స్వలింగ సంపర్కంపై నిర్ణయం మీదే!


Thu,July 12, 2018 01:34 AM

Chief Justice Dipak Misra Indicates Ban On Gay Sex May Soon Be Gone

-ఐపీసీ సెక్షన్ 377 ప్రామాణికతను తేల్చాలని సుప్రీంకోర్టును కోరిన కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 11: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే ఐపీసీ సెక్షన్ 377 భవితవ్యాన్ని నిర్ణయించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు అప్పజెప్పింది. సదరు సెక్షన్‌కు గల రాజ్యాంగ ప్రామాణికతను పరిశీలించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర హోంమంత్రిత్వశాఖ.. కేవలం సెక్షన్ 377కు సంబంధించిన రాజ్యాంగ ప్రామాణికతను మాత్రమే పరిశీలించాలని.. మరే ఇతర అంశాల జోలికి వెళ్లినా అది చాలా దూరం వెళ్తుందని.. దాని పర్యావసానాలు వివిధ చట్టాలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నది.

ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా లైంగిక సంబంధాన్ని కలిగి ఉండటాన్ని సెక్షన్ 377 నేరంగా పేర్కొంటున్నది. పురుషుడు, స్త్రీ లేదా జంతువులతో ప్రకృతికి విరుద్ధంగా శారీరక సంబంధం కలిగి ఉన్నట్టు నిర్ధారణ అయితే దోషులకు జీవితఖైదు లేదా జీవితఖైదుతోపాటు అదనంగా పదేండ్ల జైలు, జరిమానా విధిస్తారు. ప్రైవేటు ప్రదేశంలో పరస్పర అంగీకారంతో కూడిన లైంగికచర్య అనే అంశానికి సంబంధించి ఇప్పటివరకు సెక్షన్ 377కు ఉన్న రాజ్యాంగ ప్రామాణికతను నిర్ణయించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకే వదిలేస్తున్నది అని హోంమంత్రిత్వశాఖ పేర్కొన్నది. దీనికి మించి భారత శిక్షా స్మృతిలోని మరేదైనా అంశానికి సంబంధించిన ప్రశ్నకు లేదా ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్స్, క్వీర్) వర్గాలకు సంబంధించిన ఇతర హక్కులకు సుప్రీంకోర్టు భాష్యం చెప్పే పక్షంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించే పూర్తిస్థాయి అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి అని తెలిపింది. ప్రస్తుత పిటిషన్లన్నీ దాదాపు సెక్షన్ 377కి సంబంధించి మాత్రమే దాఖలైన నేపథ్యంలో.. ఆ పరిధిని దాటి విచారణ చేయాల్సి వస్తే ప్రభుత్వంతో విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది.

376

More News

VIRAL NEWS