4 రోజుల కస్టడీకి


Fri,August 23, 2019 03:56 AM

Chidambaram sent to 4 day CBI custody till August 26

-చిదంబరంను విచారణ కోసం సీబీఐకి అప్పగించిన ప్రత్యేక న్యాయస్థానం
-విచారణ సందర్భంగా కోర్టులో ఆసక్తికర వాదనలు
-ఐఎన్‌ఎక్స్ మీడియా స్కాం మూలాలను, క్విడ్‌ప్రోకోను బయటపెట్టాల్సి ఉంది
-చిదంబరం తమకు సహకరించడంలేదన్న సీబీఐ
-సీబీఐ విచారణలో మొత్తం పాత ప్రశ్నలే అడిగారన్న చిదంబరం
-కుటుంబ సభ్యులు, లాయర్లు రోజూ కలిసేందుకు అవకాశం
-కుంభకోణం మూలాలను, క్విడ్‌ప్రోకోను బయటపెట్టాల్సి ఉన్నదని వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరంను సీబీఐ అధికారులు విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఆయనకు 4 రోజుల కస్టడీ విధించింది. ఆయన తరఫు లాయ ర్లు, కుటుంబసభ్యులు రోజూ వెళ్లి అరగంట కలిసేందుకు అవకాశం ఇచ్చింది. రెండు రోజులకోసారి చిదంబరానికి వైద్యపరీక్షలు జరుపాలని ఆదేశించింది. చిదంబరం తమకు సహకరించ డం లేదని, మరింత లోతుగా ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ఐదు రోజుల కస్టడీ విధించాలని సీబీఐ కోరింది. వాదోపవాదాలు విన్న తర్వాత ఈ నెల 26వరకు కస్టడీ విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో బుధవారం అరెస్టయిన చిదంబరాన్ని సీబీఐ అధికారులు గురువారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. జడ్జి అజయ్ కుమార్ కుహర్ వాదనలు విన్నారు. చిదంబరంను కుర్చీలో కూర్చోవాలని జడ్జి సూచించగా, ఆయన సున్నితంగా తిరస్కరించారు. గంటన్నరపాటు వాదనలు కొనసాగాయి. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ సీబీఐ అధికారులు అడిగే ప్రశ్నలకు చిదంబరం సరైన జవాబులివ్వడం లేదని, వారికి సహకరించడం లేదన్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు బయటికి రావాలంటే చిదంబరానికి ఐదురోజుల సీబీఐ కస్టడీ విధించాలన్నారు. ఈ కుంభకోణం మూలాల వరకు వెళ్లాలని, క్విడ్‌ప్రోకో ను బయటపెట్టాల్సి ఉన్నదని చెప్పారు. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని, ఆయన కుమారుడు కార్తికి గతంలో కస్టడీ విధించడాన్ని గుర్తుచేశారు.

ఈ కేసులో కీలక చార్జిషీట్ రూపొందించే సమయంలో చిదంబరం నుంచి మరిన్ని విషయాలు రాబట్టడం ఎంతో అవసరమన్నారు. అక్రమ లావాదేవీల్లో చిదంబరం నిందితుడిగా ఉన్నారన్నారు. సీబీఐ ఆరోపణల్ని చిదంబరం తరఫు న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ వ్యతిరేకించారు. ఈ కేసులో మిగతా నిందితులైన చిదంబరం కుమారుడు కార్తీ, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ భాస్కర్ రామన్, ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్‌కు బెయిల్ మంజూరైందని గుర్తుచేశారు. ఇంద్రాణి, పీటర్ ప్రస్తుతం వేరే కేసులో జైలులో ఉన్నట్టు చెప్పా రు. అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. సాధారణంగా ఏదైనా కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటే రిమాండ్ విధిస్తుంటారని, ఈ కేసు ఇప్పటికీ ఇంద్రాణి ముఖర్జీ వాగ్మూలంపైనే నడుస్తున్నదన్నారు. సీబీఐకి నచ్చినట్లు జవాబులు చెప్పడం అసాధ్య మని, దీని ఆధారంగా కస్టడీ కోరడం సమంజసం కాదన్నారు. అంతేకాక చిదంబరం ఎక్కడికీ పారిపోరని, ఈ కేసు సాక్ష్యాలను ఆయన తా రుమారు చేస్తారనడానికి సీబీఐ వద్ద ఏ ఆధారాలు లేవన్నారు. కపిల్ సిబల్ వాదిస్తూ చిదంబరం దర్యాప్తునకు సహకరించడం లేద న్న సీబీఐ వాదనలను కొట్టివేశారు. చిదంబరం ను గురువారం మధ్యాహ్నం విచారించారని, ఏ ప్రశ్నలు అడుగాలో తెలియని స్థితిలో అధికారులు ఉన్నారన్నారు. అధికారులు మొత్తం 12 ప్రశ్నలు అడుగగా, అందులో ఆరింటికి చిదంబరం గతంలోనే జవాబిచ్చారని తెలిపారు. ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత చిదంబరానికి జడ్జి 4 రోజుల కస్టడీ విధించారు.

Chidambaram2

అప్పుడు అతిథి.. ఇప్పుడు నిందితుడు

ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని ఎనిమిదేండ్ల కిందట చిదంబరమే ప్రారంభించారు. ఇప్పుడదే కార్యాలయానికి నిందితుడిగా వెళ్లా రు. 2011లో చిదంబరం కేంద్ర హోం మం త్రిగా జూన్ 30న సీబీఐ నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించగా, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాడు ఏపీ సింగ్ సీబీఐ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ భవనంలో వాస్తులోపం ఉన్నదని, శ్మశానంపై నిర్మించారని కొందరు అప్పట్లో పేర్కొన్నారు. ఏది ఏమైనా కొత్త భవనం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు పనిచేసిన సీబీఐ చీఫ్‌లపై పలు ఆరోపణలొచ్చాయి. ఏపీ సింగ్, ఆయన తర్వాత వచ్చిన రంజిత్ సిన్హా సీబీఐ కేసులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన అనిల్ సిన్హా.. ఆర్థిక నేరగాడు విజయ్‌మాల్యా తప్పించుకోవడానికి సాయం చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక అలోక్ వర్మ అవమానకర రీతిలో పదవి నుంచి తప్పుకున్నారు.

జాబితాలో లేకపోయినా విచారణ

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టుకు అందగా.. ఆ రోజే విచారణ జరుపాలని న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. దీనికి జస్టిస్ ఎన్వీ రమణ నిరాకరించారు. జాబితాలో పిటిషన్ నమోదుకాకుండా ఇప్పటికిప్పుడు విచారణ జరుపలేం అని స్పష్టం చేశారు. ఈ కేసు భిన్నమైనదన్నారు. అయితే నాలుగు రోజుల ముందే ఓ కేసును నాటి జాబితాలో లేకున్నా జస్టిస్ ఎన్వీ రమణ విచారణకు స్వీకరించారు. ఆర్థిక నేరాల కేసులో భూషణ్ స్టీల్స్ సంస్థ మాజీ డైరెక్టర్ నితిన్ జోహ్రీకి ఢిల్లీ హైకోర్టు ఈ నెల 16న బెయిల్ మంజూరు చేసింది. నితిన్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నదని వెంటనే స్టే విధించాలని కోరుతూ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ జాబితాలో లేకున్నా జస్టిస్ ఎన్వీ రమణ విచారణకు స్వీకరించి స్టే విధించారు.

ఓ హంతకురాలి వాంగ్మూలంతో అరెస్ట్: కాంగ్రెస్ విమర్శలు

న్యూఢిల్లీ: తమ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం అరెస్ట్‌పై కాంగ్రెస్ మండిపడింది. కూతురి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జియా వాంగ్మూలం ఆధారంగా ఆయన్ను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. సీబీఐ, ఈడీ ద్వారా ప్రభుత్వం వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా గురువారం మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ప్రభుత్వం పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని ఎలా హత్య చేసిందో దేశమంతా గమనించింది. అధికారంలో ఉన్నవారు సీబీఐ, ఈడీ ద్వారా వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నారు. కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన తీరు దీనికి నిదర్శనం. దీని వెనక ఉన్న ఏకైక కారణం వ్యక్తిగత, రాజకీయ ప్రతీకారం అని విమర్శించారు.

100 ప్రశ్నలు

చిదంబరాన్ని అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేసినా.. గురువారం ఉదయం వరకు ఎలాంటి విచారణ జరుపలేదు. ఉదయం 10.30కు అధికారుల బృందం విచారణ ప్రారంభించింది. డీఎస్పీ ఆర్ పార్థసారథి నేతృత్వంలోని బృందం దాదాపు 100 ప్రశ్నలను సిద్ధం చేసుకొని చిదంబరం వద్దకు వెళ్లినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయనను పలు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.

748
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles