ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీసు

Thu,November 14, 2019 04:30 AM

-సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు
-సీజేఐ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థేనన్న ధర్మాసనం
-సుప్రీంకోర్టుపై నిఘాకు ఆర్టీఐని వినియోగించొద్దని సూచన
-12 ఏండ్ల వివాదానికి ముగింపు
-గతంలో తను వెలువరించిన తీర్పును..తాజాగా వ్యతిరేకించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, నవంబర్‌ 13:సుప్రీంకోర్టు బుధవారం మరో సంచలన తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి వస్తుందని తీర్పు చెప్పింది. సీజేఐ కార్యాలయం కూడా ఒక ప్రభుత్వ సంస్థేనని స్పష్టం చేసింది. సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌, సుప్రీంకోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి అత్యున్నత న్యాయస్థానంలో మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలో జస్టిస్‌లు ఎన్వీ రమణ, డీవై చంద్రచూడ్‌, దీపక్‌ గుప్తా, సంజీవ్‌ ఖన్నాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. బుధవారం ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. న్యాయమూర్తులు రాజ్యాంగబద్ధమైన పదవులను అనుభవిస్తున్నారని, ప్రజా విధులు నిర్వర్తిస్తుంటారని, కాబట్టి న్యాయవ్యవస్థ విధుల్లో పూర్తిస్థాయి గోప్యత పాటించడం సాధ్యం కాదన్నారు. సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని స్పష్టంచేశారు. అయితే సుప్రీంకోర్టుపై నిఘాకు ఆర్టీఐని ఓ ఆయుధంగా వినియోగించవద్దని సూచించారు. జడ్జీలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లను మాత్రమే తెలియజేస్తామని, ఇందుకు గల కారణాలను వెల్లడించలేమని తెలిపారు. ఆర్టీఐ కింద సీజేఐ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చే సమయంలో వ్యక్తిగత గోప్యత, పారదర్శకత, న్యాయవ్యవస్థ స్వతంత్రత మధ్య సమతూకం పాటించాలని స్పష్టం చేశారు. ఎలాంటి ఉల్లంఘనలకు తావివ్వొద్దని ఆదేశించారు. ‘సుప్రీంకోర్టులో సీజేఐదే అత్యున్నత స్థానం. కాబట్టి ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 28ను అనుసరించి ఏయే సమాచారాన్ని అందించవచ్చు? ఏయే అంశాల్లో గోప్యత పాటించాలి? ఫీజు ఎంత? వంటి నిబంధనలను సీజేఐ రూపొందిస్తారు’ అని అని ధర్మాసనం తన 108 పేజీల తీర్పులో తెలిపింది.

పుష్కరకాలంగా నలుగుతున్న వివాదం

సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తేవాలన్న పోరాటానికి 12 ఏండ్ల చరిత్ర ఉన్నది. సుప్రీంకోర్టు 1997 మే 7న చేసిన తీర్మానం మేరకు న్యాయమూర్తులందరూ తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలి. ఈ వివరాలను సీజేఐకి సమర్పిస్తారు. ఇవి ప్రజలకు అందుబాటులో ఉండవు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ ఆర్టీఐ కార్యకర్త సుభాష్‌ చంద్ర అగర్వాల్‌ 2017లో అత్యున్నత న్యాయస్థానంలో ఆర్జీ పెట్టుకున్నా రు. దీంతోపాటు జస్టిస్‌లు హెచ్‌ఎల్‌ దత్తు, ఏకే గంగూలీ, ఆర్‌ఎం లోధాను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించినప్పుడు కొలీజియం, సీజేఐ మధ్య జరిగిన సంభాషణల వివరాలను కూడా అందించాలని కోరారు. ఈ అర్జీని పరిశీలించిన సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది. అప్పట్లో సీజేఐగా జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ ఉన్నారు. సుప్రీంకోర్టు తిరస్కరణ నేపథ్యంలో అగర్వాల్‌ కేంద్ర సమాచార కమిషన్‌ను (సీఐసీని) ఆశ్రయించారు. విచారణ జరిపిన కమిషన్‌.. సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, ఎలాంటి వివరాలైనా వెల్లడించాల్సిందేనని తీర్పునిచ్చింది. దీంతో సీఐసీ తీర్పు ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు 2009 జనవరి లో ఢిల్లీ హైకోర్టునులో వ్యాజ్యం దాఖలు చేసిం ది.

ఆస్తుల వివరాల వెల్లడి న్యాయమూర్తుల వ్యక్తిగత సమాచారం కిందికి వస్తుందని, ఇది ఆర్టీఐ పరిధిలోకి రాదని పేర్కొన్నది. దీంతోపాటు న్యాయవ్యవస్థ స్వతంత్రతను అత్యధిక పారదర్శకత దెబ్బతీస్తుందని వాదించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం.. సీఐసీ తీర్పును సమర్థించింది. సీజేఐ ఆర్టీఐ పరిధిలోకి వస్తారని 2009 సెప్టెంబర్‌ 2న తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు 2009 నవంబర్‌లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, జస్టిస్‌లు విక్రమ్‌జిత్‌ సేన్‌, ఎస్‌ మురళీధర్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు రెండు నెలలపాటు విచారణ జరిపిన ధర్మాసనం.. 2010 జనవరి 10వ తేదీన సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ తీర్పు వెలువరించింది. సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తే న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందన్న సుప్రీంకోర్టు వాదనను తిరస్కరించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రత అనేది ఒక బాధ్యత మాత్రమేనని పేర్కొన్నది. ఈ తీర్పును అప్పటి సీజేఐ కేజీ బాలకృష్ణన్‌ వ్యక్తిగత ఓటమిగా కొందరు అభివర్ణించారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ను సుప్రీంకోర్టు సవాల్‌ చేస్తూ.. 2010లో సుప్రీంకోర్టులోనే వ్యాజ్యం దాఖలు చేయడం విశేషం. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌, సుప్రీంకోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి దాఖలుచేసిన పిటిషన్లపై మొదట సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆరేండ్ల తర్వాత కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదలాయించింది. సుభాష్‌ చంద్ర అగర్వాల్‌ తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. మూడేండ్ల విచారణ తర్వాత ధర్మాసనం తీర్పును వెలువరించింది. సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ తాజా గా తీర్పునిచ్చింది. 2007లో సుభాష్‌ చంద్ర ఆగర్వాల్‌ ఆర్జీని తిరస్కరించిన సుప్రీంకోర్టు.. 12 ఏండ్ల తర్వాత ఇప్పుడు దానికి అనుకూలంగా తీర్పునివ్వడం మరో విశేషం.

స్వాగతించిన నిపుణులు, కార్యకర్తలు

సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తెస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పలువురు ఆర్టీఐ, హక్కుల కార్యకర్తలు స్వాగతించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని మరోసారి స్పష్టమైందని ఆర్టీఐ కార్యకర్త, రిటైర్డ్‌ కమాండర్‌ లోకేష్‌ భాత్రా పేర్కొన్నారు. ‘న్యాయవ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచే దిశగా వేసిన గొప్ప అడుగు. జడ్జీలంతా ఇకపై జవాబుదారీగా ఉంటారు’ అని కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ మాజీద్‌ మీనన్‌ తెలిపారు. న్యాయమూర్తులందరూ మానవమాత్రులేనని, వారిలోనూ లోపాలుంటాయని వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో ఏ కోర్టు నుంచైనా.. ఏ జడ్జి గురించైనా సమాచారం పొందే హక్కు ప్రజలకు లభించిందన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పును నేను స్వాగతిస్తున్నా. అయితే ఆర్టీఐని న్యాయవ్యవస్థపై నిఘాకు వినియోగించొద్దన్న వ్యాఖ్యలు మాత్రం ఆశ్చర్యపరిచాయి’ అని కామన్‌వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనిషియేటివ్‌ సంస్థ అధిపతి వెంకటేశ్‌ నాయక్‌ పేర్కొన్నారు.

759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles