరవేరుతుందా? ఫలితాల అనంతరం ఏదో ఒక కూటమితో జత కట్టకపోతే అధికారం అందుకొనే పరిస్థితి లేదు. 2014లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితికి.. ఇప్పటికి చాలా తేడా ఉన్నది. 2014లో బీజేపీ నేత, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఒక విధమైన మేనియా ఉండేది. యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు రెండూ కూడా మన్మోహన్‌సింగ్ ప్రధాని అయినప్పటికీ రిమోట్ ద్వారా సోనియా నడిపించారనేది ప్రధాన ఆరోపణ. ఆ పదేండ్లకాలంలో కూడా అవినీతి ఆరోపణలు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వెల్లువెత్తాయి. కామన్వెల్త్, 2జీ, కోల్‌గేట్.. అన్నీ లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలే.. ఈ నేపథ్యంలోనే దేశం మోదీవైపు మొగ్గుచూపింది. ఆ సమయంలో మోదీ వేవ్ ఓటర్లను కమ్మేసింది.

మోదీ అధికారంలోకి వచ్చిన మొదటి రెండేండ్లు ఆయనపై ప్రజల భ్రమలు పెద్దగా తొలిగిపోలేదు. పెద్దనోట్ల రద్దు నాటి నుంచి మోదీ ప్రతిష్ఠ మసకబారుతూ వచ్చింది. అదే సమయంలో అప్పటిదాకా స్తబ్దంగా ఉండిపోయిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని పార్టీ పగ్గాలను రాహుల్‌గాంధీకి అప్పగించిన తర్వాత ఆయన దూకుడు పెరిగింది. కేంద్ర ప్రభుత్వంపైనా.. మోదీపైన ఆయన విరుచుకుపడుతున్న తీరు.. ఆయనలో మార్పును స్పష్టంగా సూచిస్తున్నది. ఆయన ప్రసంగాల్లో వేడి పెరిగింది. రఫేల్ వ్యవహారాన్ని రాహుల్ డీల్ చేసిన తీరు మోదీ టీంని రక్షణాత్మక పరిస్థితిలోకి నెట్టేసింది. రాహుల్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఆర్థిక, రక్షణ మం త్రులు, పార్టీ నాయకులు నానా తంటాలు పడ్డారు.

2017 నుంచి కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా పుంజుకుంటున్నట్టే కనిపిస్తున్నది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవా, మణిపూర్‌లలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా అవతరించింది. బీజేపీ ఇతర మైనార్టీ సభ్యులను కలుపుకొని ఈ రెండు రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చినప్పటికీ.. కాంగ్రెస్‌దే పైచేయి కావడం గమనార్హం. ఆ తర్వాత కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును దీటుగా ఎదుర్కొని నిలబడింది. ఇక్కడ బీజేపీ అత్యధికసీట్లు గెలుచుకున్నప్పటికీ.. కాంగ్రెస్ కూడా గోవాలో బీజేపీ తరహా రాజకీయం చేసి జేడీ(ఎస్) అధినేతతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఎన్నికల ఫలితాల సరళి వస్తుండగానే రాహుల్‌గాంధీ, జేడీఎస్ నేత కుమారస్వామితో మాట్లాడి.. సీఎం సీటు ఆఫర్ చేయడంతో.. బీజేపీకి అడ్డుకట్టపడింది. ఆ తర్వాత మోదీ గ్రాఫ్ పడిపోతుండటం.. కాంగ్రెస్ పుంజుకోవడం వేగంగా జరిగింది. తాజాగా 2018 డిసెంబర్‌లో జరిగిన అయిదు రాష్ర్టాల అసెంబ్లీల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయలేకపోయింది. పెద్ద రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తోపాటు ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకున్నది. తెలంగాణలో రెండు జాతీయ పార్టీల అడ్రస్‌లు గల్లంతయ్యాయి. గుడ్డిలో మెల్ల అన్నట్టు మిజోరాంలో మిజోనేషనల్ ఫ్రంట్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోగలిగింది.

మ్యాజిక్ ఫిగర్ కష్టమే..

ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించాలన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కల నెరవేరాలంటే కాంగ్రెస్ 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి అంత సీన్ ఉన్నట్టు కనిపించడంలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాలు ఛత్తీస్‌గఢ్ (11), కర్ణాటక (28), మధ్యప్రదేశ్ (29), పంజాబ్ (13), రాజస్థాన్ (25), పుదుచ్చేరి (1). ఈ ఆరు రాష్ర్టాల్లో మొత్తం లోక్‌సభ స్థానాలు 107 ఉన్నాయి. వీటిలో అరవై శాతం సీట్లు గెలుచుకున్నా 62కు మించవు. గోవా, మణిపూర్ అసెంబ్లీల్లో అత్యధిక సీట్లు ఉన్న పార్టీగా ఉండ టం వల్ల అక్కడ ఉన్న నాలుగు సీట్లలో కాంగ్రెస్‌కు ఎంతవరకు లాభిస్తుందో చూడా లి. ఇలాంటి చిన్నచిన్న రాష్ర్టాల్లో ఎన్ని సీట్లు వచ్చినా ఢిల్లీ పీఠం చేరువకావడం అంత తేలికకాదు.

పొత్తులకు పోతేనే అధికారం

ఎవరో ఒకరితో పొత్తులకు పోతే తప్ప అధికారం దక్కే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. కాంగ్రెస్ మిత్రపక్షాలకు లభించే సీట్లను బట్టి రాహుల్ ప్రధాని కావాలన్న కల నెరవేరుతుందా లేదా అన్నది తేలుతుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పొత్తులు పెట్టుకున్న రాష్ర్టాల్లో ఎక్కువ సీట్లు ఉన్న రాష్ర్టాల్లో తమిళనాడు, బీహార్ ఉన్నాయి. తమిళనాడులో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఇక్కడ మొత్తం 39 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఈ రాష్ర్టానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేలు కూడా డీఎంకేకు అనుకూల ఫలితాలు వస్తాయని చెప్తున్నాయి. ఇది కాంగ్రెస్‌కు నిస్సందేహంగా మేలుచేసే అంశమే. ఇక బీహార్‌లో ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ 40 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మోదీ-నితీశ్ కూటమి బలంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి ఏ మేరకు సీట్లు గెలుస్తుందన్నది చూడాలి. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్‌కు ఇటీవలి కాలంలో తీవ్రంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. శబరిమల వివాదమయితేనేమి.. ఇతరత్రా కారణాల వల్ల కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు. కేరళలో 20 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపినా.. ఆధిక్యం మాత్రం యూడీఎఫ్‌కే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 42 సీట్లున్న పశ్చిమబెంగాల్‌లో కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ పోటీచేస్తున్నది. ఇక్కడ ఇప్పటికీ మమతాదీదీ బలంగా ఉన్నారు. దీనికితోడు బీజేపీ బలం కూడా పెరుగుతున్నదని సర్వేలు చెప్తున్నాయి. మూడు దశాబ్దాలపాటు అప్రతిహతంగా రాజ్యమేలిన కమ్యూనిస్టులను పదవీచ్యుతుల్ని చేసి అందలమెక్కిన మమత ఇప్పటికీ కోలుకోనివ్వలేదు. బెంగాల్‌లో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రమే. అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఏ మేరకు కమ్యూనిస్టుల పొత్తు కాంగ్రెస్‌కు లాభిస్తుందో చూడాలి.

యూపీలో ప్రియాంక ప్రభావం!

అన్నింటికీ మించి దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ స్థానాలు సాధించుకోవడానికి ప్రియాంకాగాంధీ వాద్రాను కాంగ్రెస్ తురుపుముక్కగా ప్రయోగించింది. యూపీలో ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీతో కలిసి పోటీచేయాలని కాంగ్రెస్ ముందుగా భావించినప్పటికీ.. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్ తిరస్కరించడంతో అన్ని సీట్లలో పోటీకి సిద్ధపడాల్సి వచ్చింది. ఎస్పీ-బీఎస్పీ పొత్తు పెట్టుకొని కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఆఫర్‌చేశాయి. అవి కూడా సోనియా, రాహుల్ సొంత నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీ. ఈ రెండింటిలోనూ పోటీ పెట్టబోమని చెప్పడం కాంగ్రెస్‌కు మింగుడుపడలేదు. తాజాగా కాంగ్రెస్ ఎస్పీ-బీఎస్పీకి ఏడు సీట్లు ఇస్తామని ప్రతిపాదించడంతో మాయావతి భగ్గుమన్నారు. బీజేపీని ఓడించడానికి తామిద్దరి కూటమి సరిపోతుందని పేర్కొన్నారు. దీంతో యూపీలో ముక్కోణపు పోటీ తప్పడంలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన రాహుల్ సోదరి ప్రియాంకపై ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నది. అధికార బీజేపీ, ఎస్పీ-బీఎస్పీ కూటమిని దాటుకొని ఒంటరిగా అత్యధికశాతం సీట్లు గెలుస్తుందన్న నమ్మకం పెద్దగా ఎవరికీ లేదు. మొత్తం మీద అన్ని చోట్లా కాంగ్రెస్ ఆశలు డోలాయమానంగా కనిపిస్తున్నాయి. ఫలితాల అనంతరం ఇతర పార్టీల కూటమితో జతకడితే తప్ప అధికారం దక్కే పరిస్థితి లేదు. 2004లో 145 సీట్లతోనే కాంగ్రెస్ (యూపీఏ-1) ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2009లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు 206. వీటితోనే యూపీఏ-2 అధికారం చేపట్టింది. ప్రస్తుతానికైతే బీజేపీయేతర పక్షాలు మోదీని గద్దె దింపడానికి కృతనిశ్చయంతో ఉన్నాయి. ఇప్పుడు పొత్తులు పెట్టుకోనప్పటికీ.. ఫలితాలు వెలువడిన అనంతరం మద్దతిచ్చే మిత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. దీనిపైనే రాహుల్ కల సాకారమయ్యే పరిస్థితి ఆధారపడి ఉంటుంది.

మహారాష్ట్రలో ఎన్సీపీతో పొత్తు

25 సీట్లున్న ఈశాన్యరాష్ర్టాల్లో బీజేపీ వ్యూహాత్మకంగా అధికారం చేజిక్కించుకున్నది. మోదీ సర్కారు ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ హక్కు బిల్లు ఈశాన్య రాష్ర్టాల్లో తీవ్ర ఆందోళనలు సృష్టించింది. బీజేపీ తీసుకున్న ఈ చర్య పట్ల దాని మిత్రపక్షమైన అసోం గణపరిషత్ ఒక దశలో దూరమైనప్పటికీ, చివరికి పొత్తుతోనే ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఈ పరిణామం కాంగ్రెస్‌కు కొంతమేరకు మేలు కలిగించే అంశమే. మహారాష్ట్రలో ఎన్సీపీతో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పునర్వైభవం సాధించే దిశగా పావులు కదుపుతున్నది. మరాఠా మాంత్రికుడు శరద్ పవార్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకోవడం కొంత నిరాశ కలిగించే అంశమే. కానీ, 48 స్థానాలున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సొంతంగా ఉన్న బలం తక్కువేమీ కాదు. బీజేపీ-శివసేనల మధ్య కృతకంగా కొనసాగుతున్న పొత్తు.. కాంగ్రెస్‌కు లాభిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ అధికారం పంచుకున్నప్పటికీ ఇంతకాలం ఉప్పునిప్పుగానే ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేశాయి. శివసేన లేకుండా బీజేపీ మహారాష్ట్రలో మనలేదని స్థానిక ఎన్నికల ఫలితాల్లోనే తేలిపోయింది. పొత్తు లేకపోతే ఫలితాలు తారుమారవుతాయని గ్రహించిన బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సీటు ఆశచూపి శివసేనతో పొత్తు కుదుర్చుకున్నది. అయితే.. గత మూడేండ్లుగా ఈ రెండు పార్టీల మధ్య ప్రత్యక్షంగా జరుగుతున్న యుద్ధాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు పొత్తు కుదిరిన తర్వాత కూడా మోదీపై శివసేన విమర్శలు ఆగలేదు. ఈ పరిస్థితులను కాంగ్రెస్ ఎంతమేరకు సొమ్ము చేసుకుంటుందన్నది చూడాలి.
- సెంట్రల్ డెస్క్

622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles