జాబిలమ్మను ఫొటో తీసిన చంద్రయాన్-2


Fri,September 6, 2019 11:50 AM

Chandrayaan 2 sends photo of Moon from 2650 kms away

-చంద్రయాన్-2 తొలి ఫోటోను విడుదల చేసిన ఇస్రో
-తుది ప్రక్రియ ఎంతో కీలకమన్న చైర్మన్ శివన్
-తొలి ఫొటో విశిష్టతను కొనియాడిన నాసా

బెంగళూరు/చెన్నె, ఆగస్టు 22: చంద్రయాన్-2 జాబిలమ్మను తొలిసారి ఫొటో తీసింది. ఇస్రో దీనిని గురువారం విడుదల చేసింది. చంద్రుడి ఉపరితలం నుంచి 2650 కి.మీ. ఎత్తులో ఉన్న చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్‌కు చెందిన ఎల్14 కెమెరా బుధవారం ఈ ఫొటో తీసినట్లు పేర్కొంది. మారే ఓరియంటల్ బేసిన్, అపోలో బిలాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. కాగా చంద్రయాన్-2 తొలి ఫొటో ఎంతో విశిష్టమైనదని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొనియాడింది. ఎద్దు కన్నును పోలిన మారే ఓరియంటల్ బేసిన్ చంద్రుడికి సంబంధించిన ఎంతో అద్భుతమైన ప్రాంతమని పేర్కొంది. సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రితం ఉల్క లాంటిది ఢీకొనడంతో 950 కి.మీ పరిధిలో ఇది ఏర్పడి ఉంటుందని అంచనా వేసింది. చంద్రుడి దక్షిణ గోళార్ధంలో రెండు వృత్తాకారాల మారిదిగా 538 కి.మీ వ్యాసం పరిధిలో ఏర్పడిన బిలం అపోలో అని తెలిపింది.

తుది ప్రక్రియ ఎంతో కీలకం: శివన్

సెప్టెంబర్ 7న వేకువజామున చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ మృదువుగా దిగనున్న తుది ప్రక్రియ ఈ మిషన్‌లో ఎంతో కీలకమైనదని ఇస్రో చైర్మన్ కే శివన్ చెన్నైలో తెలిపారు. గురువారం తమిళనాడు సీఎం పళనిస్వామి ఆయనను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డుతో సత్కరించారు. అనంతరం శివన్ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7 ఉదయం 1.40 నుంచి 1.55 మధ్య ల్యాండర్ చంద్రుడిపై దిగనున్నది. దీనికోసం ఉపగ్రహం వేగాన్ని పూర్తిగా నిలిపివేయడం ఎంతో క్లిష్టమైన దశ. దీనికి ముందు మరో మూడు ప్రక్రియలు చేపట్టాల్సి ఉన్నది. దీంతో చంద్రుడి తొలి కక్ష్యలోకి చంద్రయాన్-2 చేరుతుంది. సెప్టెంబర్ 2న ఆర్బిటార్ నుంచి ల్యాండర్ వీడి 100 కి.మీ. X 30 కి.మీ. కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అనంతరం సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ మృదువుగా దిగుతుంది అని వివరించారు.

925
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles