టీఆర్‌ఎస్ ఎంపీల శుభాకాంక్షలు


Tue,July 18, 2017 01:25 AM

Congratulations to Venkaiah Naidu from TRS MPs

venkaiahnaidu
న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: వెంకయ్యనాయుడి పేరు ఖరారు చేసిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే సీఎం కేసీఆర్ వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాజ్యసభాపక్ష నేత కే.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డితో పాటు బి.వినోద్‌కుమార్, కవిత తదితర టీఆర్‌ఎస్ ఎంపీలంతా వెంకయ్యనాయుడిని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం అని వ్యాఖ్యానించారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో చురుకైన పాత్ర పోషించారని, తాజాగా ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ఆమోదం లభించడంలోనూ, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపుకోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంలోనూ చొరవ స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కరీంనగర్ పట్టణానికి స్మార్ట్‌సిటీ హోదాతో పాటు అనేక అంశాల్లో తెలంగాణకు చేసిన సహకారాన్ని ఈ సందర్భంగా ఆయనతో పంచుకున్నారు.
venkaiahnaidu2

వెంకయ్య సేవలు దేశానికి అవసరం : ఎంపీ కవిత


విశేషమైన రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభ చైర్మన్‌గా సభను సజావుగా, సమర్ధవంతంగా నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్న వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యులుగా దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నారని, అనేక అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగిన, పట్టు ఉన్న వెంకయ్యనాయుడి సేవలు ఉపరాష్ట్రపతిగా దేశానికి అవసరమని ఆమె అన్నారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడి మొదలు బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి వరకు వెంకయ్యనాయుడు బాధ్యతలు నిర్వర్తించారని, ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా, పార్లమెంటేరియన్‌గా, మంత్రిగా సమర్ధతను రుజువు చేసుకుని ఇప్పుడు ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని ఎంపీ వినోద్ అన్నారు. ప్రభుత్వ సలహాదారు జీ వివేక్ మాట్లాడుతూ రాజకీయ అనుభవం ఇప్పుడు దేశానికి రాజ్యాంగ అనుభవంగా మారుతుందని, అనేక అంశాలపై సమగ్రమైన అవగాహన ఉన్న వెంకయ్యనాయుడిని ప్రధాని మోదీ సరైన స్థానానికి ఎంపిక చేశారని అన్నారు.

ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ అభినందన


ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాడును ప్రకటించడంతో రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సోమవారం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. వెంకయ్యనాయుడుగారు ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన మీకు శుభాకాంక్షలు, హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ లకా్ష్మరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభను సమర్ధవంతంగా నడిపించే నాయకుడు అవసరమని భావించే బీజేపీ పార్లమెంటరీ బోర్డు తెలుగు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడిని ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు.
venkaiahnaidu3

ప్రశంసల వెల్లువ


బీజేపీ నిర్ణయం తీసుకోవడానికి ముందే ఊహాగానాలు రావడంతో పార్లమెంటులో సోమవారం ఉదయమే ముందస్తు శుభాకాంక్షల పర్వం ప్రారంభమైంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే రాజ్యసభకు వచ్చిన వెంకయ్యనాయుడికి పలు పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

నామినేషన్‌ను ప్రతిపాదించిన టీఆర్‌ఎస్ పత్రాలపై జితేందర్‌రెడ్డి సంతకం


న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: అధికార ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం వెంకయ్యనాయుడు నామినేషన్ పత్రాలపై టీఆర్‌ఎస్ సంతకం చేసింది. సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు వెంకయ్యనాయుడు నామినేషన్ పత్రాలపై టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్‌రెడ్డి సోమవారం రాత్రి సంతకం చేశారు. నామినేషన్ పత్రాలను జితేందర్‌రెడ్డి వద్దకు రాజస్థాన్‌లోని కోట ఎంపీ ఓం బిర్లా తెచ్చారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కూడా ఉన్నారు. అంతకుముందు టీఆర్‌ఎస్ ఎంపీలు.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడిని ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్యనాయుడిని ఎంపిక చేసిన సమాచారం స్వయంగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌కు ఫోన్‌చేసి వివరించారని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ మద్దతు ఇవ్వాలని కోరారన్నారు. వెంకయ్య నాయుడి ఎంపికపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారని చెప్పారు. టీఆర్‌ఎస్ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బాల్క సుమన్, ప్రొఫెసర్ సీతారాం నాయక్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్ తదితరులు వెంకయ్యనాయుడును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

268

More News

VIRAL NEWS